ఢిల్లీలో గోడ కూలి 8 మంది మృతి
posted on Aug 9, 2025 @ 5:37PM
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. జైత్‌పూర్ ప్రాంతంలో ఓ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అక్కడి ఓ ఆలయం సమీపంలోని గోడ పూర్తిగా నానిపోయింది.
ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గోడ కూలిపోవడంతో సమీపంలో నివసిస్తున్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతులను ముట్టు అలీ (45), రబీబుల్ (30), షబీబుల్ (30), రుబీనా (25), డాలీ (25), హషిబుల్, రుఖ్సానా (6), హసీనా (7)గా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే వారు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పాత ఇనుము వ్యాపారులు నివసించే ఈ మురికివాడలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.