ఈటల కండీషన్స్.. బీజేపీ పరేషాన్! కేసీఆర్ దిమ్మ తిరగనుందా?
posted on May 26, 2021 @ 2:35PM
తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ చుట్టే తిరుగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేందర్.. తన భవిష్యత్ కార్యాచరణ కోసం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతుండగానే... కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. రాజేందర్ కు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందనే చర్చ రెండు రోజులుగా హోరెత్తుతోంది. బీజేపీ జాతీయ నేత హైదరాబాద్ వచ్చి ఈటలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈటలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు ఆయనకు కొన్ని హామీలు కూడా ఇచ్చారని చెబుతున్నారు. ఈటల బీజేపీలో చేరిక ఖాయమైందని కూడా కొందరు ప్రచారం చేశారు. బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై ఈటల స్పందించకపోవడంతో.. సమావేశం జరిగింది నిజమేనని తెలుస్తోంది.
బీజేపీ నేతలతో ఈటల రాజేందర్ సమావేశానికి సంబంధించి కీలక సమాచారం తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ జాతీయ నేత ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారన్నది స్పష్టమవుతోంది. అతను బీజేపీలోకి ఆహ్వానించినప్పటికి ఈటల.. ఇంకా నిర్ణయం చెప్పలేదని సమాచారం. బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్ కొన్ని కండీషన్లను వాళ్ల ముందు ఉంచారట. వాటిని అంగీకరిస్తే బీజేపీలో చేరడానికి తనకు అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేశారట. ఈటల రాజేందర్ పెట్టిన కండీషన్లతో బీజేపీ నేతలు డైలామాలో పడ్డారని తెలుస్తోంది. హైకమాండ్ తో మాట్లాడి చెప్పాల్సిన విషయాలు కావడంతో.. వెంటనే హామీ ఇవ్వలేకపోయారట. హైకమాండ్ తో మాట్లాడి చెబుతామని రాజేందర్ కు బీజేపీ ముఖ్య నేత చెప్పారని సమాచారం.
బీజేపీ జాతీయ నేత ముందు ఈటల రాజేందర్ పెట్టిన షరతులను కూడా తెలుగు వన్ సంపాదించింది. మంత్రివర్గం నుంచి తనను అవమానకరంగా తొలగించారనే కసిగా ఉన్న ఈటల రాజేందర్... కేసీఆర్ టార్గెట్ గానే ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల ముందు కేసీఆర్ లక్ష్యంగానే షరతులు పెట్టారని తెలుస్తోంది. భవిష్యత్ లో టీఆర్ఎస్ తో ఎలాంటి రాజకీయ పొత్తు, సహకారం బీజేపీ తీసుకోవద్దన్నది రాజేందర్ ప్రధాన షరతట. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను బీజేపీలో చేరిన తర్వాత... టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకున్నా, కేంద్రంలో సహకారం తీసుకున్నా తాను జీరోగా మారిపోతాననే విషయాన్ని ఈటల రాజేందర్... బీజేపీ నేత ముందు ఉంచారని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ పై దూకుడుగా వెళ్లేలా తమకు పూర్తి స్వేఛ్చ కావాలని ఈటల కోరారని తెలుస్తోంది. రాజేందర్ పెట్టిన షరతులతో బీజేపీ జాతీయ నేత ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
బీజేపీకి ప్రస్తుతం లోక్ సభలో పూర్తి మెజార్టీ ఉన్నా పెద్దల సభలో లేదు. అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అవుతున్నా రాజ్యసభలో ఇంకా మేజిక్ ఫిగర్ కు చేరుకోలేదు బీజేపీ. రాజ్యసభలో బీజేపీకి ప్రస్తుతం 91 మంది సభ్యులున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రాలేదు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగా.. బెంగాల్ లో మమత హ్యాట్రిక్ కొట్టారు. వచ్చే సంవత్సరం యూపీ, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. గత ఎన్నిక్లలో యూపీలో బంపర్ విక్టరీ కొట్టిన బీజేపీకి ఈసారి గెలుపు అంత ఈజీ కాదు. వచ్చే సంవత్సరం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ మద్దతు బీజేపీకి అవసరం. పెద్దల సభలో ఆరుగురు టీఆర్ఎస్ సభ్యులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ సహకారం తీసుకోబోమని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. అందుకే రాజేందర్ కు స్పష్టమైన హామీ ఇవ్వలేదంటున్నారు. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారనే చర్చ జరుగుతోంది.
బీజేపీ నేతల నుంచి సానుకూల ఫలితం రాకపోవడంతో ఇక సొంత పార్టీ దిశగా రాజేందర్ చకచకా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కొత్త పార్టీ పెట్టడం ఖాయమైందంటున్నారు. బీసీ నాయకత్వంలో కొత్త పార్టీ వస్తుందని, పూర్తిగా బీసీ పార్టీ కాదని ఈటల అనుచరులు కూడా చెబుతున్నారు. పార్టీలో కొండా కీలకంగా ఉండనున్నారు కాబట్టే అలా చెబుతున్నట్లు భావిస్తున్నారు. కొత్త పార్టీ కార్యాచరణ కూడా స్పష్టంగా ఉందంటున్నారు. బీజేపీతో టీఆర్ఎస్ కలిస్తే... కాంగ్రెస్ తో పొత్తుతో ముందుకు వెళ్లాలని ఈటల టీమ్ సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసిపోయే పరిస్థితి వస్తే.. బీజేపీ గ్రూపులో ఉంటారట. మొత్తానికి టీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్ గానే తమ రాజకీయ కార్యాచరణ ఉండేలా ఈటల రాజేందర్, కొండా టీమ్ రూట్ మ్యాప్ రెడీ చేసిందని తెలుస్తోంది.