ఈటల సహా నలుగురు అవుట్? కేబినెట్ లోకి కవిత, పల్లా, సండ్ర ?
posted on May 1, 2021 @ 9:41AM
తెలంగాణ మంత్రివర్గం పునర్ వ్యవస్థికరణకు రంగం సిద్ధమవుతోంది. కేసీఆర్ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చాల కాలం నుంచి ప్రచారం జరుగుతుండగా.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో అతి త్వరలోనే మార్పులు ఉంటాయని తెలుస్తోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ముగియగానే.. తెలంగాణ రాజకీయాల్లో , అధికార టీఆర్ఎస్ పార్టీలో సంచలన పరిణామాలు వెలుగు చూశాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం కలకలం రేపగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడం మరింత ఆశ్చర్యంగా మారింది. ఈటల ఈటలకు చెక్ పెట్టేందుకే నాలుగేండ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న భూబాగోతాన్ని బయటికి తీశారంటున్నారు. భూవ్యవహారంలో ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈటల రాజేందర్ తో పాటు మరో ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. ఈటలతో పాటు మహబూబ్ నగర్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కవితకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీలు లేవు. కొత్తవారిని తీసుకోవాలంటే మంత్రివర్గంలో నుంచి ప్రస్తుతం ఉన్నవారిని తొలగించాల్సి ఉంటుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పల్లాను కేబినెట్ లోకి తీసుకుంటే.. ఆయన సామాజికవర్గానికే చెందిన మంత్రికి ఉద్వాసన ఖాయమంటున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కమిషన్ కోసం మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకై వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతోనూ మల్లారెడ్డికి పొసగడం లేదు. అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చినా.. గెలిపించుకోలేకపోయారు మల్లారెడ్డి. దీంతో పల్లాను తీసుకోవడం కోసం మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు. మల్లారెడ్డిని తొలగించే గులాబీ వ్యూహంలో భాగంగానే ఆయన ఆడియో లీకైందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రిపదవిపై ఇప్పటికే కేసీఆర్ సంకేతమిచ్చారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించారు సండ్ర. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాకా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే మరో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా పార్టీ మారకపోవడంతో.. టీడీపీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడానికి సాంకేతికంగా ఇబ్బంది వచ్చింది. ఇటీవలే మచ్చా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో సండ్రను కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దళిత కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్... అతన్ని తప్పించి సండ్ర వెంకట వీరయ్యను తీసుకోవాలని నిర్ణయించారని చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డికి గండం ఉందంటున్నారు. జిల్లాలో జూనియర్ అయినా కేసీఆర్ అతనికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ప్రశాంత్ రెడ్డి మాత్రం జిల్లా నేతలతో సఖ్యతగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డిని తొలగించి.. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కవితను కేబినెట్ లోకి తీసుకోవాలని.. ఆ జిల్లా నేతలు కోరుతున్నారట. కవిత కూడా మంత్రిపదవి కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి స్థానంలో కవితకు కేబినెట్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు.
కొన్ని నెలల క్రితం వివాదాల్లో చిక్కుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు ఊస్టింగ్ ఖాయమంటున్నారు. ఆడియో రచ్చ జరిగినప్పుడే గంగులను తొలగిస్తారని భావించారు. అయితే అప్పుడు గండం నుంచి గంగుల బయటపడ్డారు. ఈసారి మాత్రం ఆయనను తొలగించి... అదే సామాజిక వర్గానికి చెందిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రివర్గంలో కేసీఆర్ చోటు కల్పిస్తారని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గౌడ్ ను తొలగిస్తారని అంటున్నారు. అయితే ఒకేసారి ముగ్గురు మంత్రులను తొలగించే సాహసం కేసీఆర్ చేస్తారా అన్నది ప్రశ్నగా మారింది. శ్రీనివాస్ గౌడ్ ను తప్పిస్తే.. ఆయన సామాజికవర్గం నుంచే మరొకరికి అవకాశం రావచ్చు.
హైదరాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించిన సురభి వాణిదేవీకి కీలక పదవి ఇస్తారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. పలు విద్యాసంస్థలకు అధినేతగా ఉన్న వాణిదేవీకి విద్యాశాఖ మంత్రి అయితే సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితాఇంద్రారెడ్డిని రెండో దశలో కేబినెట్ లోకి తీసుకున్నారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమె నిలిచారు. దీంతో ఆమెను తప్పిస్తే బాగుండదనే చర్చ గులాబీ నేతల్లో జరగుతుందట. కేబినెట్ బెర్త్ కాకుండా వాణిదేవీకి శాసనమండలి చైర్మెన్ పదవి ఇవ్వాలని సూచన కొందరు నేతలు చేశారంటున్నారు. ప్రస్తుతం మండలి చైర్మెన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రెస్ట్ ఇచ్చి.. వాణిదేవీకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.