ఓటమి ఓ గుణపాఠమే!

ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలు అన్నీ మొదలుపెట్టే పనిలో గెలవాలనే చేస్తారు. ఆ ప్రయత్నాలలో ఎప్పుడూ విజయాలే కాదు ఓటమిలు కూడా ఎదురవుతాయి. మనం విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు

ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాలి. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను ఎప్పుడూ మరచిపోకూడదు. 

ఓటమి అనేది మనం విజయాన్ని ఎలా సాధించాలో తెలియజేస్తుంది. అంటే ఓటమితో దాగున్న గొప్ప గుణం అనుభవం. అనుభవం ఎదురైనప్పుడు మనం చేస్తున్న తప్పేమిటో చాలా తొందరగా అర్థమైపోతుంది. చాలామంది వారు చేసే పనులలో ఓటమి ఎదురయినప్పుడు ఓటమికి భయపడి ఆ పనిని చివరివరకు పూర్తిచేయకుండా వారు అనుకున్నది సాధించలేక వారి ఆశలను నిరాశలను చేసుకుంటున్నారు. చివరివరకు పనిని పూర్తిచేయడం అంటే ఓటమి ఎదురవ్వగానే ఇక ప్రయత్నం ఆపేయడం. అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. విఫలం అయిన ప్రతిసారి చేసిన తప్పేంటో అర్థం చేసుకుని అది తిరిగి పునరావృతం కాకుండా ముందడుగు వేయాలి. ఓటమి ఎదురయితే కృంగిపోకూడదు. అలాచేస్తే అది మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళుతుంది. ఆ డిప్రెషన్ వల్ల మనుషులకు కొన్నిరకాల చెడు వ్యసనాలు అలవాటు అవుతాయి. మనుషులు డిప్రెషన్ కి లోనైనప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు నచ్చిన వ్యక్తులను కలవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే నిరాశానిస్పృహల నుండి తొందరగా బయటపడవచ్చు. 

అసలు ఓటమి అంటే ఓడిపోవడమా??

కానే కాదు!! ఓటమి అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. గెలుపు ఇంకా అందుకోలేదని అర్ధం, గెలుపుకు తగిన సన్నద్ధత ఇంకా రాలేదని అర్థం. ఓటమి అంటే భయంతో అసలు పనిచేయకపోవడం కాదు. ఆ పని మరొక విధంగా చేస్తే బావుంటుందేమోనని ప్రయత్నించటం. కొన్నిసార్లు చేసే పనుల వల్ల  కూడా వైఫల్యాలు ఎదురవుతాయి. 

 పరాజయం అనేది ఉందా??

చాలామంది పరాజయాన్ని నిర్వచిస్తారు. గెలవలేకపోతే ఇక పరాజయం పాలైనట్టు చెబుతారు. కానీ అన్నీ మనం చేసే పనులకు వచ్చే ఫలితాలు మాత్రమే. మనం నిర్వహించే పని సరైనది అయినప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనం అనుకున్న ఫలితాలు సరిగారానప్పుడు చేసేపనిలో, పద్దతిలో మార్పు తీసుకురావడం ద్వారా కోరుకున్న ఫలితాలు వచ్చేంతవరకూ మార్పులు తీసుకువస్తూ ఉండాలి. అందువల్ల ఫలితాలే తప్ప పరాజయాలు లేవు. వచ్చే ఫలితాలు ఆశించినవి కాకపోవచ్చు కానీ అసలు పలితం అంటూ లేకుండా లేదు కదా!!

సముద్రంలో ప్రయాణం చేసే ఓడ తుఫానుని ఎదుర్కొనవలసి వస్తుందని భయపడి హర్భర్ లోనే ఉంచితే అది తుప్పుపడుతుంది. అప్పుడు ఓడను నిర్మించిన లక్ష్యం నెరవేరదు. ఓడను హార్బర్ లో పెట్టడానికి ఎవరూ తయారుచేయరు కదా!! దాన్ని తయారుచేయించుకున్న వ్యక్తి సముద్రంలో తిప్పుతూ డబ్బు సంపాదించాలని మాత్రమే కాదు, అది సముద్రంలో సమస్యకు లోనయ్యి నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగానే ఉంటాడు. అలాగే గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసేవాడు గెలుపుమీద ఆశతో ఉండాలి అలాగే ఓటమి ఎదురైతే దాన్ని స్వీకరించే మనసు కూడా ఉండాలి. 

 ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు. గెలవాలనుకొనేవారు అవకాశాలకోసం ఎదురు చూస్తారు. ఓటమి పొందటం నేరం కాదు. ఓటమికి అసలు కారణాలు తెలుసుకోలేకపోవటం అతిపెద్ద నేరం. ఓటమికి గల అసలు కారణాలు తెలుసుకోగలిగితే మనం సగం విజయాన్ని సాధించినట్లే. ఓటమి, విజయం ఈ రెండూ కూడా మన వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటాయి.

వ్యక్తిత్వపరంగా వ్యక్తిలోని లోపాలే వారికి విజయాన్ని దక్కకుండా చేస్తాయి. మన ఆలోచనలు, అలవాట్లు, చర్యలు, మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. మన లోపాలను సరిదిద్దుకుని మంచి నడవడికను మనదిగా చేసుకుంటే స్థిరమైన వ్యక్తిత్వం సొంతమవుతుంది. ఓటమి భయంతో నిర్ణయాలు తీసుకోకపోవటం తప్పు, ఓటమి రావటం తప్పుకాదు. కానీ ఆ ఓటమిని తలచుకుంటూ, కుమిలిపోతూ జీవిస్తూ, ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకపోవటం మరింత తప్పు.

                                        ◆నిశ్శబ్ద.

Teluguone gnews banner

అపరాధ భావం లేకుండా ఇతరులకు "నో" చెప్పాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే..!

  నేటి బిజీ జీవితాల్లో అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం వల్ల మనల్ని మనం కోల్పోవడం, మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడం తగ్గుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు చాలామంది  నో చెప్పాలనుకుంటారు. కానీ చివరికి సరే అని చెబుతుంటారు. నో చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఒకటైతే.. మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అనే మంచితనం కూడా ఇలా సరే అని చెప్పడానికి కారణం అవుతుంది.  కానీ ఇలా సరే అని చెప్పిన తరువాత చాలామంది ఆ పని పూర్తీ చేయడంలో చాలా అలసిపోతారు,  తమ మీద తాము చిరాకు పడతారు, నేనెప్పుడూ ఇంతే ఇలా తప్పు  చేస్తుంటాను అని అసంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ సరిహద్దులు నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. సరిహద్దులు నిర్ణయించుకోవడం అంటే ఇతరులను దూరం పెట్టడం లేదా దూరం చేసుకోవడం అస్సలు కాదు.. తమను తాము గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవించేలా చేసేది ఇలా సరిహద్దులు నిర్ణయించుకోవడమే..  సరిగ్గా సరిహద్దులను నిర్ణయించినప్పుడు సంబంధాలు బలపడతాయి. అపరాధ భావన  లేదా తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా ఎవరికైనా నో చెప్పాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.. దేని వల్ల ఎక్కువ అలసిపోతున్నాం, చిరాకు వడుతున్నాం,  ఒత్తిడి గురవుతున్నాం అనే విషయాలు ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఏది ముఖ్యం,  ఏది ముఖ్యం కాదు.. అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు.  ఇది ఎవరికైనా ఏ విషయానికి నో చెప్పాలి,  దేనికి చెప్పకూడదు  అని నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు దాని విషయంలో పరిమితులు,  సామర్థ్యం మొదలైనవి మొహమాటం లేకుండా చెప్పాలి.  షో-ఆఫ్ చేయడానికి చాలామంది తమ గురించి కొండంత చెప్పుకుని తరువాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే తమ గురించి తాము ఎక్కువ చెప్పుకోకూడదు. ఇలా చేస్తే ఇండైరెక్ట్ గా నో చెప్పినట్టు అవుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు ఆ పని చేసే సామర్థ్యం లేదా సమయం లేనప్పుడు అదే విషయాన్ని చెప్పాలి.  అంతేకానీ ఎదుటివారికి అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఇది అపార్థాలకు,  తగాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా దేని గురించి అయినా కారణాలు చెప్పే బదులు,  తాము ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం వంటివి వివరించి చెప్పాలి.  ఇది ఎదుటి వ్యక్తిని బాధపడకుండా ఉంచుతుంది. ఎదుటివారు సరిహద్దులను మరచిపోయి అన్ని విషయాలను, పనులను సహాయం అడుగుతుంటే.. అలాంటి వారికి సున్నితంగానే సరిహద్దును గుర్తు చేయాలి.  సాధ్యమైనంత వరకే సమయాన్ని ఇవ్వాలి కానీ ఇతరుల కోసమే పూర్తీ సమయాన్ని వెచ్చించకూడదు. ఎదుటివారి దృష్టిలో ఎప్పుడూ తటస్థంగానే ఉండాలి.  అంచనాలు పెరుగుతూ ఉంటే వారి దృష్టిలో ఆశించడం కూడా పెరుగుతుంది. ఎవరి అవసరాలు వారికి ముఖ్యమని ఎదుటివారికి అర్థమయ్యేలా చేస్తుండాలి. ఇలా ఉంటే ఎదుటివారు కూడా ఏ విషయం అడగాలి, ఏది అడగకూడదు  అనే విషయం అర్థం చేసుకోగలుగుతారు. సొంత పనులు వదులుకుని మరీ ఇతరుల కోసం పాకులాడకూడదు.  ఎవరికోసం ఖర్చయ్యే సమయం అయినా సరే.. ఎన్ని కారణాలు చూపించినా  ఒక్క సెకెను కూడా తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి సొంత పనుల తర్వాతే ఇతరుల పనులు చేసివ్వాలి.  ఇది స్వార్థం అని చాలామంది అనుకుంటారు. కానీ మనం బాగుంటేనే.. ఇతరుల కోసం మనం చేసే పనులకు గౌరవం ఉంటుంది.                                  *రూపశ్రీ

అందరూ మిమ్మల్ని గౌరవించాలంటే ఈ 5 నియమాలు పాటించాల్సిందే..!

  ప్రతి వ్యక్తి గౌరవంగా ఉండాలని అనుకంటాడు.  తను ఎక్కడ ఉంటే అక్కడ తనకు గౌరవం లభిస్తుంది అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఉన్నట్టే లెక్క.  కానీ చాలా మంది వ్యక్తిత్వ పరంగా సరిగా లేకుండా.. నలుగురు గౌరవం ఇవ్వడం లేదని వాపోతుంటారు.  అయితే అందరూ గౌరవం ఇవ్వాలంటే ప్రతి వ్యక్తి కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తే అందరూ ఆటోమేటిక్ గా గౌరవం ఇస్తారు.  నలుగురిలో ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూ వ్యక్తిని హుందాగా ఉంచే ఆ 5 నియమాలు ఏంటో తెలుసుకుంటే.. పిలుపు.. ఎవరిని అయినా, దేనికైనా పిలవడం లేదా పలకరించడం చాలా కామన్.  ఏదేనా పని కోసం కావచ్చు,  సహాయం కోసం కావచ్చు.  ఎవరిని అయినా సరే.. రెండు కంటే ఎక్కువ సార్లు పిలవకూడదు.  పదే పదే ఎక్కువ సార్లు పిలవడం వల్ల వ్యక్తుల దృష్టిలో చిన్నతనంగా మారతాము.  దీని వల్ల వ్యక్తిత్వం కూడా పలుచబడుతుంది.  సమయం కేటాయించగలిగే వారు లేదా తోడుగా ఉండగలం అనుకునేవారు అయితే ఎక్కువ సార్లు అడిగించుకోకుండానే వచ్చేస్తారు. కానీ రాలేదంటే.. వారు ఏదైనా సమస్యలో ఉండాలి, లేదంటే వారికి వచ్చే ఉద్దేశం లేక రాకపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ దేనికోసం ఎక్కువసార్లు పిలవకూడదు. సలహాలు, సూచనలు.. కొందరికి అత్యుత్సాహం ఉంటుంది.  పక్కన ఉన్నవారు అయినా తెలిసిన వారు అయినా స్నేహితులు అయినా, కుటుంబ సభ్యులు అయినా.. ఇలా ఎవరైనా సరే.. వారు ఏదైనా ఇబ్బంది లేదా సమస్యలో ఉన్నట్టు కనిపిస్తే ఊరికే ఉండలేరు.  తమ తెలివి తేటలు ఉపయోగించి ఏదో ఒక సలహా లేదా సూచన ఇస్తూనే ఉంటారు. ఎదుటివారు తాము చెప్పింది యాక్సెప్ట్ చేసేవరకు ఏదో ఒకటి చెప్పడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఎదుటివారి దృష్టిలో గౌరవం ఉండదు.  అందుకే ఎదుటివారు తమకు తాము అడిగేవరకు ఎవరికీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. వినడం.. ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు వినాలంటే చాలామంది చాలా బోర్ ఫీలవుతారు. అదొక టైం వేస్ట్ పని అన్నట్టు ఫీలయ్యేవారు, ఎదుటివారు చెప్పింది వినడం పెద్ద తలనొప్పి అనుకునేవారు ఎక్కువ. కానీ ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు శ్రద్దగా వెంటే వారు చెప్పే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల వారికి తిరిగి సమాధానం చెప్పాలంటే ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం ఉండదు.  అందుకే ఎక్కువ వినాలి,  తక్కువ మాట్లాడాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్లానింగ్స్.. ఏదైనా పని చేయడానికి ప్లానింగ్ గా ఉండటం చాలామంది కామన్ గా చేసేపని.  అయితే ప్లానింగ్ అనుకోగానే దాన్ని అందరికీ వివరించి చెప్పడం,  ఆ పని తర్వాత ఏం జరుగుతుంది,  దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి.. మొదలైన విషయాలన్నీ చాలామంది పూస గుచ్చినట్టు వివరించి చెప్పేస్తుంటారు.  దీనివల్ల అనుకున్న పనులు జరగకపోయినా,  అసలు పనులు మొదలు పెట్టలేకపోయినా చాలా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చేయబోయే పనుల గురించి ఎవరికీ చెప్పకూడదు.  పనులు పూర్తయ్యే దాక ఎవరికీ చెప్పకూడదు. సంతోషం.. సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారు కూడా ఉంటారు.  అందుకే చాలామంది తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండటం కోసం చాలా సతమతం అవుతుంటారు. ఈ క్రమంలో తమ ప్రాధాన్యతలు కోల్పోవడం, తమ పనులు మానుకోవడం వంటివి కూడా చేస్తారు. కానీ అందరినీ సంతోషంగా ఉంచడం అసాధ్యం  అనే విషయాన్ని గ్రహించాలి.  అందరినీ సంతోషంగా ఉంచడం ఒక్కరి పనే కాదని,  ఎవరి సంతోషాన్ని వారు నిలబెట్టుకోవాలని తెలుసుకోవాలి.  ఇలా ఉంటే అందరూ గౌరవిస్తారు.                                              *రూపశ్రీ.

ట్రోఫీ వైఫ్.. పెళ్లైన ఆడవాళ్లలో చాలామంది పరిస్థితి ఇదే.. మీరూ ఇంతేనా..!

  ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం  చాలా అపురూపమైనది.  వేర్వేరు ప్రాంతాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో కలిసి జీవించడం,  ఎలాంటి పరిస్థితులు  ఎదురైనా ఒకరికి ఒకరు తోడుండటం ఈ బంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.  అయితే భార్యాభర్తల బంధంలో తమదే పై  చేయి ఉండాలనే పిచ్చి ఆలోచన చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మగవారు భార్యల విషయంలో ఆధిపత్య ప్రవర్తన కలిగి ఉంటారు.  ఈ వివాహ బంధంలో చాలామంది ఆడవారు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదే ట్రోఫీ వైఫ్.. అసలు ట్రోఫీ వైఫ్  అంటే  ఏంటి? ఇలాంటి పరిస్థితిలో ఎక్కువమంది భార్యలు ఎందుకు ఉన్నారు? ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పడానికి భార్యాభర్తల మధ్య  ఉండే పరిస్థితులు ఏంటి? తెలుసుకుంటే.. ట్రోఫీ భార్య అంటే.. ట్రోఫీ భార్య అంటే.. భర్త కేవలం భార్య బాహ్య రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. అతని దృష్టిలో భార్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.  మూడు ముళ్లు వేసి పెళ్లి పేరుతో తన ఇంటికి తీసుకుని వచ్చి భార్యను కేవలం తన అవసరానికి వాడుకోవడం చేస్తుంటాడు.  ఇలాంటి పరిస్థితిలో ఉన్న బార్యలు అందరూ ట్రోఫీ భార్యలే.  ట్రోఫీ భార్యల పరిస్థితులు.. భార్యాభర్తల బంధంలో ఏ నిర్ణయం తీసుకున్నా భార్యాభర్తలు ఇరువురూ కలిసి తీసుకోవాలి అనుకుంటారు.  భర్త అయినా, భార్య అయినా తమ పార్ట్నర్ తమను కూడా అబిప్రాయం అడగాలని అనుకుంటారు. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం ఇలాంటి ప్రాధాన్యతకు నోచుకోరు.  భర్త ఏ నిర్ణయం తీసుకున్నా తన సొంతంగా తీసుకుంటాడు.  భార్య అభిప్రాయంతో కానీ,  భార్య  ఆలోచనలతో కానీ అతనికి ఆసక్తి ఉండదు. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉండాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా భర్త చూపించే ప్రేమ భార్యకు ఎంతో ముఖ్యం. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం భర్త ప్రేమకు నోచుకోరు. భర్తలు ఒక వేళ ప్రేమ చూపించినా అదంతా షో-ఆఫ్ కే.. అంటే నలుగురు చూడాలని, తనను మంచి భర్తగా ట్యాగ్ వేయాలనే కోరికతో  నలుగురిలో భార్యల పట్ల ప్రేమ చూపిస్తుంటారు. భార్యాభర్తలు అంటే.. ఒకరి వల్ల మరొకరు సంతోషంగా ఉండాలి. కానీ కొందరు మాత్రం తమ సంతోషాన్ని మరచి ఇతరులకు బాగా కనిపించాలని, ఇతరుల దృష్టిలో ఏది సరైనది అయితే.. అలాగే తాము ఉండాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉండే భార్యలు అందరూ ట్రోఫీ భార్యలే. భర్త ఎప్పుడూ భార్యను అన్ని విషయాలలో నియంత్రణ చేస్తుంటే.. ఆ బార్య ట్రోఫీ భార్య అని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏ దుస్తులు ధరించాలి? ఇలా ప్రతి విషయంలో భర్త జోక్యం చేసుకుంటూ ఉంటారు. భార్య ఎమోషన్స్ ను ఎప్పుడూ పట్టించుకోకుండా కేవలం తనకు నచ్చినది జరగాలని భర్త డిమాండ్ చేస్తుంటే ఆ  భార్య ట్రోఫీ వైఫ్ అని అర్థమట. వివాహం అయిన తరువాత ఆడపిల్లను కేవలం తనకు భార్య  అనే కోణంలో మాత్రమే చూస్తూ ఆమెకంటూ ఎలాంటి వ్యక్తిగత జీవితం,  స్పేస్ లేకుండా చేస్తుంటారు కొందరు భర్తలు.  ఇలా తమను తాము కోల్పోయే భార్యలు అందరూ ట్రోఫీ వైప్ లు.                                 *రూపశ్రీ.

విజయం సాధించాలంటే ఈ విషయాలను గుర్తంచుకోవాలి..!

మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాలను నేటికీ మనం మన పెద్దలు లేదా తెలిసిన వారి నుండి వినవచ్చు. భగవద్గీత యొక్క ఈ జ్ఞానం నేటి ఆధునిక యుగంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఈ బోధనలను తెలుసుకుని, వాటిని తెలివిగా అనుసరించి, వాటిని మీ జీవితంలో చేర్చుకుంటే, మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. భగవద్గీతలో జీవిత సారాంశం ఉందని మన పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఐతే భగవద్గీతలో మనిషి ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పారు..? మీ కోపాన్ని నియంత్రించుకోండి: కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది, గందరగోళం తెలివిని పాడు చేస్తుంది, బుద్ధి చెడిపోతే, తర్కం నాశనం అవుతుంది, తర్కం నాశనం అయినప్పుడు, వ్యక్తి నాశనం అవుతాడు. అందువల్ల అతను తన అన్ని పనులలో వైఫల్యాన్ని ఎదుర్కొంటాడు. అదే వీక్షణ: జ్ఞానాన్ని,  చర్యను ఒకటిగా చూసే వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎవరైతే జ్ఞాని అయినా లేదా అతను జ్ఞానవంతుడు అయినా, అతని అభిప్రాయం కూడా సరైనదే. ఏ సమస్యను ఏ కోణంలో చూడాలో ఆయనకు అవగాహన ఉంది. మానసిక నియంత్రణ: మన మనస్సు ఎప్పుడూ మన అదుపులో ఉండాలి. మన మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే అన్ని కార్యాలలో విజయం సాధించగలుగుతాము. మనసును అదుపులో పెట్టుకోని వారికి మనస్సే శత్రువులా ప్రవర్తిస్తుంది. స్వపరీక్ష: పురోగతి సాధించడానికి స్వీయ మూల్యాంకనం చాలా ముఖ్యం. మనం చేస్తున్న పని, ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం అన్నీ సరైనవేనా.? లేక తప్పా? దాని గురించి ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో మన హృదయాల్లోని అజ్ఞానపు సందేహాలను తొలగించి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకుంటే, మీరు తప్పకుండా అందులో పురోగతి సాధిస్తారు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది: ఈ జీవితంలో మనం ఏమీ కోల్పోలేదు లేదా వృధా చేయలేదు. మీరు ఏమి చేసినా, దాని నుండి మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీ జీవితాన్ని మార్చడానికి మీకు సహాయం చేస్తుంది. సాధన తప్పనిసరి: మనస్సు చంచలంగా ఉంటే లేదా మీ మనస్సును నియంత్రించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు మంచి అలవాట్ల ద్వారా దానిని నియంత్రించవచ్చు. మీ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడే మీ చర్యలు, మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి: మనిషి తాను సాధించాలనుకున్నది ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలడు. ఏ పని చేసినా అందులో నమ్మకం ఉంటేనే చేయాలి. ఇలా చేయండి: క్రియలో నిష్క్రియతను,  నిష్క్రియంలో చర్యను చూసేవాడు తెలివైనవాడు. ఈ వ్యక్తులు తాము చేసే పనిలో ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే సంతృప్తిని అనుభవిస్తారు.

ఇంట్రోవర్ట్ లను తక్కువ అంచనా వేయకండి.. వీళ్ల గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.

మనిషిలో మరొక అంతర కోణం!

హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.

సుఖమా! సంతోషమా!

అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు.  ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు. ‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి.  ‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు. యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!

మీక్కూడా ఆఫీసులో చిరాకు పెరుగుతుందా? ఇలా జరగచ్చు జాగ్రత్త..!

  జీవితంలో ప్రతి ఒక్కరికీ నిర్వర్తించే వృత్తి చాలా కీలకమైనది.  జీవితం గడవడానికి ఆ వృత్తే సంపాదనను అందిస్తుంది. ప్రతి వ్యక్తి రోజులో సింహభాగం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలోనే గడుస్తుంది.  అయితే ఆఫీసులో ఒత్తిడి,  చిరాకు వంటి సaమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి.  వీటిని కొందరు తేలికగా తీసుకుని చాలా ఈజీగా డీల్ చేస్తే.. మరికొందరు ఒత్తిడి,  చిరాకు వంటి విషయాలకు చాలా అతిగా రియాక్ట్ అవుతుంటారు. ఇలా ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి కలగడం వల్ల ఉద్యోగులకు మనోబలం తగ్గుతుంది. ఆఫీసులలో చాలా అనుకువగా పనిచేసే ఉద్యోగులు,  పై అధికారులు ఎక్కువగా అధిపత్యం చెలాయించే ఉద్యోగులు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఆఫీసులో ఉద్యోగపరంగా ఆసక్తి కోల్పోతుంటారు.  ఈ ఆసక్తి తగ్గడం కారణంగా ఉద్యోగుల పని నాణ్యత,  వారి పని చేసే తీరు మారిపోతుంది. సాధారణంగా చేసే పనిని నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుని పని చేస్తుంటారు. నిరుత్సాహం వల్ల తమ పని మీద ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతుంటారు.   ఉద్యోగస్థులు తమ పని మీద నిర్లక్ష్యంగా ఉండటం,  వారి పనిలో ప్రతి కూల ప్రభావం పడటం వంటివి జరగడం వల్ల వారు ఉత్తమ ఉద్యోగులు అనే ట్యాగ్ ను కోల్పోతారు. ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటే అక్కడ సరైన వాతావరణం,  ఉద్యోగులను ట్రీట్ చేస్తున్న తీరు సరిగా లేదని అర్థం.  దీని వల్ల ఉద్యోగులు పని  చేస్తున్న చోటు నుండి వెళ్లిపోయే ఆలోచనలో ఉంటారు.  ఇది సంస్థలకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది. ఆఫీసులో ఎదురయ్యే చిరాకులు,  ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో తప్పుగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  దీని వల్ల పని చేసే వాతావరణం  అనారోగ్యకరంగా మారుతుంది. చాలా కాలం పాటు ఉద్యోగుల మద్య గొడవలు,  నిరాశ,   ఒత్తిడి, చిరాకు వంటివి కొనసాగుతుంటే..  అవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగులలో కోపం,  రక్తపోటు సమస్యలు,  మధుమేహం వంటివి కూడా ఇలాంటి సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కంపెనీలు ఉద్యోగులను పని యంత్రాలుగా చూస్తుంటాయి.  అలాంటి చోట్ల ఉద్యోగస్థులు చాలా ఎక్కువ వైఫల్యం అవుతుంటారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగస్థుల మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. కంపెనీలు ఉద్యోగుల మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే కార్యాకలాపాలను కూడా చేపడుతుండాలి. అపుడే ఉద్యోగస్థులు మానసికంగా బలంగా ఉండి సంస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా చేయగలుగుతారు.                                       *రూపశ్రీ

భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం ఉంటే  పర్యవసానాలు ఇవే..!

దాంపత్య జీవితం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక పవిత్ర బంధం. ఇది శరీర సంబంధం మాత్రమే కాదు..  ప్రేమ, నమ్మకం, కమ్యునికేషన్,  బాధ్యత, గౌరవం అనే ఐదు స్థంభాల మీద నిలబడే సంబంధం. చాలావరకు భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో భార్యాభర్తల గొడవ, సమస్య మూడవ వ్యక్తికి చెప్పడం వల్ల.. ఆ మూడవ వ్యక్తి భార్యాభర్తలను కూర్చోబెట్టి, వారి మధ్య అపార్థాలు తొలగిస్తారు అని అంటుంటారు. కానీ చాలామంది మాత్రం మూడవ వ్యక్తి జోక్యం వల్ల భార్యాభర్తల బంధం విచ్ఛిన్నం అవుతుంది అంటుంటారు.  భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి.. కలిగే పర్యవసానాలు గురించి తెలుసుకుంటే..  “మూడవ వ్యక్తి జోక్యం” అంటే.. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలలో, ఎమోషన్ పరిస్థితులలో, నిర్ణయాలలో, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు లేదా ఎవరైనా ఇతర వ్యక్తి ప్రభావం చూపించడం. అలాంటి వ్యక్తులనే థర్డ్ పర్సన్ అని అంటారు. ఈ “మూడవ వ్యక్తి” ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఉండకపోవచ్చు. కానీ సమస్య ఏమిటంటే, ఆ మూడవ వ్యక్తి దంపతుల మధ్య ఉన్న నిజమైన అభిప్రాయాలు, ఆలోచనలు, పరిస్థితులు, అనుభవాలను అర్థం చేసుకోలేరు. దాంతో వాదన పెద్దదవుతుంది, అనుమానం పెరుగుతుంది, ప్రేమ తగ్గుతుంది. మూడవ వ్యక్తి జోక్యం ఉంటే ఏమవుతుంది? భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం పాయిజన్ లా పనిచేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే..  నమ్మకం దెబ్బతింటుంది.. భార్యకు లేదా భర్తకు “వారి మాట వినడం కంటే బయట వాళ్ల మాట ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు” అన్న భావన వస్తుంది. ఇది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రైవసీ ఉండదు..  దంపతుల మధ్య జరిగిన విషయాలు మూడవ వ్యక్తి వద్దకి వెళ్లడం వల్ల “ప్రైవసీ” కోల్పోతుంది. అది తర్వాత చాలా దారుణంగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోవడం, చర్చించడం, తప్పుగా అర్థం చేసుకోవడం వంటి  సమస్యలను పదే పదే తెస్తుంది. నిర్ణయాలు దెబ్బతింటాయి.. మూడవ వ్యక్తి అభిప్రాయం విని తీసుకున్న నిర్ణయాలు చాలా సార్లు అసలైన పరిస్థితికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే మూడవ వ్యక్తికి ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య, పరిస్థితి 100% అర్థం కాదు.  ఎదురు వ్యక్తులు వారి అనుభవాల పరంగా నిర్ణయాలు చెబుతారు.  కోపం, అసహనం, దూరం పెరుగుతాయి.. ప్రతి వాదనలో “వాళ్లు అలా చెప్పారు” అనే పదం వస్తే, దంపతుల మధ్య దూరం పెరుగుతుంది.  అది క్రమంగా బంధం చేదిపోవడానికి సారి తీస్తుంది.   బ్రేకప్ అయ్యే ప్రమాదం.. మూడవ వ్యక్తి ఎక్కువగా  జోక్యం చేసుకోవడం వల్ల ఒక దశలో నమ్మకం పూర్తిగా పోతుంది. ఇది విడాకులకు కూడా దారి తీస్తుంది. *రూపశ్రీ.

తోబుట్టువుల మధ్య బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు ఇవే..!

  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.