వైఎస్ వారసత్వం అంటే ఒక కులంపై వేధింపులు.. సాధింపులేనా?

ఇరవై ఏళ్ల యుద్ధానికి తెరపడింది. ఇది చూడడానికి ఒక సంస్థపై యుద్ధమే అయినా, దీని వెనుక రాజకీయం, కులం కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగే ఒక వ్యక్తి, ఒక పత్రికపై పరోక్షంగా, ప్రత్యక్షంగా జరిగిన దాడి.  రాష్ట్రంలో  విపరీతమైన ప్రజాభిమానం, విశ్వాసం ఉన్న పత్రిక, దానిని నిర్వహిస్తున్న యజమాని రామోజీరావుగారి మీద జరిగిన కక్షసాధింపు చర్య. సామాన్య, మధ్యతరగతి ప్రజల విశ్వాసం చూరగొన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో  ఫిర్యాదులు చేయించి, ప్రభుత్వం చేత కేసులు వేయించారు. దేశంలో ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు, డొల్ల కంపెనీలు నడుస్తుంటే, ఈ సంస్థపైనే కేసు వేయడానికి కారణం రాజకీయమే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్న సామాజికవర్గాన్ని, దానికి మూలస్తంభం లాంటి  వ్యక్తి ఆర్థిక మూలాలు దెబ్బకొడితే రాష్ట్రంలో తనకు ఎదురు ఉండదని భావించారేమో!
2006లోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేత రిజర్వ్ బ్యాంకుకు, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంకు ఫిర్యాదు చేయించారు. 2008లో  రాష్ట్రప్రభుత్వమే కేసు కట్టింది.  
వేలాది మంది డిపాజిటర్లలో ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. పరోక్షంగా కొందరిపై ఒత్తడి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అదీ ఆ కంపెనీపై ఉన్న విశ్వసనీయత. అయినా ప్రభుత్వమే కేసు వేయడంతో.. ఈ వ్యాపారాన్ని ఉపసంహరించుకోదలచిన మార్గదర్శి, డిపాజిట్ దారులకు వారి నగదు వాపసు చేయడానికి సిద్ధమైంది. అయితే ఆ ప్రయత్నంలోనూ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడింది. రామోజీ గ్రూపు సంస్థల నిధులు సేకరించడానికి కొన్ని యూనిట్లు విక్రయానికి పెట్టినా.. బ్లాక్ స్టోన్ వంటి కంపెనీని బెదరించి వెనక్కుపోయేలా చేసింది రాజకీయమే.

నిమేష్ కంపానీని కూడా అలాగే కేసులు పెట్టి బెదరించే పరిస్థితి రావడంతో, ఆయన అమెరికా వెళ్లి, అక్కడ నుంచి రిలయెన్స్ ద్వారా  రామోజీ గ్రూప్ సంస్థలకు నిధులు సమకూర్చారు.  అయితే డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం కక్ష గట్టి, ఆఫీసులోని చెక్కుబుక్కులు, రశీదు పుస్తకాలతో సహా మొత్తం డాక్యుమెంట్లన్నీ ట్రక్కుల కొద్దీ అప్పటి సీఐడీ అధికారుల చేత దాటవేయించారు. ఈ చర్య డిపాజిటర్లకి నష్టం అని ఆలోచన లేకుండా వైఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేసు కొట్టివేసినా, మళ్లీ సుప్రీంలో కేసు వేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది.  తాజాగా ఈ కేసును కొట్టివేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ఎక్కడైనా డిపాజిటర్లు కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు.  కానీ మార్గదర్శి విషయంలో డిపాజిటర్లు కంపెనీ కోసం అనుకూలంగా ఉద్యమించారు.

 రాజశేఖరరెడ్డి శకం ముగిశాక, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా అదే ఒరవడిలో కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో చట్టబద్ధత లేని చిట్ ఫండ్ కంపెనీల జోలికి పోకుండా, ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కేసులు పెట్టించి, ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆ కంపెనీ వ్యాపారాన్ని స్తంభింపచేశారు.  రిజిష్ట్రార్ లను ఆఫీసులపైకి  తనిఖీలకు పంపి, వారి చేత కేసులు పెట్టించి, సీఐడీ ద్వారా దర్యాప్తు పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ముగ్గరు మార్గదర్శి మేనేజర్లను, ఒక ఆడిటర్ ను అరెస్టు చేసి హడావుడి చేశారు. చివరకు హైదరాబాద్ లో వృద్ధాప్యంతో మంచం మీద ఉన్న రామోజీరావుగారిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటి చుట్టూ పోలీసుల్ని మోహరించారు. అయితే సకాలంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి, అండగా నిలిచింది.  ఒక్క రోజైనా ఆయన్ను జైలులో పెట్టాలన్న జగన్ సంకల్పానికి బ్రేక్ పడింది.

అవినీతి కేసులో జైలుకెళ్ళిన జగన్, ప్రత్యర్థుల్ని జైలులో పెడితేగానీ, తన ప్రతిష్టకు కలిగిన భంగం తొలుగుతుందనుకున్నారేమో మొత్తానికి ఆయన దుందుడుకు చర్యలకు వెంటనే వచ్చిన ఎన్నికల్లో ఓటమే ఆయన్ని కట్టడి చేసింది.  మొత్తం మార్గదర్శిపైనా, రామోజీరావుగారిపైనా జరిగిన ఈ వేధింపులు , కేవలం ఒక సామాజికవర్గంపైనా, ప్రత్యర్థి తెలుగుదేశంపైనా జరిగిన రాజకీయ కక్ష సాధింపుగానే సాధారణ ప్రజలు సైతం అర్ధం చేసుకున్నారు. రాజకీయాల్లో అధికారాన్ని వారసత్వంగా కోరుకోవడం సహజం. కానీ తెలుగు రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు వారసత్వం కావడం దురదృష్టకరం.

ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచయతీ ఫలితాలు.. సీఎం రేవంత్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు.  పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు.  అంటే  2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు.  2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలను సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు.  జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించగలరా?  అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు విజయం!?

తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్ధానంలో బీఆర్ఎస్ నిలిచింది. బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై   తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇదేంటి ఎన్నికలు జరిగింది తెలంగాణలో  ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి కలిగించేలా సోషల్ మీడియాలో వార్త  హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సంర్పంచ్ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్ జగన్నాథమ్. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.  ఈ ఎన్నికలో   భూక్య చంద్రబాబు  బానోత్ జగన్నాథమ్  బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు.  దీనిపైనే నెటిజనులు తెలంగాణలో కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  

సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు. నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు  ప్రధాని మోడీ,  జలవనరులశాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ తో వేర్వేరుగా భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరనున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గు.. బీజేపీ కార్యాలయాల ముట్టడి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

షర్మిలకు బర్త్ డే విషెస్ చెప్పని జగన్.. కారణమేంటంటే?

జగన్.. సొంత చెల్లికి కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పని వ్యక్తిగా మరోసారి వార్తలలో నిలిచారు. ఔను జగన్ చెల్లెలు షర్మిల బుధవారం (డిసెంబర్ 17) తన జన్మదినం జరుపుకున్నారు.  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచా యితీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరం పెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.   దీంతో షర్మిల తన మకాం హైదరాబాద్ కు మార్చి కొంత కాలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. అయితే..  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే.. 2024 ఎన్నికలలో జగన్ ఓటమిలో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.  ఈ పోలిటికల్ డిఫరెన్సెస్ కు తోడు.. జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల బదలీ వ్యవహారంలో వీరి మధ్య ట్రైబ్యునల్ లో కేసు కూడా నడుస్తోంది.  అది పక్కన పెడితే.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీలపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ గొంతును బలంగా వినిపిస్తున్నారు. అందులో తప్పుపట్టాడినికి ఏమీ లేదు.   కాగా షర్మిల జన్మదినం సందర్భంగా కూటమి నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి షర్మిల ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు కూడా.  అయితే సొంత అన్న జగన్ షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం సరికాదని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. తెల్లారి లేస్తే గాంధీ డైనాస్టీ అంటూ.. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శలతో విరుచుకుపడే ప్రధాని నరేంద్ర మోడీ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తుంటారు. అంతెందుకు నిత్యం చంద్రబాబుపై ఏక వచన ప్రయోగంతో విమర్శలు గుప్పించే జగన్ కు కూడా చంద్రబాబు జగన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పారు. తద్వారా వారంతా విభేదించడం, భిన్నాభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన వ్యక్తిగత వైరం ఉండనవసరం లేదని చాటారు. కానీ జగన్ మాత్రం రాజకీయంగానైనా, కుటుంబ పరంగానైనా సరే తనతో విభేదించిన వారిని శత్రువులుగా చూస్తారనడానికి సొంత చెల్లికి బర్త్ డే విషెస్ తెలపకపోవడాన్ని ఉదాహరణగా చూపు తున్నారు పరిశీలకులు. 

మూడో విడతలోనూ ‘హస్తం’దే పై చేయి!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లోనూ కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు జరగగా, 2,286 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.  మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 7,093 పంచాయతీల్లో  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 3,488   స్థానాలలో విజ యం సాధించి బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి ఉనికి చాటుకుంది.  బీజేపీ 699  స్థానాలలో గెలిచి నామమాత్రపు ప్రభావాన్ని చూపింది.   అదలా ఉంటే మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు 24 , సీపీఎం 7 స్థానాలలో విజయం సాధించారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దపేట మినహా మిగిలి30 జిల్లల్లోనూ  కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.  కాగా,  పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులే. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. అయితే అలా గెలిచిన వారిలో   80 శాతం మంది కాంగ్రె‌స్ రెబల్సే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది. మూడో విడత పంచాయతీ పోలింగ్ లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.  మూడో విడతలో 85.77 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతతో పోలిస్తే ఇది   0.9 శాతం తక్కువ. కాగా మూడు విడతలూ కలిసి మొత్తం 85.30 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92. 56 శాతం ఓటింగ్ జరగగా,  నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్‌  జరిగింది. ఇలా ఉండగా నూతనంగా ఎన్నికైక సర్పంచ్ లు  ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా ప్రకటించిన మేరకు డిసెంబర్ 20న ముహూర్తం మంచిగా లేదంటూ ఎన్నికైన సర్పంచ్ లు తెలపడంతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 22కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.20న ముహూర్తం సరిగా లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తేదీని మార్చినట్లు తెలిపింది.

మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం

  తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  

ఉపఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు : కేటీఆర్

  అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "స్వంత తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా, వారిని కాపాడటం రాహుల్ గాంధీ, మరియు కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం" అని మండిపడ్డారు. ఉప ఎన్నికల భయంతోనే వెనకడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు  అంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని, తెలంగాణ సమాజానికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి, నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి మేరకు స్పీకర్  కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా, కేవలం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అందులోని నిబంధనలను పట్టించుకోకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేటీఆర్ తెలిపారు. సాంకేతికంగా అడ్డుపెట్టుకుని గోడ దూకిన ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ సంబరపడినా, ప్రజాక్షేత్రంలో వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.