మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కనిపించుట లేదు..!
posted on Sep 21, 2022 @ 11:05AM
ఎంత అన్నారు.. ఎంత ఎగిరారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.. మంత్రి హోదాలో ఆ టైమ్‌లో హీరోలాగా కోర మీసాన్ని మెలి తిప్పేశాడు.. తొడ కొట్టేశాడు. కానీ మంత్రి పదవిని మిఠాయి పొట్లాన్ని కాస్తా కాకి ఎత్తుకుపోయిన చందంగా ఆయన జిల్లాకే చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డి ఎత్తుకెళ్లిన తర్వాత, మాజీ అయిన అనిల్ కుమార్ యాదవ్ సోదిలోనే లేకుండా పోయారు. దీంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ అదృశ్యమైపోయారంటూ సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి పదవి ఊడిపోయి ... ఇంకా ఆరు నెలలు పూర్తి కాలేదు... అప్పడే... అనీల్ కుమార్ యాదవ్ కషాయం కట్టేశారా?.. కమండలం పట్టేసి.. సైలెంట్‌గా చెక్కేశారా? అంటూ ఆయన ప్రత్యర్థి వర్గం వ పంచ్‌లు మీద పంచులు పేలుస్తున్నారు తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే ఆ సమావేశాల్లో ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ కనిపించలేదు. దీంతో వైసీపీలోనే అనీల్ కుమార్ అంతర్ధానంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్ష టీడీపీని చీల్చి చెండాడే బృహత్తర అవకాశం. ఇలాంటి అవకాశాన్ని నెల్లూరు సీటి ఫైర్ బ్రాంబ్ అనీల్ కుమార్ యాదవ్ ఎందుకు ఉపయోగించుకోలేదన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
మరోవైపు నెల్లూరు నగర ప్రజలు తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ రేపో మాపో స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుు సమాయత్తమౌతున్నారని ప్రచారంలో ఉంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి జగన్ తొలి కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లను కూడా కాదని అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ మంత్రి పదవి కట్టబెట్టడంతో సీనియర్లు మింగలేక కక్కలేక మథన పడ్డారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను మీడియా సమావేశాలలో విమర్శలతో రఫ్పాడించాలంటే కొడాలి నాని తరువాత అనిల్ కుమార్ యాదవే అని అనుకునే స్థాయికి ఆయన ఎదిగిపోయారనడంలో సందేహం లేదు.
మరోవైపు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్.... ఆయన సొంత జిల్లా నేతలతోనే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించేవారని.. కానీ మంత్రి పదవి కాస్తా పోయే సరికి ఇటు సొంత జిల్లాలో పార్టీ నేతలతో సఖ్యత లేక.. అటు నియోజకవర్గంలో ఏ పనులూ చేయకపోవడంతో జనానికి ముఖం చూపించలేక సైలంటైపోయారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
కాగా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మార్పుపై అనిల్ కుమార్ యాదవ్ దృష్టి కేంద్రీకరించారని.. ఆయన వెంకటగిరి నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే అనిల్ కుమార్ యాదవ్‌కు ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్ మధ్య రాజకీయంగా ఓ రేంజ్ లో ఫైట్ జరుగుతోందనీ, దీంతో పరిస్థితి ప్రతికూలంగా ఉందని అర్థమైన అనిల్ కుమార్ యాదవ్ సైలంటై సైడైపోయారని అంటున్నారు.