మాజీగానే మహోపకారం.. ఈటలకు జైకొడుతున్న హుజురాబాద్ జనం
posted on Aug 16, 2021 @ 9:35AM
మాజీ మంత్రి, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రిగా ఎమ్మెల్యేగా నియోజక వర్గం ప్రజలకు ఏమి మేలు చేశారో, ఏమి మేలు చేయలేదో కానీ, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మాజీగా మారిన తర్వాత మాత్రం, నియోజకవర్గ పజలకు మహోపకారమే చేశారు. నిజానికి, ఒక్క హుజూరాబాద్ నియోజక వర్గం ప్రజలకే కాదు యావత్ తెలంగాణ ప్రజానీకానికి, మాజీ మంత్రి ఈటల మంచి మేలు చేశారు.
ఈటల రాజీనామాకు ముందు, రేషన్ కార్డు కావాలంటే అధికారుల కాళ్ళావేళ్ళా పడ్డా ప్రయోజనం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అధికారులే ఇంటికి వచ్చి దండం పెట్టి మరీ రేషన్ కార్డు ఇచ్చి పోతున్నారు. ఈటల రాజీనామాకు ముందు గతుకుల రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ మరమ్మతులు అడిగినా, పట్టిచుకున్ననాధుడు లేడు. ఇప్పుడు అధికారులు ఊరూరు తిరిగి మరీ రోడ్ల మరమ్మతులు కాదు, కొత్త రోడ్లే వేస్తున్నారు. వద్దన్నా నిధులు వరదలా వచ్చి పడుతున్నాయి. ఇరుగు పొరుగు నియోజక వర్గాలే కాదు, రాష్ట్రంలోని మిగిలిన నియోజక వర్గాల్లో ఆ ‘మూడు’ మినహా మిగిలిన అన్ని నియోజక వర్గాల పజలు ఈర్ష పడేలా పనులు చకచకా జరిగిపోతున్నాయి. డ్వాక్రా మహిళలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సబ్సిడీలు ఇప్పుడు అడగకుండానే మంజూరవుతున్నాయి.ఇంతవరకు 65 ఏళ్లుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్ వయసు ఉప ఎన్నిక దెబ్బకు 57 ఏళ్ల దిగివచ్చింది.
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, వీటన్నిటినీ మించిన, అల్లా ఉద్దీన్ అద్భుత దీపం, దళిత బంధు. ఈటల రాజేందర్’ను ఓడించడమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న ముఖ్యమంత్రి మేథస్సు నుంచి పుట్టిన, మానస పుత్రిక దళిత బంధు, ఒక్కటీ ఒకెత్తు. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు చేతుల్లో పెట్టే మహాద్భుత పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతే కాదు, ఈ పథకాన్ని, హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే తీసుకొచ్చామని, ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు.సో ... ‘మాజీ’ మంత్రి పుణ్యానే దళితుల బంధు పథకం వచ్చిందనేది, కాదనలేని నిజం. ఒక్క రాజేందర్ రాజీనామా చేయడం వలన ఇన్నిని ప్రయోజనాలు జరుగుతున్నాయి,కాబట్టే ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు డప్పులు మోగుతున్నాయి. మీరూ రాజీనామా చేయండి అన్న డిమాండ్ మోత మోగుతోంది.
అయితే ఈ పథకం వలన ముఖ్యమంత్రి ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా ? ఈటల రాజేందర్’ను ఓడించాలన్న అయన కల నిమవుతుందా? అంటే, అదెలా ఉన్నా, ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఆమలు చేయలేక పోతే మొదటికే మోసం తప్పదని మాత్రం అధికార పార్టీ ముఖ్య నేతలే హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా ఈటలను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా ముఖ్యమంత్రి, పులి మీద స్వారీకి సిద్ధమయ్యారని, కొంచెం అటూ ఇటూ అయినా, హుజురాబాద్’లో గెలిచినా రాష్ట్రంలో భారీ రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని, హెచ్చరిస్తున్నారు. ఈ పథకం వల్ల హుజూరాబాద్‌లో ఓట్ల వర్షం కురుస్తుందని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రుల్లో మాత్రం అది గుబులు పుట్టిస్తోంది.మాజీ ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు కడియం శ్రీహరి మర్మగర్భంగా వ్యక్తపరిచిన ఆందోళన కూడా అదే సూచిస్తోంది. మంత్రులు సైతం, ప్రైవేటు సంభాషణల్లో ఈ పథకం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళనలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆహా ఓహో అన్నా, ఇప్పటికే అనేక ఇతర వర్గాల నుంచి కుల బంధు కోసం వస్తున్న వత్తిళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు దళిత బంధు కొంప ముంచుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు సంభాషణల్లో ఈ పథకం వల్ల అనర్థం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.
ఉప ఎన్నిక తేదీ ఆలస్యం అయ్యేకొద్దీ, ఈటల పట్ల సానుభూతి తగ్గుతుందని,ఆ విధంగా అధికార తెరాసకు ప్రయోజనం చేకూరుతుందని అనుకున్నా, ఇప్పుడు కాలం గడిచే కొద్దీ దళిత బంధు గుదిబండగా మారుతుందని అంటున్నారు. అయితే, కేసీఆర్ ను తక్కువగా అంచనా వేయడం సరికాదు. ఏదైనా చేయగల ఘటనా ఘటన సమర్ధుడు. సో.. హుజూరాబాద్ ఏమి చేస్తుంది? దళిత బంధు ఏమవుతుంది? ఏమి చేస్తుంది? అనే విషయంలో ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం అంత క్షేమకరం కాదు.