తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on May 31, 2025 @ 10:20AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం (మే 31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 71 వేల 721 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 11 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 47 లక్షల రూపాయలు వచ్చింది.
ఇలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు సౌకర్యాలు కరవయ్యాయంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు రావాలి, భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని నచ్చ చెప్పి వారడిగిన సౌకర్యాలు కల్పించారు. విపరీతమైన రద్దీ, గంటల తరబడి క్యూలో నిలుచోవలసి రావడంతోనే భక్తులలో అసహనం పెరిగి ఆందోళనకు దిగారు.