ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పోరాట సేద్యం! తిండి కోసం అక్కడే కూరగాయల సాగు!
posted on Dec 19, 2020 @ 11:27AM
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఉధృతమవుతోంది. తమ ఆందోళన 24వ రోజుకు చేరినా అన్నదాతల్లో ఏమాత్రం అలసట కనిపించడం లేదు. ఇప్పటివరకు 25 మంది రైతులు చనిపోయారని చెబుతున్నారు. ఉద్యమంలో పాల్గొంటూనే వందలాది మంది రైతులు అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. అయినా ఉద్యమం నుంచి వెనుకంజ వేయడం లేదు కర్షకులు. కేంద్రం దిగొచ్చేవరకు ఎన్ని రోజులైనా, అవసరమైతే నెలలైనా అక్కడే ఉంటాయమని స్పష్టం చేస్తున్నారు. రైతుల ఆందోళనకు రోజురోజు మద్దతు పెరుగుతోంది. వేలాది మంది కొత్తగా వచ్చి వారితో జత కలుస్తున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో మొదట వందల్లో మొదలైన ఆందోళన ఇప్పుడు లక్షల్లోకి చేరింది. ఢిల్లీ, హర్యానా సరిహద్దులో ఎక్కడ చూసినా పోరాట యోధులే కనిపిస్తున్నారు.
ఢిల్లీ సరిహద్దులో చేస్తున్న రైతుల పోరాటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ సంస్థలు దృష్టి సారించాయి. లక్షలాది మంది రైతులు రోడ్లపైకి వచ్చి ఇన్ని రోజులుగా ఎలా పోరాటం చేస్తున్నారు.. వారికి తిండి ఎలా వస్తోంది.. కనీస సౌకర్యాల మాటేంటి. ఇవే ఇప్పుడు రైతుల మహా పోరాటంపై వస్తున్న ప్రశ్నలు. అయితే తమ పోరాట కేంద్రాలుగా మారిన ఢిల్లీ సరిహద్దుల్లో పల్లెలనే నిర్మించారు రైతులు. సింఘా వద్ద ఒక పెద్ద గ్రామాన్నే స్పష్టించారు. సింఘాకు 10-15 కిలోమీటర్లు దూరం నుంచే ఈ కొత్త పల్లె ఆనవాళ్లు కనపడుతున్నాయి.
రోజువారీ ఆహారం కోసం గోధుమ పిండి, నూనెల వంటివి సేకరించి ఇక్కడ నిల్వ చేసుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్న నిత్యావసరాలను రాబోయే రోజుల కోసం భద్రంగా దాచుకుంటున్నారు. ఉద్యమ క్షేత్రం మధ్యలో పోరాట సేద్యం చేస్తున్నారు రైతులు. రోడ్డుపక్కన ఖాళీ స్థలంలోనే కూర గాయాలు సాగు చేస్తున్నారు. కొత్తిమీర, పుదీనాతో పాటు రకరకాల ఆకుకూరలను అక్కడే పండిస్తున్నారు. రోజూ వంటకాల్లో తాజావే వాడుతున్నారు.
పోరాటం ప్రారంభమైన తొలిరోజుల్లో రైతులు బృందాలు గా ఏర్పడి రోడ్డు పక్కనే వంట చేసుకునేవారు. ఒక్కో బృందంలో గరిష్టంగా 20 నుంచి 25 మంది ఉండేవారు. ఇప్పుడలా కాదు. ప్రతిరోజూ వేలాదిమంది పోరాటంలో చేరుతున్నారు. దీంతో వస్తున్న వారందరికి భోజనం పెడుతున్నారు. తమ వద్దకు వచ్చిన వారిని ఖాళీ కడుపులతో ఉంచకుండా తినడానికి ఏదో ఒకటి అందిస్తున్నారు. ఇందు కోసం రొట్టెల యంత్రాలు సమకూర్చుకున్నారు. కొన్ని హోటళ్లు, గురుద్వారా లలో వినియో గించే యంత్రాలను పెద్ద ఎత్తన సమీకరించారు. ఇప్పుడు గంటకు వెయ్యికి పైగా రొట్టెలను తయారు చేసే యంత్రాలు రైతుల దగ్గర ఉన్నాయి. ఉదయం నుంచి నాన్ స్టాప్ గా రొట్టెలు తయారవుతూనే ఉంటాయి. పోరాడేవారికి కావాల్సిన శక్తిని అందిస్తుంటాయి. రొట్టెలే కాదు పాలు, టీ, వేరుశనగలు... ఇలా ప్రతిదీ వేడివేడిగా అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు అన్నదాతలు.
దేశ రాజధాని సరిహద్దులో రైతులు నిర్వహిస్తోన్న మహా పోరాటంలో మహిళలు, పిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనకపోయినా.. ఉద్యమిస్తున్న వారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేస్తూ అన్నదాతల ఆకలి తీర్చుతున్నారు కొందరు మహిళామణులు. ఎప్పటికప్పుడు తాజా వంటకాలు అందిస్తూనే.. మరుసటి రోజు భోజనాలకు అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. మహిళలకు చిన్నారులు కూడా పెద్దఎత్తున సాయం చేస్తున్నారు. అన్నదాతలు నిర్మించిన పలెల్లో ఉద్యమ వ్యూహాలే కాదు.. ఎప్పటికప్పుడు తలెత్తే సమస్యల పరిష్కారం కోసం మేధోమథనమూ సాగిస్తున్నారు.