కారు కొంప ముంచిన ఎల్ఆర్ఎస్! సీఎం హిట్ లిస్టులో సీఎస్ సోమేష్?
posted on Dec 5, 2020 @ 2:25PM
టీఆర్ఎస్ నేతలు భయపడినట్లే జరిగిందా? ధరణి వెబ్ సైటే కారుకు బ్రేకులు వేసిందా? లాండ్ రెగ్యులరైజేషన్ స్కీమే కమలానికి బూస్ట్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే స్పష్టమైందని తెలుస్తోంది. గ్రేటర్ ఫలితాలపై విశ్లేషించుకున్న టీఆర్ఎస్ నేతలు కూడా ఎల్ఆర్ఎస్, ధరిణి వెబ్ సైట్ అంశాలు ఓటింగులో తీవ్ర ప్రభావం చూపాయనే అంచనాకు వచ్చారట. గులాబీ బాస్ కేసీఆర్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. అందుకే ఆయన ధరణి వెబ్ సైట్, ఎల్ఆర్ఎస్ ప్రతిపాదన తెచ్చిన సీఎస్ సోమేష్ కుమార్ పై ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. సీనియర్లను కాదని నమ్మకంతో తెచ్చుకుంటే.. ప్రభుత్వానికి ప్రజల్లో చెడ పేరు రావడానికి కారణమయ్యారనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. సీఎస్ ను మార్చే అవకాశముందని కూడా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో కారు పార్టీ ఖాతానే తెరవలేదు. ఈ నియోజకవర్గాల పరిధిలోని 18 డివిజన్లలోనూ ఘోరంగా ఓడిపోయారు టీఆర్ఎస్ అభ్యర్థులు. ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమికి ఎల్ఆర్ఎసే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇక్కడ ఉండేవారంతా ఎల్ఆర్ఎస్ సమస్యను ఫేస్ చేసినవారేనంటున్నారు. శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం చేసే వారంతా ఎల్బీనగర్ ఏరియాలోనే ఉంటారు. ధరణి వెబ్ సైట్ కోసం రెండు, మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీంతో గతంలో జరిగిన ల్యాండ్ విక్రయాలు ఇబ్బందుల్లో పడ్డాయట. సర్కార్ స్పష్టించిన ఈ కొత్త సమస్యలతో వారంతా కేసీఆర్ పై కసిగా ఉన్నారంటున్నారు. అదంతా గ్రేటర్ ఫలితాల్లో కనిపించిందని చెబుతున్నారు.
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కామన్ ఫ్లాట్‌ఫాంగా ధరణిని రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఈ టాస్కును సీఎస్ చేపట్టారు. ఎల్ఆర్ఎస్ , ధరణి వెబ్ సైట్ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కు సీఎస్ సోమేష్ కుమారే చెప్పినట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా ఆదాయం పెరుగుతుందని, ధరణి ద్వారా దేశంలోనే ఆదర్శనీయంగా ఉండే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టవచ్చని సీఎస్ కల్పించిన విశ్వాసంతో సీఎం ముందడుగు వేశారని చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 20 వేల కోట్ల మేర అదనపు ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉందని సీఎంకు సీఎస్ సోమేష్ ప్రతిపాదించారని అంటున్నారు. అంతేకాదు ధరణి వెబ్‌సైట్ రూపకల్పన మొదలు ట్రయల్ రన్ వరకు అంతా సీఎసే చూసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయం వచ్చినా వెనక్కు తగ్గలేదు. ఎల్ఆర్ఎస్ ప్రకటించిన తర్వాత విపక్షాల నుంచే కాక ప్రజల నుంచి కూడా ఊహించని వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం ముందుకే పోయింది. ధరణి కోసం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది. ప్రజలు కూడా వివిధ అవసరాల కోసం ఆస్తుల్ని అమ్ముకోవడం, భూమిని వదులుకోవాల్సి రావడం లాంటి పనులకు బ్రేక్ పడింది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం అని భావించిన ధరణి కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పటికి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. ఇలా ఉండగానే ఎల్ఆర్ఎస్ తేవడంతో ప్రజలకు మరింత కష్టమైంది. కరోనా సమయంలో ఆదాయం తగ్గిపోవడంతో పొదుపు మంత్రం పాటిస్తున్న సమయంలో ఎల్ఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం ప్రజల అసహనానికి కారణమైంది. చివరకు అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసింది. దీంతో ధరణితో ఆశించిన ఫలితం రాకపోగా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. దీంతో ప్రధాన కార్యదర్శి ప్రతిపాదించిన ఎల్ఆర్ఎస్, ధరణి ప్రాజెక్టులు ఫెయిల్యూర్ అనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. నమ్మకంతో సీఎస్ గా నియమిస్తే ఆయన ఆశించిన మేరకు పని చేయలేకపోయారని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా కొత్త చట్టాలను చేసినా సంతృప్తికర ఫలితాలు రాలేదన్న అసంతృప్తిలో ఉన్న సీఎం.. సీఎస్ పై కోపంగా ఉన్నారని సమాచారం. ఈ విషయం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల వరకూ చేరింది. దీంతో వారు తదుపరి సీఎస్ ఎవరవుతారో అని కూడా చర్చించుకుంటున్నారయట.