రైతులను చంపిన కేంద్రమంత్రి తనయుడు.. రంగంలోకి ప్రియాంకగాంధీ..
posted on Oct 4, 2021 @ 11:20AM
అహంకారం తలకెక్కింది. తండ్రి కేంద్రమంతి అని పొగరు పెరిగింది. ఆవేశంతో రైతులను కారుతో గుద్దేశాడు ఆ తనయుడు. నలుగురిని పొట్టనపెట్టుకున్నాడు. రైతులు ఆగ్రహించడంతో యూపీలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. విషయం తెలిసి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఘటనా స్థలానికి బయలు దేరారు. ఆమెను పోలీసులు మధ్యలోనే ఆపేయడం మరింత టెన్షన్ క్రియేట్ చేసింది. రైతుల హత్యను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీలో ఆదివారం రైతులపైకి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారు. రైతులు ఆగ్రహంతో చెలరేగిపోయారు. ఎదురుదాడి చేశారు. పరిస్థితి అదుపుతప్పింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా స్థానికంగా 144 సెక్షన్ విధించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు.
కారు దూసుకెళ్లి నలుగురు రైతుల మరణానికి కారణమైన ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆ కారులో తన కుమారుడు ఉన్నాడన్న వార్తలను కేంద్ర మంత్రి ఖండించారు. ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ రైతు సంఘాలు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
మరోవైపు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను సీతాపుర్ పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం నెలకొంది. ‘నేనేం నేరం చేయడం లేదు. బాధిత కుటుంబాలను కలిసి, వారి బాధను పంచుకోవాలనుకుంటున్నాను. నన్ను అరెస్టు చేసేందుకు మీ వద్ద తగిన వారెంట్ ఉందా?. మీరు నన్ను, నా కారును ఏ కారణంతో ఆపుతున్నారు?’అని ప్రియాంక గాందీ పోలీసులను ప్రశ్నించారు.
ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి ఎస్‌ఎస్ రాంధవా తదితరులను లఖ్‌నవూ విమానాశ్రయంలో దిగేందుకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.