అప్రూవర్ దొరికాడు.. ఇక కవితకు చుక్కలే!?
posted on Nov 8, 2022 8:50AM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి దాకా కవితపై ఆరోపణలు వెల్లువెత్తినా ఆమెను ఈడీ కానీ సీబీఐ కానీ ఇప్పటి వరకూ విచారించలేదు.
అయితే ఆమెకు సన్నిహితులను మాత్రం విచారించారు. వారిలో బోయనపల్లి అభిషేక్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. ఈయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అసలు ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన రామచంద్రపిళ్లై అప్రూవర్ గా మారుతారని ఇంత వరకూ లీకులు వదులుతూ వచ్చారు.
అనూహ్యంగా సీబీఐ దినేష్ అరోరాను అప్రూవర్ గా ప్రకటించి, ఆయనను సాక్షిగా పరిగణించాలని కోర్టును కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ముగ్గురిలో దినేష్ అరోరా ఒకరన్న సంగతి తెలిసిందే.దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె కవిత ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి విదితమే.
కవిత పీఏగా ప్రచారంలో ఉన్న బోయినపల్లి అభిషేక్‌నుఇప్పటికే అరెస్ట్ అయ్యారు. బోయినపల్లి అభిషేక్ కు బెయిలిస్తే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ సీబీఐ అడ్డుకుంది. ఇప్పుడు దినేష్ అరోరాను సాక్షిగా చేయడంతో.. కవిత చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఏ క్షణంలోనైనా కవితను సీబీఐ విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం మీద దినేష్ అరోరా అప్రూవర్ గా మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు జోరందుకున్నట్లేనని అంటున్నారు.