కొంప ముంచిన ఫేస్‌బుక్ ఫ్రెండ్!
posted on Jul 22, 2014 @ 12:06PM
ఫేస్‌బుక్‌లో ఎవర్ని పడితే వాళ్ళని ఫ్రెండ్స్‌గా ఒప్పుకోవద్దు.. ముక్కూ ముఖం తెలియని వాళ్ళతో ఓవర్‌గా వెళ్ళొద్దు అని ఎవరు ఎంతగా మొత్తుకున్నా కొంతమంది ఈ హెచ్చరికలను పట్టించుకోరు. అలా పట్టించుకోని పాపానికి ఒక మహిళ అక్షరాలా కోటి ముప్పయి లక్షలు పోగొట్టుకుంది. డెహ్రాడూన్‌కి చెందిన బీనా ఠాకూర్ అనే మహిళ ఓఎన్జీసీ ఉద్యోగి భార్య. బోలెడంత డబ్బు కూడా వుంది. ఆమెకి ఫేస్ బుక్ అంటే ప్రాణం. ముష్టోడు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టినా యాక్సెప్ట్ చేసేసి ఛాటింగ్ చేసేంత విశాల హృదయం. ఈమెకి అమెరికాకి చెందిన రిచర్డ్సన్ అనే ఫ్రెండ్ ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరూ గంటలకు గంటలు ఫేస్ బుక్ ఛాటింగ్‌లో మనసులు విప్పి మాట్లాడుకుంటూ వుండేవారు. ఈమధ్య ఛాటింగ్‌లో రిచర్డ్సన్ అపర దానకర్ణుడిలా పోజు పెట్టి తాను తొమ్మిది కోట్ల రూపాయలను ఎవరైనా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేవాళ్ళకి దానం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ తొమ్మదికోట్లు తానే కొట్టేస్తే ఓ పనైపోతుందని అనుకుందో ఏమోగానీ బీనా ఠీకూర్ ఆ డబ్బు తనకే ఇస్తే వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ముసలోళ్ళ సేవలో తరిస్తానని చెప్పింది. అయితే ఆ తొమ్మిది కోట్లకు ముందు పన్ను కట్టాలని, కాబట్టి వెంటనే బ్యాంకులో కోటి 30 లక్షలు జమ చేయమని చెప్పాడు. బీనా ఠాకూర్ పిచ్చిమొహంలాగా రిచర్డ్సన్ అకౌంట్లో అంత డబ్బూ జమచేసేసింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని లబోదిబో అని పోలీసులకు ఫిర్యాదు చేసింది.