గాంధీల వీర విధేయుడి శకం… దిగ్విజయంగా ముగిసిపోతోందా?
posted on Aug 1, 2017 @ 4:10PM
కాంగ్రెస్ అనగానే ఇవాళ్ల దేశంలో గుర్తుకు వచ్చే ముఖాల్లో దిగ్విజయ్ ఒకరు! ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. అంతకు మించి లౌకికవాది. ముస్లిమ్ మైనార్టీల కోసం ఎంతకైనా తెగించి మాట్లాడటం ఆయన స్టైల్! కాని, ఎప్పుడో ఏళ్ల కిందట మధ్యప్రదేశ్ వదిలేసి దిల్లీ వెళ్లిన ఆయన మళ్లీ తన స్వంత రాష్ట్రం దిశగా చూపు సారించలేదు. కారణం… వివిధ రాష్ట్రాల్లో పార్టీ కోసం పని చేస్తూ సోనియా, రాహుల్ కు తలలో నాలుకలా మసలుకోవటమే! కాని, ఇప్పుడు అదే డిగ్గీ రాజా మెల్ల మెల్లగా పెవలియన్ దారి పడుతున్నాడా? తాజా పరిణామాలు దిగ్విజయ్ దిగ్విజయ యాత్ర ముగిసినట్టే అనిపించేలా సంకేతాలిస్తున్నాయి…
దిగ్విజయ్ చేతి నుంచి తెలంగాణ చేజారింది. అతడ్ని రాష్ట్ర ఇంఛార్జ్ గా తీసేసి కుంతియాను నియమించింది ఏఐసీసీ. ఇది కాంగ్రెస్ పార్టీలో పెద్ద వింతేం కాదు. చాలా సార్లు సీనియర్ నాయకుల్ని అటు ఇటు మారుస్తుంటారు కాంగ్రెస్ పెద్దలు. కాని, దిగ్విజయ్ ప్రజెంట్ కండీషన్ వేరు! ఆయన ప్రాభావం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. అందుకే, ప్రభావమూ తగ్గించేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్!
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమయంలో దిగ్విజయ్ సింగే తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్. అటు రాహుల్, సోనియా, ఇటు కేసీఆర్ అందరికి లింకుగా వుంటూ విభజన జరిపించారు. కాని, తరువాత పరిణామాలు తెలిసినవే. కేసీఆర్ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయటం అటుంచితే… కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదు. ఫలితంగా తెలంగాణ ఇచ్చి కూడా టీ కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితం అయింది. ఇక తరువాత ఈ మూళ్లలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ను ఏమాత్రం దూకించలేకపోయారు దిగ్విజయ్ సింగ్. పైగా అప్పుడప్పుడూ వివాదాస్పద ట్వీట్లతో రచ్చ మాత్రం చేసుకున్నారు…
ఓ సారి తెలంగాణ పోలీస్ శాఖని అనుమానించినట్టు మాట్లాడి గొడవ కొని తెచ్చుకున్నారు డిగ్గీ. మళ్లీ ఈ మధ్యే డ్రగ్స్ కేసుకి , కేటీఆర్ కి లింక్ పెట్టే ప్రయత్నం చేసి అనవసర రాద్దాంతం చేసుకున్నారు. ఇలా డిగ్గీ వల్ల తెలంగాణ కాంగ్రెస్ కి లాభం లేకపోగా నష్టం ఎదురవుతుండటంతో హైకమాండ్ కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కాదు, తెలంగాణ నేతలు కూడా కొంత మంది దిగ్విజయ్ తీరుపై పార్టీ పెద్దలకి కంప్లైంట్ ఇచ్చారట! కాని, ఒక్క తెలంగాణ మాత్రమే కాదు… మొన్నా మధ్య గోవా కూడా దిగ్విజయ్ చేజారింది. అక్కడ అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీ చేత గవర్నమెంట్ ఏర్పాటు చేయించలేకపోయారు దిగ్విజయ్. మనోహరి పారికర్, నితిన్ గడ్కరీల ముందు ఈయన పాచికలు పారలేదు. అప్పుడు కూడా ఆగ్రహించిన కాంగ్రెస్ హై కమాండ్ ఆ రాష్ట్రాన్ని డిగ్గీ నుంచీ లాగేసుకుంది!
గాంధీలకి వీర విధేయుడని పేరున్న దిగ్విజయ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. స్వంత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో ఏ మాత్రం విలువ లేకుండా పోయారు ఎప్పుడో! ఇక ఇప్పుడు దిల్లీలోనూ ఆయన శకం ముగిసినట్లు కనిపిస్తోంది. మరో వైపు ఆయనని ఇంత కాలం పోషిస్తూ వచ్చిన హస్తం పార్టీకే మోదీ, అమిత్ షా రూపంలో తీవ్రమైన ఒత్తిడి ఎదురువుతోంది! ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దిగ్విజయ్ అసలు వార్తల్లో వుంటారో వుండరో మరి?