కుర్షీద్ చెప్పిన ‘అమెరికా క్షమాపణలు’ ఒట్టి కధే
posted on Dec 20, 2013 @ 11:51AM
భారత దౌత్యవేత్త దేవయాని కొబ్రగాడే పట్ల అమెరికా అనుచిత వైఖరిని భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఆమెపై మోపిన కేసులను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారత్ కోరుతోంది. భారత విదేశాంగ శాఖా మంత్రి సల్మాన్ కుర్షీద్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “స్టేట్ సెక్రెటరీ ఆఫ్ అమెరికా జాన్ కెర్రీ నాతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో నేను అందుబాటులో లేకోపోవడంతో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర మీనన్ తో మాట్లాడిన ఆయన, మీనన్ కు అమెరికా ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. ఈరోజు జాన్ కేర్రీ నాతో మాట్లాడేందుకు సమయం నిర్దారించబడింది,” అని తెలిపారు."
కానీ, న్యూయార్క్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మీడియాతో మాట్లాడుతూ “మేము ఎటువంటి తప్పు చేయలేదు. మా చట్టాలకు లోబడే వ్యవహరించాము. అందువలన మేమెవరికీ క్షమాపణలు చెప్పనవసరం లేదు. అదే విదంగా దేవయానిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొనే ప్రసక్తి లేదు. కోర్టు పరిధిలో ఉన్నఈ వ్యవహారంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నాకు తెలిసినంతవరకు జాన్ కెర్రీ భారత్ అధికారులతో లేదా మంత్రులతో మాట్లాడేందుకు ఎటువంటి అపాయింటుమెంటు ఇవ్వలేదు,” అని కుండ బద్దలుకొట్టారు.
మేరీ హర్ఫ్ అమెరిక అగ్ర రాజ్యాహంకారానికి అద్దం పడుతుంటే, సల్మాన్ కుర్షీద్ చేసిన ప్రకటన భారత ప్రజలను మోసపుచ్చేదిగా ఉంది. ఈ వ్యవహారం మరికొంత కాలం సాగిన తరువాత, అకస్మాత్తుగా ‘ఇటలీ నావికుల’ వ్యవహారంలాగే ఇదీ చల్లబడిపోయి, ఆ తరువాత వార్తలలోంచి కూడా మాయమయిపోతుంది. కానీ, ఒక భారతీయ మహిళ పట్ల అమెరికా అధికారులు అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆదేశానికి మాయని మచ్చగా మిగిలిపోవడంఖాయం. అయితే అమెరికా మొహం మీద ఇంతకంటే చాలా పెద్ద పెద్ద మచ్చలే ఉన్నందున వాటి మధ్య ఈ మచ్చకూడ కనబడకుండా పోతుంది.