Read more!

ఏలూరు ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్  లోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సస్పెన్స్ వీడింది. ఏలూరులో బుధవారం ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యథావిథిగా ఈనెల 10న ఎన్నికలు నిర్వహించవచ్చన్న హైకోర్టు డివిజనల్ బెంచ్.. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని స్పష్టం చేసింది. ఏలూరు కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో అవకవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. ఎన్నికలు వాయిదా వేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం ఎన్నికలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. దీనిపై ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కు వెళ్లగా.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే ఈనెల 14న ప్రకటించనున్న ఫలితాలపై మాత్రం స్టే విధించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లకూ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో మూడు డివిజన్లను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 47 డివిజన్లకు మార్చి 10న జరగనున్నాయి. 

కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం ఉదయం నుంచి సందిగ్ధత నెలకొన్నా.. ఏక్షణాన్నైనా తీర్పు వచ్చే అవకాశముండటంతో ముందస్తుగానే సిబ్బందిని, ఎన్నికల సామాగ్రిని తరలించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించిన నేపపథ్యంలో.. పోలింగ్ ప్రారంభమయ్యే సమాయనికి అంతా సిద్ధం చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ నుంచి సిబ్బందికి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.  ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో  అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఐతే పోలింగ్ కు కొన్నిగంటల ముందు గ్రీన్ సిగ్నల్ రావడంతో అభ్యర్థులు కూడా ఊపిరి పీల్చుకున్నారు

గత ఏడాది జనవరిలో చొదిమెళ్ల, కొమడవోలు, వెంకటాపురం, పోణంగి, సత్రంపాడు, శనివారపుపేట, తంగెళ్లమూడి పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ వార్డుల పునర్విభజన జరిగింది. ఐతే విలీనం సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు నమోదయ్యాయని.. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ ఇబ్బందులున్నాయని ఏలూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో పొరబాట్లు, రిజర్వేషన్లలో చోటు చేసుకున్న తప్పులను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. దీనిని ప్రభుత్వం, ఎస్ఈసీ సవాల్ చేయగా.. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.