వైకాపాలో చేరక ముందే దాడికి సెగ
posted on May 3, 2013 @ 8:11PM
తెలుగుదేశం పార్టీలో కొందరు తనని పార్టీ నుండి బయటకి పంపేందుకు పొగ పెడుతున్నారని కుంటి సాకులు చెప్పి నిన్న పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరేందుకు ముందే రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ రోజు కానీ, సోమవారం గానీ చంచల్ గూడా జైలుకు వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకోవాలనుకొంటున్నట్లు ఆయన ఈ రోజే ప్రకటించారు. అయితే, ఆయన జైల్లోకి ప్రవేశించక మునుపే లోపలి నుండి అనకాపల్లి నియోజక వర్గానికి చెందిన వైకాపా నేతలు పొగపెట్టడం మొదలుపెట్టేసారు.
అనకాపల్లికే చెందిన దాడి వీరభద్రరావుకి, కొణతాల రామకృష్ణ కుటుంబాలకి మద్య గత రెండు దశాబ్దాలు రాజకీయ వైరం ఉంది. తొలుత కొణతాల కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు, దాడి వీరభద్రరావు ఆయనకు రాజకీయ ప్రత్యర్ధిగా నిలిచి పెనుసవాలు విసిరేరు. కానీ, ఇప్పుడు ఆ రాజకీయ ప్రత్యర్దులిరువురూ భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు వైకాపాలో వచ్చిపడ్డారు.
దాడి వీరభద్రరావు రానంత వరకు అనకాపల్లికి సంబందించినంత వరకు వైకాపాలో కొణతాల రామకృష్ణదే పైచేయి. కానీ, ఇప్పుడు దాడి ప్రవేశంతో, ఆయన సీటుకే ఎసరు వచ్చేలా ఉంది. దాడితో బాటు ఆయన కుమారుడు రత్నాకర్ కూడా తరలి వస్తుండటంతో ఆ ఇబ్బంది రెట్టింపయింది. ఈసారి కొణతాల సోదరుడు పెదబాబు అనకాపల్లి శాసన సభకు, రామకృష్ణ లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు వారిరువురికీ పోటీగా దాడి వీరభద్ర రావు మరియు ఆయన కుమారుడు పోటీకి వస్తున్నారు.
దాడి&సన్స్ వైకాపాలో చేరేందుకు ప్రప్రధమ షరతు అనకాపల్లి నియోజక వర్గం సీట్లు కేటాయింపే! గనుక, సహజంగానే కొణతాల సోదరులకు అది ఆందోళన కలిగించే విషయమే అవుతుంది. కొణతాల కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. అటువంటి తమని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన దాడి&సన్స్ కి టికెట్స్ ఇచ్చేందుకు జగన్ మాట ఇస్తాడేమోనని కొణతాల సోదరులిద్దరు చాలా ఆందోళన చెందుతున్నారు.
అయితే రామకృష్ణ ఇంకా బయటపడకపోయినా, ఆయన సోదరుడు పెదబాబు మాత్రం, “తనకు ఎంతో పలుకుబడి ఉందని భావిస్తున్న దాడి వీరభద్రరావుకి గత ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అటువంటి వ్యక్తి మా పార్టీలోకి వచ్చినందువల్ల పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు,” అంటూ బాంబు పేల్చారు. కానీ ఆయన సోదరుడు రామకృష్ణ మాత్రం దాడి వీరభద్రరావు పట్ల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆయన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా దానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
అయితే, ఇటువంటి పరిస్థితిలో ఏ రాజకీయ నాయకుడయినా సహజంగా అటువంటి ప్రకటనే చేస్తాడు. కానీ, పార్టీ టికెట్స్ పంపకం విషయం వచ్చేసరికి తనకు న్యాయం జరగక పోతే, ఇప్పుడు దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ మీద అలిగి 30సం.ల అనుబంధాన్ని పుటుకున తెంపుకు వచ్సుసినట్లే, కొణతాల సోదరులు కూడా అలిగి పార్టీ వీడి కాంగ్రెస్ గూటికే చేరినా చేరవచ్చును. అదే జరిగితే, అప్పుడు కొణతాల సోదరులు, దాడి వీరభద్ర రావు & సన్స్ కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో మళ్ళీ ప్రత్యర్దులుగా ఒకరినొకరు ఎదుర్కొంటారేమో!