రాష్ట్ర కాంగ్రెస్ నావని దిగ్విజయంగా ఒడ్డుకి చేర్చగలడా?
posted on Jun 17, 2013 9:03AM
సాధారణ ఎన్నికలకి కేవలం పది నెలలే సమయం మిగిలి ఉండటంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవసరమయిన యంపీలను అందించే ఆంధ్ర రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఆ ప్రయత్నంలోనే భాగంగానే రాష్ట్ర వ్యహరాలపై పూర్తి అవగాహన ఉన్న దిగ్విజయ్ సింగ్ ను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించింది.
రాష్ట్ర కాంగ్రెస్ ని ప్రధానంగా మూడు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. 1.తెలంగాణా అంశం, 2.రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి, 3. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏవిధంగా వ్యవహరించాలి? ఈ మూడింటినీ పరిష్కరించనిదే రాష్ట్రంలో పార్టీ సజావుగా సాగే అవకాశం లేదు గనుక ఆయన మొట్ట మొదట వీటిపైనే దృష్టి సారించే అవకాశం ఉంది.
ఇంతవరకు రాష్ట్ర వ్యవహారాలు చూసిన గులాం నబీ ఆజాద్ క్లిష్టమయిన ఈ వ్యవహారాలను పరిష్కరించలేక వాటిపై నాన్పుడు ధోరణి అవలంభించడంతో సమస్య జటిలమయిపోయింది. అయితే, దిగ్విజయ్ సింగ్ పద్ధతి ఆయనకు పూర్తిగా విరుద్దం. ఆయన త్వరగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. బహుశః ఈ కారణం చేతనే రాహుల్ గాంధీ ఏరికోరి ఆయనకు ఈ భాధ్యతలు అప్పగించి ఉండవచ్చును. రాహుల్ టీంలో ఒకరయిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర కాంగ్రెస్ సమస్యలను పరిష్కరించడంలో ఇంతవరకు సాగుతున్న పద్దతులకు స్వస్తి చెప్పి వీలయినంత త్వరగా తనదయిన శైలిలో పరిష్కరించవచ్చును.
తెలంగాణా సమస్యపై ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినందున ఏవోకొన్నిపరిష్కారమార్గాలు సిద్ధమయ్యే ఉంటాయి గనుక వాటిలోంచి తగిన దానిని ఎంచుకొని ఆయన ముందుకు సాగవచ్చును. ఆయనకు రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఉంది గనుక ఆయన ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించవచ్చును. ఇక, ఆయనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అందరు నేతలతో చక్కటి సంబంధాలున్నాయి గనుక, బహుశః అందరితో సంప్రదింపులు జరిపి తెలంగాణా అంశంపై అందరికీ ఆమోద యోగ్యమయిన పరిష్కారం కనుగొనవచ్చును. అదేవిధంగా పార్టీలో అసమ్మతి నేతలను కూడా ఆయన గాడిన పెట్టవచ్చును.
ఇక తెలంగాణా అంశం తరువాతః అంత కీలకమయింది జగన్ అంశం. ఆయనను ఒప్పించి వైకాపాను కాంగ్రెస్ లో విలీనం లేదా ఎన్నికల పొత్తులు చేసుకోగలిగితేనే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోగలదు. గనుక, ఆ పార్టీ నేతలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని ఆ పార్టీని కాంగ్రెస్ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేయవచ్చును.
ఈ మూడు సమస్యలను కనుక ఆయన దిగ్విజయంగా పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో, కేంద్రంలో ఆయన ప్రతిష్ట మరింత పెరగవచ్చును. అయితే డిసెంబరులో తన స్వంత రాష్ట్రమయిన మధ్యప్రదేశ్ లో శాసన సభకి ఎన్నికలు జరగనున్నందున మరి ఆయన మన రాష్ట్ర వ్యవహారాలను పరిష్కరించడానికి అంత చొరవ చూపగలరో లేదో అనుమానమే.