గోడ దూకేస్తున్న ప్రజాప్రతినిధులు..
posted on Feb 11, 2016 @ 10:38AM
ఓ నాలుగు పార్టీలు ఎన్నికలలో పాల్గొంటే వాటిలో తమకు నచ్చిన పార్టీకి, నచ్చిన అభ్యర్థికి ఓటేసి గెలిపించడం ప్రజల అభిమతం. ఓటర్లు కేవలం ఒక అభ్యర్థిని చూసి మాత్రమే కాదు, అతనికి అండగా ఉన్న పార్టీని చూసి కూడా ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. మరి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన అభ్యర్థి, ఎన్నికల తరువాత తన పార్టీని మార్చేస్తే... ముందుముందు ఎవరిని నమ్మాలి? ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేకుండా అధికారపక్షంలోకి మారిపోతే, ప్రజల తరఫున పాలకులని నిలదీసేదెవ్వరు? బహుశా అందుకేనేమో ప్రజలు కూడా ఏకపక్షంగా మారిపోతున్నారు. ప్రతిపక్షాలు తమ తరఫున పోరాడేంత చిత్తశుద్ధితో లేవనీ... ఒకవేళ అధికార పక్షాన్ని కాదని మరీ మిగతా పార్టీలను గెలిపిస్తే, ఏళ్లు గడవకముందే వాళ్లు పార్టీ మారిపోతారనీ ప్రజలకి కూడా అర్థమైపోయినట్లుంది. మొన్నటికి మొన్న గ్రేటర్ ఎన్నికలలో ప్రజలు అందించిన తీర్పే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ప్రస్తుతానికి తెదెపా శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి కూడా తెరాసలోకి చేరిపోవడం ఒక అనూహ్య పరిణామం. ఎర్రబెల్లి చేరికతో తెదెపాకి మొదట ఉన్న 15మంది శాసనసభ్యులలో, ప్రస్తుతం 6గురు మాత్రమే మిగిలినట్లయింది. తెలంగాణలో తెదెపా తరఫున బలమైన నేతగా ఉన్న ఎర్రబెల్లి, తెరాస కార్యకర్తగా మారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది. గ్రేటర్ ఎన్నికలలో తనకు తగినంత ప్రాధాన్యత లభించలేదనీ, పార్టీ పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారనీ ఎర్రబెల్లి చెబుతున్నారు. కానీ ఎర్రబెల్లి తెరాసలో చేరేందుకు గ్రేటర్ ఎన్నికలు కేవలం ఒక సాకుగా మాత్రమే కనిపిస్తోంది. తెరాసలో ఎప్పుడెప్పుడు చేరదామా అని ఎర్రబెల్లి ఉవ్విల్లూరుతున్న పరిస్థితి ఎప్పటినుంచో ఉంది. కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను ఎర్రబెల్లి ఆర్ధరాత్రి పూట రహస్యంగా కలుసుకున్నప్పుడే ఎర్రబెల్లి మనసులో ఏముందో ప్రజలకు తెలిసిపోయింది. ఆ సంఘటన గురించి ఎర్రబెల్లి పొంతన లేని జవాబులు చెప్పినా, రానున్న రోజులలో ఏం జరగబోతోందో అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది. తెరాసలో తనకు ఎలాంటి ప్రధాన్యత లభిస్తుంది? ఇప్పటికే తెరాసలో ఉన్న తన బద్ధ శత్రువులు కడియం శ్రీహరి, కొండా మురళిలతో కలిసి ఎలా పనిచేయాలి?... వంటి సందేహాలతో ఎర్రబెల్లి కొంత జాప్యం చేసి ఉండవచ్చు. కానీ ఎర్రబెల్లి సందేహాలను తీర్చేందుకు తెరాస ముఖ్యనేత హరీష్‌రరావు స్వయంగా రంగంలోకి దిగడంతో... తెరాసలో ఆయన చేరిక ఖాయమైపోయింది. మరి ఈ వలస ఇక్కడితో ఆగుతుందా అన్నది అనుమానమే!
2014లో తెలంగాణ శాసనసభకు తొలి ఎన్నికలు జరిగినప్పడు తెరాస 63 స్థానాలను గెల్చుకుంది. మిగతా 50కి పైగా స్థానాలు ప్రతిపక్షాల చెంతనే ఉన్నాయి. కానీ రెండేళ్లు తిరిగేసరికి 17మంది ప్రతిపక్ష సభ్యులు తెరాస తీర్థం పుచ్చేసుకున్నారు. అంటే దాదాపు మూడోవంతు ప్రతిపక్షం ఇప్పడు బలహీనమైపోయింది. ఇలాంటి పరిస్థితులలో అధికార పక్షం ప్రవేశపెట్టే తీర్మానాలను అడ్డుకోవాలన్నా, ప్రజల తరఫున ఏదన్నా సమస్యను బలంగా లేవనెత్తాలన్నా... ప్రతిపక్షాలకి తగినంత బలం లేదన్నది పైన పేర్కొన్న అంకెలే చెబుతున్నాయి.
శాసనసభ సంగతి అలా ఉంచితే తెలంగాణలో తెదెపా పార్టీ పరిస్థితి ఏంటన్నది మరో సమస్య! లోకేష్ తెలంగాణ వ్యవహారాలు చూస్తున్నంత మాత్రాన తెలంగాణలో తెదెపా పట్టు నిలుస్తుందన్న భ్రమలు మొన్నటి గ్రేటర్ ఎన్నికలతోనే చెదిరిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలని చక్కబెట్టడంలోనే తలమునకలైపోతున్న చంద్రబాబు మరి తెలంగాణని ఏం చేయబోతున్నారు. తెదెపా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్టీ అన్న అపప్రధని ఎలా పోగొడతారు అన్నదే ఇప్పడు ఆయన ముందున్న సవాలు. తెదెపాకి తెలంగాణలో మిగిలిన శాసనసభ్యులలో ఆర్.కృష్ణయ్య ఇప్పటికే నిరసన గళమెత్తి ఉన్నారు. తెదెపా తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన కృష్ణయ్య ఇప్పడు బి.సీ.లకి సంబంధించి జరుగుతున్న చర్చలో చంద్రబాబుకి వ్యతిరేకంగా కత్తులు దూస్తున్నారు. ఇక మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలైనా తెదెపాకి కష్టకాలంలో అండగా నిలబడతారా? రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి ఎదురొడ్డుతారా? అన్నది రానున్న కాలమే చెబుతుంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బలం కాదు గళం కావాలి అన్న నిజం ఇప్పటికైనా ప్రతిపక్షాలకి అర్థమైతే, ప్రజలకి న్యాయం చేకూర్చడంలో ప్రతిపక్షాలదే ముఖ్యపాత్ర అన్న నైజం పట్టుబడితే.... ప్రజల తీర్పుని గౌరవించే ప్రతినిధులు ఇంకా మిగిలి ఉంటారు. లేకపోతే ప్రజలు కూడా గ్రేటర్ ఎన్నికలలో ఇచ్చిన తీర్పునే పదే పదే వెలువరిస్తుంటారు.