వలసదారులపై అప్పుడే ట్రంప్ ఉక్కుపాదం...
posted on Nov 14, 2016 @ 11:17AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. ఆయన ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి ఏదో ఒక సందర్బంలో వలసదారులపై విమర్శలు చేస్తూనే ఉండేవారు. ‘అక్రమ వలసదారులపై వేటు’పై వెనకడుగు వేయబోనని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత కూడా దీనిపై స్పందించారు. అమెరికాలో కోటి మందికిపైగా అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో క్రిమినల్ రికార్డులున్న 30 లక్షల మందిని దేశం నుంచి వెళ్లగొట్టేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులపై చర్యలు తప్పవని తెలిపారు. ‘యూఎస్ లో అక్రమంగా నివసిస్తోన్న వారిలో చాలామంది డ్రగ్స్ డీలర్లు, క్రిమినల్స్, గ్యాంగ్స్ నడిపేవారున్నారు. అలాంటివాళ్లు కనీసం 20 నుంచి 30 లక్షల మంది ఉంటారని అంచనా. వాళ్లందరినీ దేశం నుంచి తరిమేస్తాం. అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంటూనే దేశసరిహద్దుల్లోనూ అవసరమైన మేరకు రక్షణ ఏర్పాటుచేస్తాం. వలసదారులను వెళ్లగొట్టడం ఒక సవాలైతే, అలాంటి వాళ్లు తిరిగి అమెరికాలోకి రాకుండా సరిహద్దుల వద్ద నిఘాను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా సరిహద్దు భద్రతను పెంచి, తర్వాత వలసదారు వేట కొనసాగిస్తాం’అని ట్రంప్ చెప్పారు.