ఈడీ దూకుడు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు?
posted on Sep 16, 2022 @ 3:10PM
మునుగోడు ఉప ఎన్నిక ముంగిట తెరాసకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. తనపై ఆరోపణలు రావడంపై భగ్గుమన్న కవిత..ఆ ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానంటూ హెచ్చిరించారు.
చివరకు తనపై ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. పరువునష్టం దావా ఊసెత్తలేదు. అదలా ఉంటే తాజాగా ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె కరోనా కారణంగా క్వారంటైన్ లో ఉండటంతో నోటీసులను కవితకు ఈడీ అందించలేదని సమాచారం. కానీ ఆమె సన్నిహితులకు మాత్రం ఈడీ నోటీసులు అందజేసింది. హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ లోని ఒక రెసిడెన్సీలో నివాసం ఉంటున్ కవిత వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో శుక్రవారం (సెప్టెంబర్ 16) ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో కవిత పీఏ అభిషేక్ రావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. శుక్రవారం ఈడీ సోదాలకు ముందు ఓ పక్షం రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఈడీ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయని అంతా భావించారు.
మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సహా ఎవరికి నోటీసులు జారీ చేసినా, ఎవరిపైనైననా చర్యలు తీసుకున్నా అది మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీకి ప్రయోజనం కూర్చుతుందని బీజేపీ భావిస్తోందనీ, మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ఈడీ ఈ స్కాం దర్యాప్తులో స్పీడ్ తగ్గితే మేలని బీజేపీ పెద్దలు భావించడం వల్లనే ఈడీ స్పీడ్ కు బ్రేకులు వేసిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. రాజకీయ వర్గాలు సైతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈడీ స్పీడు తగ్గించిందనీ పేర్కొన్నాయి,
ఈ మేరకు మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. అయితే తగ్గిన ఈడీ స్పీడు తుపాను ముందటి ప్రశాంతత వంటిదేనని.. ఉరుము లేని పిడుగులా ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా 42 చోట్ల ఏకకాలంలో శుక్రవారం(సెప్టెంబర్ 16) ఈడ దాడులు చేయడం నోటీసులు ఇవ్వడంతో తేటతెల్లమైంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేశారన్న వార్త సంచలనం సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ముందు ముందు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరింత మంది ప్రముఖులకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.