యూట్యూబ్ డాక్టర్..
posted on Mar 26, 2021 @ 11:59AM
యూట్యూబ్ లో లేని విషయాలు ఉండమంటే నమ్మాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయిలా మారింది యూట్యూబ్. ఏం చేసిన న్యూస్ గా మారింది. అలా అని యూట్యూబ్ ని తక్కువ అంచనా వేయకండి చాలా మందికి ఉపాధితో పాటు, సంఘం లో గుర్తింపు కూడా ఇచ్చింది. యూట్యూబ్ ని ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతారు. ప్రపంచ రహస్యాలు, చరిత్ర , నుండి మొదలు పెడితే వంట ఎలా చేయాలి. పంట ఏం వేయాలి, ఏం తినాలి , ఎలా తినాలి, ఎలా కుట్టాలి ఎలా కట్లు కట్టాలి, ఎలా చదవాలి, ఎలా చావాలి , ఎలా పడాలి, ఎలా పాడుకోవాలి అబ్బో .. ఒక్కటేమిటి మనకు తెలియాలి విషయాలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి.
ఈ మధ్య ఒక వ్యక్తి యూట్యూబ్ చూసి డాక్టర్ అయ్యాడు. అదేంటి డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదువుతారు గానీ.. యూట్యూబ్ చుస్తే అవుతారా అనుకుంటున్నారా.. అదే ఇక్కడ ట్విస్ట్. అందుకే పైన యూట్యూబ్ పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పాను. డాక్టర్ అంతే అలాంటిలాంటి డాక్టర్ కాదు భయ్యో.. యూట్యూబ్ డాక్టర్.. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఆపరేషన్స్ చేసే డాక్టర్.
అతను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. చదివింది బీఎస్సీ. ఎంబీబీఎస్ వైద్యుడిగా మారాడు. వరంగల్ నగరం ఆసుపత్రి విధులు నిర్వహిస్తున్నాడు ఈ యూట్యూబ్ డాక్టర్. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో పుడ్ బాల్ ఆడుతున్నాడు. తాను యూట్యూబ్ డాక్టర్ అనే విషయం తెలియడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడిచేసి పోలీసులకు అప్పగించారు.
వరంగల్ రురల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి నెల రోజుల క్రితం హన్మకొండలోని సిటీ హాస్పిటల్ పేరిట ఆసుపత్రి ఓపెన్ చేశాడు. ఆడపిల్లలు వాడుకుంటున్న మహిళలను ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా గుర్తిస్తున్నాడు. నర్సింగ్‌లో శిక్షణ పొందినవారి సాయంతో.. యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో బుధవారం అర్ధరాత్రి రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడిచేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు చికిత్స చేస్తున్నారు. అధికారులను చూసి వైద్య సిబ్బంది గోడదూకి పారిపోయారు. థియేటర్‌లో ఉన్న మహిళను బాత్రూంలో దాచారు. డీఎంహెచ్‌వో లలితాదేవి, అడిషనల్ డీఎంహెచ్‌వో మదన్‌మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకూబ్‌పాషాలు పోలీసుల సాయంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చి విచారించారు. రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్ చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఇంద్రారెడ్డి మూడేళ్ల క్రితం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. అధికారులు దాన్ని సీజ్ చేశారు.
ఈ ఇంటర్ నెట్ ప్రపంచం వచ్చిన తరువాత బ్రెయిన్ కి పని తగ్గిందనే చెప్పాలి. ఏ సమాచారం కావాలన్నా ఇంటర్ నెట్ పైనే ఆధారపడుతున్నాం. సమాచారం కోసం గూగుల్ సర్చ్, యూట్యూబ్ సర్చ్ అంటూ ఇంట్లో వాళ్ళని కూడా పట్టుకోలేనంత బిజీ అయ్యాం.. మనకు తెలియకుండానే మనం వేరే ప్రపంచంలో బతుకుతున్నాం. సరే ఇదంతా పక్కన పెడితే 5 నెలల పిల్లలు కూడా ఫోన్ చేతికి వదలడం లేదు. ఏమైపోతుందో ప్రపంచం చివరికి.