ఎర్రబెల్లి, ధర్మానలకు సెక్యూరిటీ తగ్గింపు
posted on Aug 12, 2014 @ 11:36AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను తుగ్లక్, బఫూన్ ల పరిపాలనళా ఉందని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకరరావు చేసిన తీవ్ర విమర్శలకు సహజంగానే తెరాస మండిపడుతోంది. బహుశః ఆ కారణంగానేమో ఎర్రబెల్లికి కల్పిస్తున్న సెక్యురిటీని ప్రభుత్వం తగ్గించింది. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన ఎర్రబెల్లి తన మిగిలిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రభుత్వానికి నిన్న అప్పజెప్పేసారు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తనపై కక్షసాధింపుగానే తనకు సెక్యూరిటీ తగ్గించిందని ఆయన ఆరోపించారు. ఇకపై తనకు ఏమయినా జరిగితే అందుకు తెలంగాణా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించడంతో ఆయన కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తన ఇంటి వద్ద రెండు రోజుల క్రితం రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆయన తన భద్రతను పునరుద్దరించుకోవడానికే ఆవిధంగా చెపుతున్నారా లేక నిజంగా ఎవరయినా రెక్కీ నిర్వహించారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
సామాన్య ప్రజలు, స్కూళ్ళకు వెళ్ళే చిన్నారులకు సరయిన రక్షణ లేక (గెయిల్) గ్యాస్ లీక్ అగ్ని ప్రమాదాలలో, ఉగ్రవాదుల దాడులలో, రైళ్ళ క్రింద నలిగి చనిపోతుంటే, ఆ సామాన్య ప్రజలు చెమటోడ్చి సంపాదించికడుతున్న పన్నులతో అధికారంలో ఉన్న, లేని కోటీశ్వరులైన రాజకీయ నాయకులందరికీ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.