అవును, రేవంత్‌ను కలిశా.. తప్పేంటి? కేటీఆర్‌కు ఈటల రిటర్న్ గిఫ్ట్
posted on Oct 23, 2021 @ 4:06PM
హుజురాబాద్ రాజకీయం కాక రేపుతోంది. ఎలక్షన్ దగ్గర పడుతున్నా కొద్దీ.. పాలిటిక్స్ పీక్స్‌కు చేరుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. బరిలో ఉన్నాయి. అయినా, పోరు ఈటల వర్సెస్ టీఆర్ఎస్‌గానే సాగుతోంది. పోటాపోటీ విమర్శలతో, హరీశ్‌రావు వ్యూహాలతో, ఈటల ఎదురుదాడితో హుజురా..వార్ జోరుగా నడుస్తోంది. ఇంతటి ఉత్కంఠ సమయంలో మంత్రి కేటీఆర్.. సంచలన కామెంట్లు చేయడం మరింత కలకలం రేపింది. అంతలోనే ఈటల నుంచి కౌంటర్ పడటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే....
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల రాజేందర్- రేవంత్‌రెడ్డిల మధ్య రహస్య సమావేశం జరిగిందని.. మంత్రి కేటీఆర్ బయటపెట్టారు. భేటీ విషయం మీరే ఒప్పుకుంటారా? లేక, మేమే ఆధారాలు బయటపెట్టాలా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ-కాంగ్రెస్‌లు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. కేటీఆర్ ఈ కామెంట్లు చేసిన గంటల వ్యవధిలోనే ఈటల రాజేందర్ నుంచి ఖతర్నాక్ కౌంటర్ పడింది. ఈటల ఏమన్నారంటే....
టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత అందరినీ కలిసి వందలాది మందితో మాట్లాడారు. సీపీఎం, సీపీఐతోనూ కలిసి మాట్లాడినట్టు తెలిపారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. తనకు సంస్కారం ఉందని ఈటల తెలిపారు. అందరితో మాట్లాడే వాతావరణం ఉండాలి కానీ.. కుసంస్కారం ఉండొద్దన్నారు. గతంలో కిరణ్ కుమార్, వైఎస్సార్, రోశయ్యతోనూ మాట్లాడానన్నారు ఈటల. కేసీఆర్ వచ్చాక ఇతర పార్టీలతో బంధాలు తెగిపోయాయన్నారు.
రేవంత్‌రెడ్డిని కలవడం సంస్కార హీనమైతే కాదు కదా? అని ప్రశ్నించారు ఈటల. అవేమీ నిషేధించబడిన పార్టీలు కాదు కదా అన్నారు. తాను ఇప్పుడు కూడా కలుస్తానని.. తనకు ఆ దమ్ము ఉందన్నారు. కలవడం చట్ట విరుద్దమా..? అని ప్రశ్నించారు. పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండాలని.. బీజేపీ, కాంగ్రెస్ ఉత్తర దక్షిణ ధృవాలని.. అవి కలిసే ఆస్కారం లేదని ఈటల తేల్చిచెప్పారు.
రేవంత్‌ను కలిసిన విషయం ఈటల ఇంత ఓపెన్‌గా ఒప్పుకోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయంటున్నారు. ఎలాగూ సీక్రెట్ మీటింగ్ మేటర్ లీక్ అయింది కాబట్టి.. కేటీఆర్ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు కాబట్టి.. ముందే ఒప్పేసుకుంటే ఏ గొడవా లేకుండా ఉంటుందనేది ఓ రీజన్. ఇక, రేవంత్-ఈటల కలిశారని.. బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోందని ఓపెన్‌గా తేలిపోతే.. కాంగ్రెస్‌కు ఓటేయాలనుకునే వారంతా నేరుగా బీజేపీకే ఓటేసే అవకాశం ఉంటుందని.. అలా కూడా కేటీఆర్ ఆరోపణ తనకే ఉపయోగపడుతుందనేది ఈటల లెక్కలా ఉందంటున్నారు. అందుకే, అవును, రేవంత్‌రెడ్డిని కలిశా.. అదేమన్న చట్ట విరుద్దమా? అంటూ ఈటల కేటీఆర్‌పై రివర్స్ అటాక్ చేశారని చెబుతున్నారు. మరి, రేవంత్-ఈటలల కలయిక.. హుజురాబాద్‌లో పొలిటికల్ ఈక్వేషన్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మరి..!!