రామ్ చరణ్ 'తుఫాన్' కు హైకోర్ట్ షాక్
posted on Mar 28, 2013 8:57AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలివుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా, సంజయ్ దత్త్, ప్రకాష్ రాజ్, శ్రీ హరి తదితరులు నటించిన హిందీ సినిమా జంజీర్, దాని తెలుగు వెర్షన్ తుఫాన్ సినిమాల ట్రయలర్ విడుదల, ప్రదర్శనపై బొంబాయి హైకోర్టు స్టే విదించింది. ఈ సినిమాను నిర్మించిన అమిత్ మెహ్రా రిమేక్ హక్కుల విషయంలో తమను మోసగించాడంటూ ఆయన సోదరులు పునిత్ మెహ్రా మరియు సుమిత్ మెహ్రాలు కేసువేయడంతో బొంబాయి హై కోర్టు నిన్న స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
1973లో విడుదలయిన అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాను వారి తండ్రి ప్రకాష్ మెహ్రా నిర్మించారు. అందువల్ల, ఆ సినిమాకు రిమేక్ గా తయారయిన జంజీర్ మరియు తుఫాన్ సినిమాలలో తమకు కూడా రిమేక్ హక్కులు కలిగి ఉనందున, తమకు న్యాయంగా చెల్లించవలసిన సొమ్మును చెల్లించడానికి నిరాకరిస్తూ తమ సోదరుడు అమిత్ మెహ్రా మోసం చేస్తునందున సినిమా ట్రయలర్ విడుదల కాకుండా నిలిపి వేయాలని పునిత్ మెహ్రా మరియు సుమిత్ మెహ్రాలు కేసు వేయడంతో కోర్టు స్టే విదించింది.
ఇది కాకుండా అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాకు కధ అందించిన రచయితలు సలీం ఖాన్ మరియు జావేద్ అక్తర్ ఇరువురూ కూడా నిర్మాత అమిత్ మెహ్రా తమ కధను (తమ అనుమతి లేకుండా) వాడుకొంటున్నందుకు రూ.6 కోట్ల పరిహారం చెల్లించాలంటూ బొంబాయి హైకోర్టులో కేసులు వేసారు. సినీ రచయితల సంఘంలోనూ, యఫ్.డబ్ల్యు.ఐ.సి.ఈ.లో, వివాదాల పరిష్కార కమిటీ (డీయస్.సి)లోను కూడా పిర్యాదులు చేసారు.
మెగాభిమానులు అందరూ తమ హీరో రామ్ చరణ్ తేజ్ తుఫానులా దూసుకు వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో కోర్టులు ఆయన సినిమాకి జంజీర్ (సంకెళ్ళు) వేసి ఆపడంతో కొంచెం నిరాశ తప్పలేదు. ఈ సినిమాలను సకాలంలో విడుదల అయ్యేందుకు నిర్మాత అమిత్ మెహ్రా వీలయినంత త్వరగా ఈ కేసుల పరిష్కారం చేసుకోవలసి ఉంటుంది.లేకుంటే అది సినిమా విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.