సుబ్బన్న ఇక లేరు
posted on Dec 8, 2013 8:35AM
వెండితెర మీద హాస్యశకం ముగిసింది.. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న ఓ అసామాన్య నటుడు తుది శాస్వవిడిచాడు.. హాస్యనటుడిగా, రచయితగా, దర్శకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన గత ఏడాది కాలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదులో చైతన్యపురి వద్ద గల గీతా ఆసుపత్రిలో నిన్న రాత్రి పది గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన స్వస్తలమయిన ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి.
ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం...ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే ఈ తరం ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పాత్ర అమాయకపు కాలేజ్ లెక్చరర్.. ఎన్నో సినిమాల్లో లెక్చరర్‌గా నటించిన ఆయన తన నటనా పటిమతో ఆ పాత్రకే అందం తీసుకువచ్చారు.. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా చేశారు..1960 ఆగస్టు 9న ప్రకాశం జిల్లా లొని కొమ్మినేని వారిపాలెంలో జన్మించారు ధర్మవరపు.. చిన్ననాటి నుంచే నటన మీద ఉన్న మక్కువతో నాటకాలు వేసేవారు.. ముఖ్యంగా వామపక్షభావజాలానికి ఆకర్షిడైన ఆయన ప్రజానాట్యమండలితో కలిసి ఎన్నో సందేశాత్మక రచనలు చేశారు..
చదువుకునే వయసులోనే ఎక్కువగా నాటకాల వైపు మల్లడంతో విద్యాబ్యాసం కూడా దెబ్బతింది.. ఒక దిశలో ఇంటర్ కూడా ఫెయిల్ అయిన ధర్మవరం తల్లి కోరిక మేరకు పట్టుదలగా చదివి ఇంటర్ పూర్తి చేశాడు.. తరువాత బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఉద్యోగిగా చేరారు..అయితే నాటకాల మీద ఆయనకు ఉన్న మక్కువ ఆయన్ను ఎక్కువ రోజులు ఉద్యోగిగా కొనసాగనివ్వలేదు.. దీంతో కొంత మంది దగ్గర మిత్రులతో కలిసిన నాటకాలు వేయటం ప్రారంభించారు. అలా నాటక రంగంలో బిజీ కావటంతో ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామ చేయాల్సి వచ్చింది.నాటకరంగంలో బిజీగా ఉన్న ఆయన ఆకాశవాణి కొసం నాటకాలు రాయడం ప్రారంభించారు.. అప్పటి వరకు నటిడిగా ఆయనకు ఉన్న అనుభవానికి తన మార్క్ హాస్యం జోడించి అద్భుతమైన నాటికలు తయారు చేశారు..
తెలుగు టెలివిజన్ రంగానికి ధారావాహికలను పరిచయం చేసిన ఘనత కూడా ధర్మవరానిదే.. అప్పటి వరకు టెలీఫిలిం లు మాత్రమే తెలిసిన తెలుగు వారికి ఒకే సీరియల్‌ను భాగాలు టెలికాస్ట్ చేయోచ్చు అంటూ అనగనగా ఒక శోభ సీరియల్ ద్వారా పరిచయం చేశారు.. తరువాత బుల్లితెర మీద ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో అలరించారు, సీరియల్ దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యంగా మనసు గుర్రం లేదు కళ్లెం, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ముఖ్యంగా దూరదర్శన్‌లో ఆయన చేసిన ఆనందో బ్రహ్మ ఆయనకు నటునిగా దర్శకునిగా మంచి గుర్తింపు నిచ్చింది.. ఈ సీరియల్ ఘనవిజయం సాదించటంతో ఆయన టెలివిజన్ ప్రేక్షకులకే కాదు.. సినీరంగంలోనూ సుపరిచితులయ్యారు..
టెలివిజన్ రంగంలో మంచి పేరు తెచ్చుకోవటంతో సినీరంగం నుంచి కూడా ధర్మవరానికి అవకాశాలు వచ్చాయి.. ఎంతో మంది హస్యనటులకు నటులు జన్మనిచ్చాన జంధ్యాల ధర్మవరాన్ని జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరం తరువాత వరుస అవకాశాలతో మంచి హాస్యనటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. టెలివిజన్ రంగంలో దర్శకునిగా తనకు ఉన్న అనుభవంతో తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ధర్మవరం.. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాదించకపోవటం తరువాత దర్శకత్వానికి దూరంగా ఉంటూ కేవలం నటునిగానే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు..
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వునేను, జయం, ధైర్యం లాంటి సినిమాలతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధర్మవరం.. ముఖ్యంగా కాలేజీ లెక్చరర్‌తో పాటు తాగుబోతు పాత్రలలో ఆయన నటన కడుపుబ్బ నవ్విస్తుంది.. ఆయన చేసిన పాత్రలలో ఒక్కడు సినిమాలోని పాస్ పోర్ట్ ఆఫీసర్ క్యారెక్టర్‌తో పాటు, వర్షం సినిమాలోని వాతావరణ శాఖాదికారి పాత్రలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.. ముఖ్యంగా ఢిఫరెంట్ డిక్షన్‌తో ఆయన చెప్పే డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్ పడేవి..మరింత కాలం తన నటనతో మనల్ని అలరిస్తాడనుకున్న ధర్మవరం ఇలా అర్థాంతరంగా మన అందరిన మోసం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో సినీ రంగంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్‌భ్రాంతి గురయ్యారు.. ఆయన మరణంతో తెలుగు తెర మీద ఓ హస్యశకం ముగిసింది.. కొన్ని పాత్రల ప్రయాణం ఆగిపోయింది.. ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి మరొక్కసారి నివాళి అర్పిద్దాం..