ఏపీ సీఎస్ కుమారుడి భూభాగోతం..? ధర్మాన హెచ్చరికలు అందుకేనా?
posted on May 26, 2024 7:28AM
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి భూబకాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్పనంగా మింగేయాలని ప్రయత్నించాడా? 2వేల కోట్ల రూపాయల భూములను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జవహర్ రెడ్డి మరో నెలరోజుల్లో సీఎస్ పదవి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో జవహర్ రెడ్డి కుమారుడు, పలువురు వైసీపీ ముఖ్యనేతలు అసైన్డ్ భుములను కాజేసే ప్రయత్నం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా 800 ఎకరాలను అప్పనంగా కొట్టేసేందుకు కుమారుడికి జవహర్ రెడ్డి సహకరించారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జవహర్ రెడ్డి అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు దొంగచాటున విశాఖ నగరానికి ఎందుకు వెళ్తున్నారు? అంత గోప్యంగా ఆయన పర్యటనను ఉంచాల్సిన ఆవశ్యకత ఏముందని జనసేన నేత ప్రశ్నించారు. పేదలు అసైన్డ్ భూములు, డీ పట్టా భూములు అమ్ముకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని చేసిందనీ, ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో 800 ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో ఆయన కుమారుడు పేద రైతుల దగ్గర నుంచి అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నట్లు జనసేన నేత ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని గమనించి రాత్రికి రాత్రే పట్టాలను తమ పేర్లపై రిజిస్ల్రేఫన్లు చేయించుకుంటున్నారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.
సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడిపై జనసేన నేత చేసిన ఆరోపణల్లో ఎంత వరకు వాస్తవం ఉందనే విషయం పక్కన పెడితే.. గతంలో వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు చేసిన హెచ్చరికలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి ఎవరో వచ్చి శ్రీకాకుళం జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూదందాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళంలో కడప రెడ్లు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోను.. అది ఏ పార్టీ వారు అయినా సరే అంటూ ధర్మాన హెచ్చరికలు జారీ చేశారు. అప్పట్లో ధర్మాన చేసిన వ్యాఖ్యలు జవహర్ రెడ్డి కుమారుడి భూదందాను ఉద్దేశించి చేసినవేనని ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. అప్పటి నుంచే జవహర్ రెడ్డి కుమారుడు భారీ ఎత్తున భోగాపురం పరిసర ప్రాంతాల్లో భూదందాకు తెర లేపారని, సీఎస్ సహకారం, ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా పుష్కలంగా ఉండటంతో ధర్మాన అప్పట్లో హెచ్చరికలు చేశారని చర్చ జరుగుతోంది.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సహకారంతో ఆయన కుమారుడు భూదందాకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం నేతలు స్పందించారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ సీఎస్ జవహర్ రెడ్డి ఈరోజు నుండి ఏ ఫైల్ చూడకుండా, ముఖ్యంగా భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల సంఘం కట్టడి చేయాలని కోరారు. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా ఆయనను కలవకుండా నిరోధించాలన్నారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేసి సీఎస్ జవహర్ రెడ్డి విదేశాలకు పోకుండా పాస్ పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన కదలికలపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎస్, ఆయన కుమారుడి భూభాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, జవహర్ రెడ్డి పదవీవిరమణ చేయకముందే ఆయనను విచారించి, ఆయన భూభాగోతాలను ప్రజలకు తెలియజేయాలని వర్ల రామయ్య సీఈసీని కోరారు.
సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడి భూదందాకు ప్రభుత్వ సహకారం ఉందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏపీ సీఎస్ గా జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ అధికారిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని విపక్ష పార్టీల నేతలు మొత్తుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏది చెబితే అది చేయడంతో పాటు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాతకూడా ఆయన వైసీపీ కార్యకర్తగానే ప్రవర్తించారన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా పెన్షన్లు పంపిణీ విషయంలో, వాలంటీర్ల విషయంలో జవహర్ రెడ్డి తీరు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. సీఎస్ పదవి నుంచి జవహర్ రెడ్డిని తొలగించాలని ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూ వస్తున్నారు. జగన్ చెప్పిందల్లా సీఎస్ చేయడంతో అతని కుమారుడు భూదందాకు ప్రభుత్వ పెద్దలు సహకరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తనపై, తన కుమారుడిపై వస్తున్న భూదందా ఆరోపణలపై సీఎస్ జవహర్ రెడ్డి స్పందించారు. విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు గత ఐదేళ్లలో విశాఖలో గాని, ఉత్తరాంధ్రలో గాని ఏ జిల్లాకు వెళ్లలేదు. తన కుమారుడిని అడ్డం పెట్టుకుని బినామీల పేరిట భూములు చేజిక్కించుకున్నట్లు చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మరో 400 ఎకరాలపైగా భూములను పెద్ద ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అధికారులను పరుగులు పెట్టించినట్లు చేసిన ఆరోపణ ఏమాత్రం వాస్తవం కాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ ఖననం చేసే తీవ్ర కుట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కార్పొరేటర్ మూర్తి యాదవ్ తనపై నాపై చేసిన తప్పుడు ఆరోపణలను వెనక్కి తీసుకుని మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని జవహర్ రెడ్డి హెచ్చరించారు. ఏది ఏమైనా సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడి భూదందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించడం పక్కన పెడితే..ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలనీ, అంత వరకూ సీఎస్ ను విధులకు దూరంగా ఉంచాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల సంఘం వెంటనే ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి.