ఇవివి సత్యనారాయణ జయంతి
posted on Jun 10, 2013 @ 10:05AM
తెలుగు సినిమాకు కమర్షియల్ కామెడీ అందించిన అతి కొద్ది మంది దర్శకులల్లో ఆయన ఒకరు.. జంద్యాల లాంటి మహామహులు అందిస్తున్న సున్నితమైన కామెడీకి దూరంగా ఆ కామెడీకి కాస్త స్పైస్ జోడించి తెలుగు తెరమీద నవ్వులు పువ్వులు పూయించిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ.. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన కంటచూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇవివి గారి జయంతి సందర్భంగా ఆ నవ్వుల రారాజు జీవిత విశేషాలను తెలుసుకుందాం..
తెలుగు తెరకు మెమరబుల్ సక్సెస్‌లు అందించిన ఇవివి.. 1958 జూన్ 10న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో జన్మించారు. 42 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ నటించిన సూర్యవంశానికి కూడా దర్శకుడు ఈవీవీనే. ఈవీవీ తల్లిదండ్రులు వెంకటరావు, వెంకటరత్నం. భార్య సరస్వతి కుమారి. తరువాత ఆయన వారసులుగా ఇద్దరు కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లను హీరోలుగా పరిచయం చేశారు..
1990లో చెవిలో ఫువ్వు సినిమాతో దర్శకత్వ అరంగేట్రం చేసిన ఇవివి...తొలి ప్రయత్నంలో అనుకున్న విజయం సాదించలేక పోయారు..కాని అదే ఏడాది ప్రేమ ఖైదీ చిత్రంతో మెగా హిట్‌ను దక్కించుకున్నారు. జంధ్యాల వద్ద కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేసిన ఇవివి... ఇంద్రుడు-చంద్రుడు సినిమాలో పోలీస్ అధికారి క్యారెక్టర్ వేసి తనలోని నటున్ని కూడా పరిచయం చేశారు.
వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఇవివికే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ విన్నప్పుడల్లా ఆయన మార్క్ కొట్టోచ్చినట్టుగా కనిపిస్తుంది, అదే ఇవివి స్టైలంటే.
ఇవివి తల్లిదండ్రులు స్థిరపడింది నిడదవోలు మండలం కోరుమామిడిలో. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇవివికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఇష్టం. టెన్త్ వరకూ బుద్ధిగానే చదివిన ఆయన నిడదవోలు కళాశాలలో ఇంటర్లో చేరాక... క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసి చివరకు పరీక్ష తప్పారు.
తరవాత వ్యవసాయం కూడా కలిసి రాకపోవడంతో తనకు ఎంతో నచ్చిన సినీరంగంలో స్థిరపడాలనుకున్నారు ఇవివి.. అలా చెన్నై చేరిన ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోన్నారు.. ఆ సమయంలో ఇండస్ట్రీలో బతకటం అంత ఈజీకాదు.. తిరిగి ఊరికి వెళ్లిపొమ్మని చెప్పిన వాళ్లు ఉన్నారు.. కాని ఆయన ఏ రోజు నిరాశపడలేదు.. తొలిసారిగా దేవదాసు కనకాల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయ దర్శకుడిగా జాయిన్ అయ్యారు..
అప్పటినుంచి ఇవివి వెనుదిరిగి చూడలేదు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడిగా మారిన తరువాత ఆయనకు తన గమ్యం ఏంటో, తను ఎంటు సినిమాలను తీయగలడో తెలుసుకున్నాడు. తొలి సినిమాతో నిరాశపడినా.. తరువాత రామానాయుడు నిర్మించిన ప్రేమఖైదీ చిత్రంతో ఇవివికి బ్రేక్ వచ్చింది. ఆ చిత్రం విజయవంతం కావటంతో ఇవివికి మంచి అవకాశాలు వచ్చాయి. జంధ్యాల కంటే కొంచెం ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు.
రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి చిత్రాలు తీశారు. జంబలకిడి పంబ, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తరువాత మహిళలు మెచ్చిన తాళి, ఆమె వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
అగ్ర నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ బ్లాక్ బస్టర్‌లను అందించారు ఇవివి. రంభ, ఊహ, ఆమని, రవళి వంటి నటీమణులతో పాటు పవన్‌కళ్యాణ్‌ను కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు ఇవివి. తరువాత తన వారసులుగా ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌లను హీరోలుగా పరిచయం చేసిన ఆయన వారిద్దరితో కూడా మంచి సక్సెస్‌ఫుల్ సినిమాలను అందించారు..
ఇలా తెలుగు తెరకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన ఇవివి సత్యనారాయణగారు భౌతికంగా మనతో లేకున్నా నవ్వు బతికున్నంత కాలం మనతోనే ఉంటారు.. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆ కామెడీ కింగ్‌కు మరోసారి నివాళులర్పిద్దాం.