వైసీపీలో గుడివాడ అమర్నాథ్ సినిమా అయిపోయిందా?
posted on Jun 11, 2025 @ 10:47AM
వైఎస్ జగన్ హయాంలో ఏపీ ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది. గుడివాడ అమర్నాథ్ కు గుడ్డు మంత్రి అన్న బిరుదును కూడా సంపాదించుకున్నారు. ఇక గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న అతి కొద్ది మంది పార్టీ నేతలలో గుడివాడ కూడా ఒకరిగా ఉంటూ వచ్చారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో ఉన్నారా? లేదా అన్నట్లుగా ఆయన తీరు మారిపోయింది. పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆయన తీరును చూసి వైసీపీ వర్గీయులే ఆయన సినిమా అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో గుడివాడ అమర్నాథ్ అంతగా పార్టీకి దూరంగా మెసలడానికి కారణాలపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం మీద గుడివాడ అమర్నాథ్ పార్టీ అధినేత జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాత్రం తెలుస్తోంది. తాను కోరుకున్న నియోజకవర్గానికి తనను ఇన్ చార్జిగా నియమిం చలేదన్న అసంతృప్తి ఆయనలో బాగా పేరుకుపోయిందంటున్నారు.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అతి కొద్ది మంది నేతలలో గుడివాడ కూడా ఒకరని ముందే చెప్పుకున్నాం కదా? అలా మాట్లాడటమే కాదు.. తరచూ విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో కూడా గుడివాడ ముందుండేవారు. అటువంటి ఆయన ఇటీవల అసలు పార్టీ కార్యాలయం ముఖమే చూడటం లేదు. ఇందుకు కారణంగా ఆయన కోరుకున్న విశాఖ నగరం ఇన్ చార్జి పదవి దక్కకపోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యంత ఘోరం అనదగ్గ ఓటమిని చవి చూశారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. గుడివాడ అమర్నాథ్ పై పల్లా శ్రీనివాస్ ఏకంగా 95 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గుడివాడ విశాఖలో వాలిపోయారు. విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తనకు అప్పగిస్తారని గుడివాడ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం గుడివాడకు విశాఖ నగరం, రూరల్ కూడా కాకుండా చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గుడివాడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటున్నారు. అక్కడితో ఆగకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా గుడివాడను జగన్ పీకేశారు. ఇది తనకు పొమ్మనలేక పొగపెట్టడంగానే గుడివాడ అమర్నాథ్ భావిస్తున్నారంటున్నారు.
2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ఉన్న ఆయనను ఆ నియోజకవర్గ నుంచి తప్పించి చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇవ్వడమే అవమానం అనుకుంటే.. ఎన్నికల తరువాత గాజువాక ఇంచార్జ్ గానైనా కొనసాగించకుండా తప్పించడం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా లేకుండా చేయడంతో.. గుడివాడ కూడా పొమ్మనలేక పొగబెడుతున్నారన్న భావనకు వచ్చేశారంటున్నారు. అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటూ సైలెంటైపోయారని పరిశీలకులు విశ్లేషి స్తున్నా రు.