Read more!

510 కోట్లకు వైన్ షాపు వేలం 

మద్యం షాపునకు వేలం మాములుగా కోటి రూపాయల వరకు ఉంటుంది.. కొన్ని ప్రాంతాల్లో రెండు కోట్ల వరకు వెళుతుంది.. కాని అక్కడ మాత్రం మద్యం షాపు వేలం ఎంతో తెలుసా.... 2, 3 ,4 కోట్లు కాదు.. 10 కోట్లు కూడా కాదు.. వంద కోట్లకు ఇంకా పైనే.... ఏకంగా  510 కోట్ల రూపాయలు.. అక్షరాల ఐదు వందల 10 కోట్లు.. మీరు చదువుతున్నది నిజమే.. కేవలం ఒక్క లిక్కర్ షాపు వేలం ఖరీదే  510 కోట్ల రూపాయలు. 

రాజస్థాన్ లో  వైన్ షాపు కోసం వేలం నిర్వహించగా ఏకంగా రూ.510 కోట్లు పలికింది. హనుమాన్ గఢ్ జిల్లా నోహర్ లోని ఆ లిక్కర్ షాపుకు వేలంలో బేసిక్ ధరను 72 లక్షలుగా నిర్ణయించింది రాజస్థాన్ సర్కార్. కాని వేలంలో షాపు ధర క్రమంగా పెరుగుతూ పోయింది. ఈ వేలంపాట 15 గంటల పాటు నిర్వహించారంటే ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివరికి కిరణ్ కన్వర్ అనే వ్యాపారి ఈ వైన్ షాపును కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నాడు.

రాజస్థాన్ సర్కారు ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది. లాటరీ పద్ధతిలో వైన్ షాపులు కేటాయించే బదులు వేలం పద్ధతి పాటించాలని నిర్ణయించింది. దీంతో మద్యం షాపుల కోసం వ్యాపారులు పోటీ పడటంతో ప్రభుత్వానికి వేలంలో కాసుల పంట పండింది. ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... వేలంలో 510 కోట్లు పలికిన వైన్ షాపుకు గతంలో లాటరీ పద్ధతిలో కేవలం రూ.65 లక్షలకే అమ్ముడైంది.