Banks to use indelible ink similar to voting

 

Economic Affairs Secretary Shaktikant Das Tuesday announced that banks will be using indelible ink, similar to the one used in elections, to deter unscrupulous people from making multiple visits to cash counters in a day. Addressing the media, Das said, "Same people who are coming repeatedly are responsible for long queues and therefore, banks will put indelible ink on people withdrawing money. Indelible ink mark concept will start from today in major cities." A week ago, Prime Minister Narendra Modi announced that Rs. 500 and Rs. 1,000 notes were being withdrawn from circulation to combat black money and corruption. They have been replaced with new high-denomination notes for Rs. 500 and Rs. 2,000.  He also said that religious places receiving donations in smaller denominations are being urged to immediately deposit the same in banks to increase currency supply.

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి ట్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ  మంగళవారం (జనవరి 6) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పైలట్ అయిన సురేష్ కల్మాడీ  ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయన గుర్తింపు పొందారు.  భారత ఒలింపిక్ సంఘం   అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.   

హరీష్‌రావు ఓ గుంట నక్క....కవిత హాట్ కామెంట్స్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని అన్నారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు గుంటనక్కగా పేర్కొంటూ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు కవిత.  బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.  హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హరీష్‌రావును ముఖ్యమంత్రిని  వ్యక్తిగతంగా విమర్శిస్తే అసెంబ్లీని  బాయ్‌కాట్ చేస్తారా? మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టినప్పుడు ఎందుకు బహిష్కరించలేదు? ప్రతిపక్షం అంటే పార్టీ కాదు.. పబ్లిక్ వాయిస్ అని అన్నారు.

2026.. పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదుగా?

 2025కు గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టి మూడు రోజులు అయ్యింది. గత నాలుగైదు రోజులుగా కొత్త సంవత్సర వేడుకల సన్నాహాలు, వేడుకలతో అంతా బిజీబిజీగా గడిచిపోయింది. ఇప్పుడు ఇక కొత్త సంవత్సరం ఎలా గడవబోతోంది అన్న విషయంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.  అది పక్కన పెడితే రాజకీయ పార్టీలకు మాత్రం కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి.  పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు  2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు  అసోం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా 72 రాజ్యసభ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 2026ను పరిశీలకులు ఎన్నికల నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.  ముందుగా తమిళనాడు విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలో  ఉంది.  ఈ రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఏప్రిల్ కు ముందే తమిళనాడులో ఎన్నికలు జరగుతాయి.  ఇప్పటి వరకూ ఉనికి మాత్రంగానే రాష్ట్ర రాజకీయాలలో ఉన్న బీజేపీ ఈ సారి తమిళనాడుపై భారీ అశలే పెట్టుకుంది. అందుకే ఆ రాష్ట్రానికి చెందిన ఓబీసీ నాయకుడు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేసి ఆ రాష్ట్ర ప్రజల గుడ్ లుక్స్ లో నిలవడానికి ప్రయత్నించింది. తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే జయలలిత మరణానంతరం నామావశిష్ఠంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఇక కొత్తగా తమిళ రాజకీయాలలోకి తమిళ వెట్రి కజగం (టివికే) అనే పార్టీ అడుగు పెట్టింది. తమిళ నాట అశేష్ అభిమానులు ఉన్న హీరో విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.   ఆ తరువాత ఈ ఏడు ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో మొత్తం మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.ఇక్కడ గత మూడు దఫాలుగా  మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ  సారి ఇక్కడ ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది.   బంగ్లాదేశ్ నుంచి చొరబాటు దారుల కారణంగా  పశ్చిమ బెంగాల్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాథులు, అదే సమయంలో చొరబాట్లకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలుస్తున్నారన్న విమర్శతో ఇప్పడ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేశారు.   ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం కేరళ. ఇక్కడ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలొ తమకు అవకాశాలున్నాయనడానికి నిదర్శనంగా బీజేపీ భావిస్తోంది.  ఇలా ఉండగా బీజేపీ ఇంత వరకూ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఆ ట్రెండ్ ను బ్రేక్ చేసి ఈ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ + బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది.  ఇక్కడ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది.   అలాగూ అసోం అసెంబ్లీ గడువు కూడా ఈ ఏడాది మేతో ముగియనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది.  వచ్చే మేతో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక్కడ తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించగా,  మరోవైపు కాంగ్రెస్ కూటమి కూడా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నది.  ఏది ఏమైనా 2026 ఏడాది మొత్తం పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో కొనసాగేలా కనిపించడం ఖాయం. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

అందెశ్రీ కుటుంబానికి అండ!

ప్రముఖ కవి అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అందెశ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి వీలుగా 1994 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర శాసన సభలో శనివారం (జనవరి 3) ప్రవేశపెట్టింది.  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం  అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపె ట్టామన్నారు. 1994 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం 7991 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. అందులో కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లి గతం నుంచి రెగ్యులరైజ్ చేయాలని ఆర్డర్ తెచ్చారని ప్రస్తావించారు మల్లు భట్టి విక్రమార్క. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు 573/225, 1.1.1995కి ఇది విరుద్ధమని చెప్పుకొచ్చారు. వెనుక తేదీ నుంచి రెగ్యులరైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. ఏపీలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రాస్పెక్టివ్‌గా చట్ట సవరణ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 25.11.2025న ప్రాస్పెక్టివ్ రెగ్యులరైజేషన్ కోసం ఆర్డినెన్స్ 88 తెచ్చిందని తెలిపారు. ఈ ఆర్డినెన్సును బిల్ నంబర్ 7ద్వారా సభ ఆమోదం కోరుతున్నామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

బంగ్లా తరహా ఉద్యమాలతోనే మోడీని సాగనంపగలం

ఇటీవలి కాలంలో తరచుగా రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పెనుదుమారానికి కారణమౌతున్నాయి. సమాజంలో హింసా, ద్వేషాలను రగిల్చే విధంగా ఉంటున్నాయి. ప్రాంతీయ వైషమ్యాలు, మత విద్వేషాలకు తావిచ్చేలా నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ)ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) జాతీయ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి తెరలేపాయి. దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు. ఆయా దేశాలలో ప్రభుత్వాలను గద్దె దించడానికి హింసాత్మక ఆందోళనలు జరిగాయనీ, అటువంటివే భారత్ లో కూడా జరిగితే తప్ప.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించలేమని అభయ్ సింగ్ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశంలో.. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో యువత ప్రభుత్వాన్ని ఎలా తరిమి కొట్టారో, అదే తరహా పద్ధతులను భారత్‌లోనూ అమలు చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, చౌతాలా వ్యాఖ్యలు భారత రాజ్యాంగ వ్యవస్థకు, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది విపక్ష నేతల  దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక  వైఖరికి నిదర్శనమన్నారు.   రాజకీయ లబ్ధి కోసమే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాలకు  దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.  మొత్తం మీద అభయ్ సింగ్ చౌతాలా వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించేలా, దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

  పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 5)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 6) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హారీశ్‌రావుకి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.