గెలుపు నాదే.. సుప్రీం కోర్టుకు వెళ్తా.. ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్
posted on Nov 4, 2020 @ 6:52PM
అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది దశకు వస్తున్న సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.. "ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారు. నేను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా.. ఎన్నికల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలి. ఈ ఎన్నికలను మేమే గెలవబోతున్నాం.. నిజంగా చెబుతున్నా.. మేమే గెలిచాం.. చట్టాన్ని సరిగ్గా అమలు చేసి.. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలని కోరుతున్నాం."’ అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు. ఒక పక్క ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకుండా తనకు తానే గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. ఇదే సమయంలో భారీ విజయోత్సవానికి సిద్ధంగా ఉండాలంటూ తన అభిమానులకు ట్రంప్ పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ ను అనుమతిస్తున్నారని దీన్ని వెంటనే ఆపాలని అయన కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల కౌంటింగ్ అమెరికా ప్రజలను మోసం చేయడమేనని అయన అన్నారు.
అంతేకాకుండా ఈ ప్రకటనకు ముందు ట్రంప్ "ఈ రోజు రాత్రి నేను కీలక ప్రకటన చేస్తా.. భారీ విజయం మనకే.." అని ట్వీట్ చేశారు. దానికి ముందు ట్రంప్ మరో ట్వీట్ చేస్తూ.. "భారీ విజయం దిశగా మనం దూసుకెళ్తున్నాం.. కానీ ప్రత్యర్థి పార్టీ విజయాన్ని అపహరించుకుపోవాలని చూస్తోంది.. దీన్ని మనం అడ్డుకుని తీరతాం.. పోలింగ్ ముగిశాక ఓటింగ్ ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదు.." అని ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ ట్విటర్ ఆ ట్వీట్‌ను జనంలోకి వెళ్లకుండా చేసింది. దీనిని తప్పుడు ప్రకటనగా అభివర్ణిస్తూ.. అమెరికా ఎన్నికల సెక్యూరిటీ గురించి ఓ లింక్‌ను కూడా ఆ ట్వీట్‌కు జోడించింది.