చియా విత్తనాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఇన్ని ప్రమాదాలు ఉంటాయని తెలుసా?

చియా విత్తనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సబ్జా గింజలు, చియా విత్తనాలు ఎన్నో రకాల పానీయాలలో దర్శనమిస్తుంటాయి. ఇవి సూపర్ ఫుడ్ అనే చెప్పొచ్చు. వీటిలో ఉండే అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే వీటిని వాడకుండా ఉండలేరు. చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్, కొవ్వులు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను అందిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

అయినప్పటికీ, చియా విత్తనాలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎలా ఇబ్బంది కలిగిస్తాయో తెలుసుకుంటే వాటిని ఎలా వాడుకోవాలో ఇట్టే అర్థమవుతుంది.  

చియా విత్తనాలు తీసుకోవడం వల్ల కలిగే 7 దుష్ప్రభావాలు:

1. జీర్ణ సమస్యలు
చియా విత్తనాలను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఉబ్బరం ఒకటి. గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే చియా గింజల్లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది పొట్టలో అసౌకర్యం కలిగించి  జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

2. రక్తం పలుచన అవుతుంది
చియా గింజలు రక్తాన్ని పలుచన చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రక్తపోటు తగ్గడానికి దారితీస్తుంది. ఇప్పటికే బ్లడ్ థినర్స్ తీసుకుంటున్న లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. చియా విత్తనాలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు పుష్కలంగా కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఒమేగా-3-రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం పలుచన అవుతుంది. 

3. అలెర్జీ కలిగిస్తాయి
కొంతమందికి చియా విత్తనాలు తీసుకున్నప్పుడు  అలెర్జీ కలుగుతుంది. చర్మంపై దద్దుర్లు, కళ్ళ దురద, గొంతులో ఇబ్బంది,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉండవచ్చు. నువ్వులు లేదా ఆవపిండి తీసుకుంటే అలెర్జీకి గురయ్యేవారు చియా గింజలు తీసుకున్నప్పుడు అలెర్జీకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  ఎందుకంటే ఇవన్నీ ఒకే మొక్కల కుటుంబానికి చెందినవి

4. డీహైడ్రేషన్
చియా గింజలు వాటి బరువుకు ముప్పై రెట్ల నీటిని పీల్చుకుంటాయి.  అధిక మొత్తంలో చియా గింజలను తీసుకుంటే శరీరంలో నీటిశాతం తగ్గిపోవడానికి  దారితీస్తుంది. ఇవి తీసుకున్నప్పుడు తగినంత నీరు తాగకపోతే చాలా  ప్రమాదకరం.

5. మందుల మీద ప్రభావం..
రక్తపోటు, మధుమేహంకు సంబంధించిన ఎన్నో మందులు రోజూ వాడేవారు ఈ కాలంలో అధికంగా ఉంటారు. వీరు చియా విత్తనాలను తీసుకున్నప్పుడు అవి మందులమీద ప్రభావం చూపుతాయి. మందులు పనిచేయకుండా చేయడం, మందులు వ్యతిరేక ప్రభావం చూపించేలా చేయడం జరుగుతుంది.  అందువల్ల చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించి  వారి సూచన ప్రకారం తీసుకోవడం మంచిది.

6. రక్తస్రావం పెరిగే ప్రమాదం
చియా విత్తనాలు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయి, ప్రత్యేకించి ఆస్పిరిన్ లేదా వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలచబరిచే మందులతో తీసుకుంటే చాలా ప్రమాదం ఎదుర్కోవాలి. రక్తస్రావం రుగ్మత ఉన్నవారు, ఇందుకోసం మందులు వాడేవారు చియా విత్తనాలకు దూరంగా ఉండాలి.

7. హార్మోన్ల అసమతుల్యత
చియా విత్తనాలు శరీరంలో ఈస్ట్రోజెన్ ప్రభావాలను అనుకరించే ఫైటోఈస్ట్రోజెన్‌లను కలిగి ఉంటాయి, ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.  రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్ వంటి హార్మోన్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు  ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తుంది.

Teluguone gnews banner