ఢిల్లీ కేసులు.. తెలంగాణ లింకులు
posted on Sep 30, 2022 @ 2:05PM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు తీగ లాగితే కేసు మూలాలు తెలంగాణలో బయట పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ముఖ్యమంత్రి సమీప బంధువు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా, మరి కొందరు తెరాస బంధువర్గానికి చెందిన నాయకులు, వ్యాపార వేత్తలకు ఆ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కేసు విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైదరాబాద్’లో పలుచోట్ల తనిఖీలు జరిపింది. కొందరికి నోటేసులు జారీ చేసింది. ఒక రిద్దరిని విచారించింది. కవిత, సంతోష్ సహా మరి కొందరు ముఖ్యులకు నోటీసులు వచ్చాయని, వస్తున్నాయని ప్రచారం నడుస్తోంది.ఈ నేపధ్యంలో ఏ రోజుకు ఆ రోజు ఏమి జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. అయితే ఈడీ అధికారులు ఎందుకనో గానీ, ఈ కేసులో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, సిసోడియా అరెస్టుకు రంగం సిద్దం మైందని అయినా భయపడేది లేదని ప్రకటించి నెలరోజుల పైనే అయింది, అయినా. ఇంతవరకు సిసోడియా అరెస్ట్ జరగలేదు.
కానీ, ముఖ్యమంత్రి కేజ్రివాల్ సన్నిహితుడు, విజయ్ నాయర్, మరో మద్యం వ్యాపారి, సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత ఎవరి వంతు వస్తుందన్న సస్పెన్స్..సాగుతోంది.
అదలా ఉంటే నేషనల్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన లింకులు కూడా తెలంగాణలో బయట పడ్డాయి. ఈ కేసులో కొందరు కాంగ్రెస్ నాయకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకుదు మల్లి కార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నాయకులను విచారించిన, ఈడీ,. ఇప్పడు నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాళాలు ఇచ్చిన వారికీ నోటిసులు ఇచ్చింది.
అయితే, వీరికి కుంభకోణంతో సంబంధం వుందా, లేదా అనేది స్పష్టం కాకున్నా నోటీసులు అయితే అందాయి. విచారణకు తర్వత గానీ, అసలు విషయం తెలియదు. కాగా, నోటీసులు అందుకున్న వారికి కేసు పూర్వాపరాలు వివరించేందుకు, కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి రావాలని సూచించింది.ఈ క్రమంలో గురువారం( సెప్టెంబర్ 29) కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. కాగా, నోటీసులు అందుకున్నవారిలో, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, గాలి అనిల్‌కుమార్ ,కేంద్ర మాజీ మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఉన్నారని తెలుస్తోంది.
ఢిల్లీ లికర్ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులతో పాటుగా క్యాసినో కేసులో ఈడీ తెలంగాణ నాయకులను విచారించడం, రాజకీయ వర్గాల్లో సంచలనంగా, మారింది. ఈడీ చూపు ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, అనే ఆందోళన వ్యక్తమవుతోంది.రాజకీయ నేతల్లో భయం తొంగి చూస్తోంది.