ప్యాలెస్ జగన్నాథం..!
posted on Mar 13, 2024 @ 11:26AM
తాడేపల్లిలో ఓ ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఒక ప్యాలెస్, బెంగళూరు ఎయిర్ పోర్టు సమీపంలో యహలంకలో మరో ప్యాలెస్, కడప జిల్లా పులివెందులలో ఇంకో ప్యాలెస్, విశాఖ రిషికొండలో లేటేస్ట్‌గా ఓ ప్యాలెస్ ఇలా ప్యాలెస్ పేర్లు చెప్పగానే అందరికీ చటుక్కన గుర్తుకు వచ్చే పేరు జగన్. ఇలా జిల్లాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు చూడకుండా.. నిర్మించిన ప్యాలెస్‌లన్నీంటికి ఒకే ఒక్క యజమాని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఎకరాలకు ఎకరాల్లో ఈ ప్యాలెస్‌లన్నీ కోట్లాది రూపాయిలు వెచ్చించి మరీ నిర్మించారు.
అయితే వీటిలో కొన్ని ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. నిర్మించిన ఫ్యాలెస్‌లు కొన్ని అయితే.. ఆయన గతించిన అనంతరం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా తాడేపల్లిలో ఓ ప్యాలెస్ నిర్మించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన.. రిషి కొండపై ఇంకో ప్యాలెస్ నిర్మించారు. ఆయన ఏ స్థానంలో ఉన్నా అంటే ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన స్థాయి మాత్రం ప్యాలెస్‌లో కింగ్ అన్నట్లుగానే ఉందనే ఓ బలమైన ముద్ర అయితే జనంలో పడిపోయింది.
రాజధాని అమరావతి ప్రాంతానికి కూత వేటు దూరంలో తాడేపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ప్యాలెస్ నిర్మించుకున్నారని... రాజధాని అమరావతికి మద్దతుగానే ఆయన ఇక్కడ నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నారనీ ఆ పార్టీలోని కీలక నేత ఆర్కే రోజాతోపాటు పలువురు నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే జగన్ అధికారంలోకి రావడంతోనే.. మూడు రాజధానుల ప్రకటన చేసి, కార్య నిర్వాహక రాజధాని విశాఖపట్నం అంటూ.. సాగర తీర నగరంలోని రుషి కొండకు బొడి గుండు కొట్టించి మరీ ఆ కొండ మీద వందల కోట్ల రూపాయిల ప్రజా ధనంతో భారీ ప్యాలెస్ నిర్మించారు.
అయినా రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా?.. ప్రభువు తలుచుకుంటే ప్యాలెస్‌లకు కొదవా? అన్నట్లుగా జగన్ వైఖరి ఉందని జన బాహుళ్యంలో ఒక అభిప్రాయం అయితే బలంగా వ్యక్తం అవుతోంది. వివిధ వేదికల మీద నుంచి ఆయన చేసే ప్రసంగాలు ఆయన వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్‌కు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంటాయని కూడా జనం నవ్వుకోవడం కద్దు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో.. అంటూ ఆయన వివిధ సభల్లో జగన్ తరచు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. పేదలు ఎవరు?.. పెత్తందార్లు ఎవరు? అనే అర్ధాన్ని ముందు ఆయన తెలుసుకొంటే మంచిదని విపక్షాలు ఎద్దేవా చేస్తుంటారు కూడా.
అయినా.. ఉండీ దరిద్రం లేకా దరిద్రం అంటే ఇదే నేమో , ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు... నాలుగు కాదు.. ఏకంగా అయిదు ప్యాలెస్‌లు... అవి కూడా లక్షల కోట్ల రూపాయిల విలువ చేసే ప్యాలెసులు.. ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా నిర్మితమై ఉన్నాయని.. అవి కూడా ముఖ్య నగరాల్లో ఉన్నాయి. ఒకరికి ఒక ఇల్లు ఉంటుంది. మరికొందరికీ రెండు ఇళ్లు ఉంటాయి.. కానీ ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మాత్రం.. ఇలా అయిదు రాజ ప్రసాదాలు ఉన్నాయి.
దేశ ప్రధమ మహిళ భారత రాష్ట్రపతికి దేశ రాజధాని హస్తినలో రాష్ట్రపతి భవన్ పేరుతో ఒక నివాసం ఉంటే.. భరత రాష్ట్రపతికి వేసవి విడిది కేంద్రాలు.. అటు హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఒకటి.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరోకటి ఉన్నాయి. అయితే అవి ప్రభుత్వానివి. కానీ ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు మాత్రం ప్రాంతానికి ఒకటి .. రాష్ట్రానికి ఒకటి అన్నట్లుగా ప్యాలెస్‌లు ఉన్నాయి. ఆయన పేదరికం గురించి మాట్లాడటమేంటని జనం విస్తుపోతున్నారు.
ఒక సామాన్య కుటుంబానికి ఒక ఇల్లు.. అంటే సింగిల్ బెడ్ రూమ్ లేదా డబుల్ బెడ్ రూమ్ ఉంటే.. ఆ ఇంటిని మేయింటేన్ చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందని.. వైయస జగన్ మాత్రం ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు నిర్మిస్తూ.. వాటి మెయింటినెన్స్‌కు చేస్తున్న ఖర్చులను ఓ సారి పరిశీలిస్తే.. కళ్లు బైర్లు కమ్మి.. సొమ్మసిల్లి పడిపోవాల్సిందేనని పేర్కొంటున్నారు.
అయినా కష్టించి పని చేస్తేనే.. తిన్న ఆహారం రక్తంలోకి ఇంకుతోందనే విషయాన్ని జమానాలోనే జనం మరిచిపోయారని... అలాంటి వేళ.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. ఊళ్లుకు ఊళ్లు కొట్టేస్తూ.... ఇళ్లుకు ఇళ్లు.. కట్టేస్తూ.. ప్యాలెస్‌లకు ప్యాలెస్‌లు నిర్మిస్తుంటే.. ప్రశ్నించేదెవరు? అడ్డగించేదెవరు? అడ్డు పడేద్దెవరు, అయినా జగన్ అధికారంలోకి రాగానే.. తన నివాసానికి సీసీ కెమెరాలు, మరమ్మతుల రూపేణా ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వెచ్చించిన సంగతి అందరికీ తెలిసిందేనని.. ప్రజల చే, ప్రజల కోరకు, ప్రజలే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య దేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ అమాయకుడిలా.. ప్రజా ధనాన్ని ఇలా.. ఇంత నిర్లజ్జగా.. వాడేస్తుంటే.. ఇది తప్పు అని ప్రశ్నించే వారే లేకపోవడంపై సర్వత్రా అవేదన వ్యక్తమవుతోంది.