ఏపీలో నడకే నేరమా? జగన్ హయాంలో ప్రజాస్వామ్యం బందీ!
posted on Oct 26, 2022 @ 12:48PM
ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదొక దారి అన్నది సామెత.. అలాగే దేశమంతా ఒక దారి అయితే జగన్ అధికారంలో ఉన్న ఏపీది ఒక్కటీ ఒక దారి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అమరావతి రైతుల మహాపాదయాత్రను నిలువరించడానికి జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అయితే దేశంలో ఇదే సమయంలో ఎన్నో పాదయాత్రలు జరుగుతున్నాయి.
జగన్ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రస్ ప్రముఖ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే ఏపీలో నిరాటంకంగా పూర్తి చేసుకుని తెలంగాణలో ప్రవేశించింది. ఇక జగన్ కు స్వయాన సోదరి.. వెసీపీ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వీరెవరికీ ఎలాంటి అభ్యంతరాలు, అడ్డంకులూ లేవు. కానీ ఏపీలో రైతుల పాదయాత్రకు మాత్రం అడుగడుగునా అడ్డంకులు. ప్రభుత్వం, పోలీసులు, అధికారులు, వైసీపీ నేతలు ఇలా ప్రభుత్వం చెప్పుచేతల్లో, కనుసన్నలలో మెలగడమే తమకు రక్ష అని భావించే వారంతా పాదయాత్రను అడ్డుకోవడమే ఏకైక అజెండా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
రైతుల పాదయాత్రను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల పాదయాత్ర ఒక్కటే సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ అయిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడం జగన్ సర్కార్ కు చెంపపెట్టు లాంటిదే అయినా.. దాని గురించిన పట్టింపే లేకుండా సర్కార్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రైతులపైనే కాదు.. వారి పాదయాత్రకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలపైనా, ప్రజా సంఘాలపైనా కూడా ఆంక్షలు విధించడం ద్వారా రైతులే కాదు.. వారి మద్దతు దారులెవరూ రోడ్లపై నడవడానికి వీల్లేదన్న ఒక వింత, కొత్త నిబంధనలకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినా విమర్శలు, కోర్టు మొట్టికాయలకు అలవాటు పడిపోయిన జగన్ సర్కార్ వాటిని వేటినీ ఖాతరు చేయడం లేదు. దేశంలో రైతుల పాదయాత్రకు తప్ప మరే పాదయాత్రలోనూ అందులో పాల్గొన్న వారి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులూ అడగడం లేదు. కానీ రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు న్యాయం కోసం రోడ్డెక్కి యాత్ర చేస్తుంటే మాత్రం వారి గుర్తింపు చూపించిన తరువాతే అడుగు కదపాలంటూ నియంత్రిస్తున్నారు. నిజమే కోర్టు ఆరువందల మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పు కాపీ ఇంకా అందనే లేదు.. కానీ పోలీసులు మాత్రం ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు చేపించిన తరువాతే అడుగు ముందుకు వేయాలంటూ అమరావతి రైతులను నిలువరించారు.
అమరావతి రైతులకు మద్దతుగా వచ్చిన వారినీ ఆపేశారు. దీంతో రైతులు కోర్టులోనే తెల్చుకుంటామంటూ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తాము తీసుకున్నది విరామమే కానీ.. యాత్రను ఆపేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే బొత్స వంటి మంత్రులు.. ఇతర ఘనత వహించిన వైసీపీ నేతలూ మాత్రం రైతుల యాత్ర ఆగిపోయినట్లేననీ, మహాపాదయాత్ర పేరిట నడుస్తున్న వారెవరూ రైతులే కాదంటూ తమ వాచాలతకు పదును పెట్టారు.
వాస్తవానికి రైతుల మహాపాదయాత్రకు అధికార వైసీపీ వినా.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలూ, ప్రజలూ మద్దతు ఇస్తున్నారు. ఆఖరికి మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులూ, విశాఖ గర్జనలూ కూడా ప్రజాదరణ ముందు విఫలమయ్యాయి. విశాఖ వాసులు కూడా అమరావతికే జై కొడుతున్నారనడానికి విశాఖ గర్జన్ తుస్సు మనడమే నిదర్శనమని పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు. స్వయంగా మంత్రి ధర్మానే పలు సందర్భాలలో విశాఖ వాసులే మూడురాజధానుల అంశానికి మద్దతు ఇవ్వడం లేదంటూ చిర్రుబుర్రులాడారు.
కానీ జగన్ సర్కార్ మాత్రం రైతుల మహాపాదయాత్ర తన రాజకీయ అస్థిత్వానికే సవాల్ గా భావిస్తున్నది. విపక్ష నేతగా స్వయంగా జగన్ సైతం రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నాడు ఆ పాదయాత్రను ఇలాగే అడ్డుకుని ఉంటే వైసీపీ నేడు అధికారంలో ఉండి ఉండేదా అని సామాన్యులు సైతం ప్రశ్రిస్తున్న పరిస్థితి నేడు ఏపీలో నెలకొని ఉంది. అయినా దమనకాండతో.. పోలీసులను ప్రయోగించి సర్వ హక్కులనూ కాలరాయడానికి జగన్ సర్కార్ వెనుకాడటం లేదు.