కడపలో ఫ్యామిలీ ఫైట్.. రంగంలోకి వైఎస్ భారతి?!
posted on Apr 12, 2024 @ 3:42PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అడ్డా కడప గడ్డ. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి 1984 నుంచి వరుసగా వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అటువంటి కడప గడ్డపై ఇప్పుడు ఎన్నికల పోరు వైఎస్ కుటుంబ సభ్యుల మధ్యే జరుగుతుండటం విశేషం. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పుడు కడప బరిలో ప్రధాన ఎన్నికల అజెండాగా మారిపోయింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్వయంగా కడప లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి.. వైసీపీ తరఫున ఇక్కడ రెండో సారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్యకు కుట్రదారుడు అవినాష్ రెడ్డి అనీ, ఆయనను తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నాడనీ ఆరోపిస్తూ షర్మిల నియోజకవర్గాన్ని చుట్టేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని, ఆయనను కాపాడుతున్న తన అన్న జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే ఏకైక ఎజెండాతో షర్మిల కడప బరిలో పోటీకి దిగారు. ఇక షర్మిలకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మద్దతుగా నిలుస్తూ ఆమె కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటం అవినాష్ కే కాకుండా ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఇబ్బందికరంగా పరిణమించింది. కడప బరిలో షర్మిల పది శాతం ఓట్లు సాధిస్తే అవినాష్ ఓటమి ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అసలే షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ వైఎస్ కు దన్నుగా ఉన్న కాంగ్రెస్ సంప్రదాయ ఓటు దాదాపుగా కాంగ్రెస్ వైపు మళ్లిపోవడం ఖాయమన్న అంచనాల మధ్య కడప బరిలో షర్మిల పోటీ ఆ నియోజకవర్గంలో అవినాష్ గెలుపు అవకాశాలను సంక్షిష్టం చేసింది. షర్మిలకు ఎంత మేరకు ఓటింగ్ శాతం పెరిగితే అంత మేరకు కడపలో తెలుగుదేశం విజయం, మెజారిటీ పెరుగుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలా చూసినా కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ కు గడ్డు పరిస్థితులే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. 1984 తర్వాత జరిగిన కడప నియోజకవర్గానికి జరిగిన పది ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి వైఎస్ కుటుంబ సభ్యులే గెలుపొందారు. ఇప్పుడు ఆ ఒరవడికి గండి పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.
కడపలో షర్మిల పోటీ ప్రభావం పులివెందుల నియోజకవర్గంపై కూడా పడే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పులివెందుల నుంచి వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో షర్మిల ప్రభావం జగన్ విజయంపై ఏ మేరకు పడుతుందన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతున్నది. కపడలో వైఎస్ కుటుంబ సభ్యుల రాజకీయ రణం.. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నది.
పులివెందులలో జగన్ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సరిగ్గా ఆరోజు నుంచే జగన్ సతీమణి వైఎస్ భారతి భర్త తరఫున పులివెందులలో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పులివెందులలోనే క్యాంప్ చేసి ఆమె జగన్ ఎన్నికల ప్రచార భారాన్ని తన భుజస్కంధాలపై మేయడానికి రెడీ అయిపోయారు. పులివెందులలో జగన్ విజయం కాదు మెజారిటీ కూడా పెంచుకోవడమే లక్ష్యంగా భారతి వ్యూహరచన చేస్తున్నరని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. పులివెందులలో మెజారిటీని గణనీయంగా పెంచుకోవడం ద్వారా కడప లోక్ సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి రెండో సారి ఎంపీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. మరి కడప జనం ఈ ఫ్యామిలీ ఫైట్ లో ఎటువైపు అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.