Crazy Online Shopping

Shopping for personal goods and lifestyle products has been interesting to everyone at a certain point in time...online shopping is picking up its swing in India too. In the Western World, it is already a pretty familiar thing. Buy anything, anytime with just a card!! It is so comfortable, time saving, and an effortless job. Returning items bought online, is also getting easier these days. The 'Free Shipping' is such an attractive part. Email notifications and Cellphone Alerts from the shopping websites have made it even more easier and better to keep a track of the deals and sales. Just make sure you keep your card details secure and use only presonal devices to shop online.

Just wait for the after Festival Season in India and the Thanksgiving, Christmas Sale in the USA and every online shopper gets so crazy...so do i !! Most of us just get so curious to know whats every website we signed up for sells during its clearance event...whether we buy things or not, browsing for hours, putting everyother item in the shopping bag and then when you realise the amount is going to high or if it still doesnot qualify for 'free shipping', just close the browser !!! For most of us, it is a Passtime activity.

 

Even the Birthday Gifts are arriving from online stores, a day after the guests attend the party ! I actually did almost something similar, not intentional, the gifts got delayed and arrived to the host a day after i attended the party ! This online shopping is not as timely as shopping at the store..due to climatic reasons, transport strikes, unavailability of items in stock, the shipments arrive so late and you get so frustrated with the long wait...and strangely sometimes the orders arrive so early. Whatever be the reason to still continue with in-store shopping, Online Buying is irresistibly, crazily attractive !!

-Prathyusha Talluri

దుఃఖాలు.. సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..!

  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.

హెల్త్‌కు సైకిల్‌తో హైఫై కొట్టండి!

ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం. అసలింతకూ అలా ఎందుకంటారు.  రెగులర్ ఎక్సర్సైజ్! ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ.  కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంజిన్ ఖర్చు లేనే లేదు! బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి  కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.  వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది. బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప. అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.            ◆ వెంకటేష్ పువ్వాడ.

టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?

  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.

వ్యాపారంలో ఎదగడానికి సూపర్ టిప్స్ ఇవి..!

  మనిషి జీవితంలో ఆదాయం రావడానికి ఏదో ఒక ఉపాధి తప్పనిసరిగా ఉండాలి.  కొందరు ఒకరి కింద పనిచేస్తారు. మరికొందరు తమకు తామే ఉపాధి సృష్టించుకుంటారు.  ఇలా తమకు తాము ఉపాధి సృష్టించుకునేవారు వ్యాపారస్తులు అవుతారు. వ్యాపారం బాగా ఎదిగితే వీరే కొందరికి తమ కింద ఉపాధి కల్పిస్తారు.  అయితే వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు. దీనికి కారణం  వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడమే.. చేతిలో డబ్బు ఉంటే చాలు వ్యాపారం చేసేయవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ వ్యాపారం చేయాలన్నా, అందులో విజయం సాధించాలన్నా జ్ఞానం చాలా అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేమిటో తెలుసుకుంటే.. కష్టపడి పనిచేయడం.. వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం ఎప్పుడూ అవసరం.  సోమరితనంతో,  నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు.  తగినంత సమయం ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే అది విజయానికి బదులుగా అపజయాన్ని మిగులుస్తుంది. సానుకూల ఆలోచన.. పాజిటివ్  ఆలోచన,  ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవడం ద్వారా తాము చేసే పనులలో  సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు  మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ఇది  ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సత్సంబంధాలు..  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఇది  వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ  కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  కస్టమర్ల సాటిసిఫ్యాక్షన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్టు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రిస్క్.. కొత్త వ్యాపార అవకాశాలను త్వరగా గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టడానికి భయపడకూడదు.. అయితే, ఏదైనా రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకోవాలి. నిజాయితీ.. వ్యాపారస్తులకు ఉండాల్సిన  ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ.  నిజాయితీగా వ్యవహరించడం వల్ల  ఖ్యాతి,  వ్యాపారం మెరుగుపడుతుంది.  దీని ద్వారా  గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు. కస్టమర్‌లు,  ఉద్యోగుల మధ్య నమ్మకమైన వాతావరణాన్ని నిర్మించాలి. ఇది  వ్యాపారాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పం.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయం సాధిస్తామో అని ఆలోచిస్తారు. విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపికగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి.  వ్యాపారం అంటే  విజయం మాత్రమే కాదు.. అందులో విజయం ఉంటుంది,  వైఫల్యం కూడా ఉంటుంది. కాబట్టి  వైఫల్యాలు ఎదురైతే వాటి  నుండి నేర్చుకుని ముందుకు సాగండి. విజయం సాధిస్తే మళ్లీ కొత్త మార్గాలను జాగ్రత్తగా అన్వేషిస్తూ సాగాలి. లీడర్షిప్ స్కిల్స్.. వ్యాపారం చేయడానికి న్యాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.  వాటిని మెరుగుపరుచుకోవాలి.  ఎందుకంటే తన కింద వారిని నడిపించడానికి అవి సహాయపడతాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పై విషయాలను అన్వయించుకోవడం ద్వారా  వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని  కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.  జీవితంలో కీర్తిని, ప్రతిష్టను కూడా సాధించవచ్చు.                                        *రూపశ్రీ.

జనవరిలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా  ఉంటుందో తెలుసా?

జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. జనవరిలో జన్మించిన వారి రాశిచక్రం,  పుట్టిన సమయం కూడా వ్యక్తి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరిలో జన్మించిన వ్యక్తులు తరచుగా  భిన్నంగా కనిపిస్తారు. వారిలో ఒక వింతైన తీవ్రత ఉంటుంది, చిన్న వయస్సులోనే జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది.  ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుంటే.. జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం,  ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం జనవరిలో జన్మించిన వారు సహజంగా ప్రశాంతంగా, దృఢంగా ఉంటారు.  నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.   పరిణితి.. జనవరిలో జన్మించిన పిల్లలు గంభీరమైన స్వభావం,  ఆలోచనలో పరిణతితో  వారి వయసు  కంటే తెలివైనవారిగా కనిపిస్తారు.  ఎక్కువగా మాట్లాడరు, కానీ వారు మాట్లాడినప్పుడు  జాగ్రత్తగా మాట్లాడతారు. వారి నిర్ణయాలు భావోద్వేగాలపై తక్కువగా,  తర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. చిన్నతనంలో  అందరికీ దూరంగా ఉండటం ఎక్కువ. ఎవరితో ఎక్కువ మాట్లాడరు కూడా..  కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు వారికి బలంగా మారతాయి. నిరాడంబరత, ఆదర్మమార్గం.. జనవరిలో జన్మించిన వ్యక్తులలో లీడర్ క్వాలిటీస్ ఎక్కువ. అయినా కూడా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా లీడర్స్ గా ఎలా ఉండాలో  వారికి తెలుసు. వారు ఆజ్ఞాపించరు, ఆదర్శంగా ముందుకు సాగుతారు. పాఠశాలలో లేదా ఆఫీసులలో అయినా, అందరూ వీరి పట్ల చాలా నమ్మకంతో ఉంటారు. క్రమశిక్షణ.. క్రమశిక్షణ వారి రక్తంలోనే ఉంటుంది. జనవరిలో పుట్టిన వారికి  బద్దకం అంటే శత్రువట.  సమయానికి మేల్కొనడం, తమ పనిని సరిగ్గా చేయడం,  తమ బాధ్యతలను నెరవేర్చడం వీరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్రమశిక్షణ కొన్నిసార్లు వారిని కఠినంగా లేదా మొండిగా చేస్తుంది. ముఖ్యంగా  తమ ఇష్టానికి తగ్గట్టు ఏదైనా  జరగనప్పుడు మరింత మొండిగా మారతారు. వ్యక్తీకరణ..  వీరి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. కానీ అవి చాలా తక్కువగా వ్యక్తం చేస్తారు. వీరి నుండి  ప్రేమ పూర్తి నిజాయితీతో వస్తుంది,  స్నేహాలు జీవితాంతం ఉంటాయి. అయితే భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సంకోచం వారిని సంబంధాలలో అపార్థాలకు గురి చేస్తుంది. భయం.. కష్టపడి పనిచేయడానికి భయపడరు.  కష్టాలకు భయపడి వెనుకంజ వేయడం వంటివి చేయరు. జనవరిలో పుట్టిన పిల్లలు కష్టపడి పని చేయడాన్ని గౌరవిస్తారు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే భ్రమలో  జీవించరు. అందుకే వారు తమ కెరీర్‌లో నెమ్మదిగా ఎదుగుతారు.  కానీ పూర్తీగా పై స్థాయిలో ఉండే విధంగా స్థిరపడతారు.   వారి గొప్ప బలం ఓర్పు. వారి అతిపెద్ద బలహీనత తమతో తాము చాలా కఠినంగా ఉండటం.   బాధ్యత.. ఇంట్లో అయినా లేదా సమాజంలో అయినా జనవరిలో పుట్టిన వారు  చిన్న వయస్సులోనే బాధ్యతలను స్వీకరిస్తారు. వారు తక్కువ ఫిర్యాదు చేస్తారు,  తమ విధులను నెరవేర్చడంలో  నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ భారం వారిని అంతర్గతంగా అలసిపోయేలా చేస్తుంది. కానీ వారు అలసిపోతున్నట్టు అస్సలు బయటపడనీయరు.                                          *రూపశ్రీ.

పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు ఈ ప్రశ్నలు వేసుకోవాలి..!

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వెనుకటి కాలంలో పెళ్లి అంటే కేవలం పెద్దల నిర్ణయం. కానీ నేటి తరంలో పెళ్లి చేసుకునే వారిదే మొదటి, చివరి నిర్ణయం కూడా.. పెళ్ళి చేసుకోబోయే జంటలు పెళ్లికి ముందు ఒకరినొకరు కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. దీని వల్ల ఒకరినొకరు తెలుసుకోవడానికి వీలుంటుంది. దీని ఆధారంగా పెళ్లి గురించి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు.  ఇంతకీ పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. అంచనాలు.. పెళ్ళికి ముందు చాలామంది తమకు వచ్చే భాగస్వామి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఈ అంచనాల గురించి ప్రశ్నించుకోవడం చాలా మంచిది. ఇది ఎవరి ఆలోచన ఎలా ఉంది? ఎలాంటి లైప్ కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పెళ్లి తర్వాత ఉద్యోగం.. భారతదేశంలో ఇంటి బాధ్యత చూసుకునేది మగవారే.. అందుకే వారికి ఉద్యోగం తప్పనిసరి. అయితే  అమ్మాయిలు చదువుకున్నా,  ఉద్యోగం చేస్తున్నాపెళ్లి తర్వాత ఈ పరిస్థితులు మారుతుంటాయి.  అందుకే పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా? అనే విషయాలు ముందుగానే చర్చించుకోవడం మంచిది. వివాహం తర్వాత వీటి గురించి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. బాధ్యతలు.. ఇంటి బాధ్యతలు, ఆర్థిక భాద్యతలు,  పిల్లల బాధ్యతలను ఎలా విభజించాలి? వాటిని ఇద్దరూ ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాలు కూడా పెళ్లికి ముందు చర్చించుకోవాలి.  దీని వల్ల ఇద్దరూ తమ బాధ్యత చక్కగా నెరవేర్చుకోగలరు. ఆర్థిక ప్రణాళిక.. బాగస్వామి ఆర్థిక అలవాట్లు,  పొదుపులు, ఖర్చు విధానాలను అడిగి తెలుసుకోవాలి. ఎంత సంపాదన ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు వంటివి అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తర్వాత ఇద్దరూ ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది వివాహం తర్వాత గొడవలను, విబేధాలను రాకుండా ఉండటంలో సహాయపడుతుంది. పిల్లల ప్లానింగ్.. పెళ్లి కాకుండానే పిల్లల గురించి మాట్లాడటం కాస్త విచిత్రం అనుకుంటారు అందరూ. కానీ నేటితరం వారు పిల్లల బాధ్యతను ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అందుకే ఎంత మంది పిల్లలను ప్లానింగ్ చేసుకోవాలి? పిల్లలను ఎప్పుడు కనాలి? పిల్లలను ఎలా పెంచాలి? పిల్లల బాధ్యతల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?  వంటి విషయాలు చర్చించుకోవాలి. ఇది భార్యాభర్తల బందాన్ని బలపరుస్తుంది. వివాదాలు.. ప్రతి ఒక్కరికి కోపం, అసహనం,  చిరాకు, గొడవ,  సమస్య వంటివి ఎదురైనప్పుడు స్పందించే విధానం వేరుగా ఉంటుంది.  ఇలాంటివి ఎదురైనప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకోవాలి.  దీని వల్ల వివాహం తర్వాత గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పిరిష్కరించుకోవాలో ఇద్దరికీ అర్థం అవుతుంది. కుటుంబ సంబంధాలు.. పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడం కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటవ్వడం. పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయి తమ అత్తమామలతో ఎలా ఉండాలి? ఎలాంటి అనుబంధం కోరుతున్నారు? వంటివి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇలా చేస్తే వివాహం తర్వాత ఎలాంటి విభేదాలు ఉండవు. ఇష్టాలు, అయిష్టాలు.. కాబోయే భాగస్వామి ఇష్టాలు, అభిరుచులు,  అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు వంటివి పెళ్లికి ముందు తెలుసుకోవాలి.  వైవాహిక బంధం ఎక్కువగా ఒకరి ఇష్టమైనది మరొకరు చేయడం అనే పని ద్వారా బలపడుతుంది.  దీని పల్ల ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థం అవుతుంది.  అందుకే ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవాలి.                                *రూపశ్రీ.

అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులు ఇవి..!

  మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక అమ్మాయి అబ్బాయి చేతిలో మోసపోతే అది జీవితం మీద చాలా గట్టి దెబ్బ అవుతుంది. కానీ ఈ విషయంలో అమ్మాయిలకు ఒక అవకాశం ఉంది. అదే ముందు జాగ్రత్త.. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఆ అబ్బాయిలు చేసే పనులే వారిని పట్టిస్తాయి.  వీటిని అర్థం చేసుకుంటే అమ్మాయిలు జాగ్రత్తపడి మోసగాళ్ల బారినుండి తప్పించుకోవచ్చు. ఇంతకీ.. అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు చేసే పనులేంటో తెలుసుకుంటే..   ప్రవర్తన.. అబ్బాయి అమ్మాయిని మోసం చేసే ఉద్దేశంతో ఉంటే వెంటనే కనిపించే మొదటి మార్పు.. ప్రవర్తన మారిపోవడం.  అబ్బాయి ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మునుపటిలాగా ప్రేమించకపోవడం, శ్రద్దగా ఉండకపోవడం చేస్తారు.   అవసరాలు.. కేవలం తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించే అబ్బాయి మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఇతరుల అవసరాల గురించి, వారి భావాల గురించి అస్సలు పట్టదు.  వారికి  కావాల్సింది దక్కనప్పుడు వారు సింపుల్ గా దూరం పెడతారు.     నిజాలు.. మొదట చిన్న చిన్న విషయాలు కూడా షేర్ చేసుకున్న వ్యక్తి  ఆ తరువాత ఏ విషయాలు చెప్పకుండా గోప్యత మెయింటైన్ చేస్తుంటే, పైగా ఏదైనా విషయం అడిగినప్పుడు నిజం చెప్పకుండా  అబద్దాలు చెబుతుంటే  అలాంటి వారిని నమ్మడం కష్టం.   సమయం.. ప్రేమలో ఉన్నవారు,  ప్రేమిస్తున్న వారు.. తమ పార్ట్నర్ కోసం తప్పకుండా ఏదో ఒక విధంగా సమయాన్ని కేటాయిస్తారు.  వారు ఎంత బిజీ అయినా సరే.. సమయాన్ని కేటాయిస్తారు. కానీ మోసం చేసే ఉద్దేశ్యం ఉన్నవారు ఏదో ఒక సాకు చెబుతుంటారు. అలాంటి వారికి బంధం పట్ల సీరియస్ నెస్ ఉండదు.   మాటలు.. చేష్టలు.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిల మాటల్లోనూ, చేష్టలలోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. మాటల్లో చాలా తియ్యగా మాట్లాడతారు. గొప్పలు చెబుతారు,  తాము చాలా అత్యుత్తమం అనేలా నమ్మిస్తారు. కానీ ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి పూర్తీగా సీన్ మారిపోతుంది. తాము చెప్పిందే చేయాలన్నట్టు డిమాండ్ చేస్తారు.  లేకపోతే నిర్లక్ష్యం చూపిస్తారు.   సహాయం.. మోసం చేసే ఉద్దేశం ఉన్న అబ్బాయిలు పూర్తీగా స్వార్థంతో ఉంటారు.  అమ్మాయి ఏదైనా సహాయం అడిగినప్పుడు సహాయం చేయకపోవడం లేదా తప్పించుకున్నా అతను అమ్మాయిని కేవలం వాడుకుంటున్నాడని అర్థం.   స్వప్రయోజనం.. అబ్బాయి డబ్బు లేదా ఏదైనా సహాయం వంటి వాటికోసం అమ్మాయిని ఒత్తిడి చేసి మరీ ఇబ్బంది పెడుతుంటే అతను మోసం చేసే ఉద్దేశం ఉన్నవాడని అర్థం. నిజంగా ప్రేమించే అబ్బాయిలు తమ వల్ల తను ప్రేమించే అమ్మాయికి ఎలాంటి కష్టం రాకూడదు అనుకుంటారు.   నియంత్రణ.. అమ్మాయి తన కుటుంబానికి, తన సన్నిహితులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేసే అబ్బాయిలు ఎప్పుడూ నిజమైన ప్రేమ కలిగి ఉండరు. అమ్మాయిని నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు ఆమెను తమకు అనుగుణంగా వాడుకుంటారు.   బాధ్యత.. ప్రతి అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయి పట్ల బాధ్యత ఉంటుంది. కానీ అతను అమ్మాయి పట్ల బాధ్యతతో ఉండకుండా కేవలం తన సొంత సంతోషం గురించి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే అతను అమ్మాయి పట్ల సీరియస్ నెస్ లేనట్టే..   ఎమోషన్స్.. అమ్మాయిలకు సాధారణంగానే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే అబ్బాయి అమ్మాయి ఎమోషన్స్ ను పట్టించుకోకుండా ,  అర్థం చేసుకోకుండా ఉంటే అతను సరైన పార్ట్నర్ కాడని అర్థం.అలాంటి వాడితో ఏ అమ్మాయి సంతోషంగా ఉండలేదు.   - రూపశ్రీ  

కొత్త ఏడాదిలో జీవితాన్ని మార్చే 5 మ్యాజిక్ టిప్స్ ఇవి..!

  కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు. అయితే కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు వాటిని భరించాలని,  ఓర్పుతో వాటిని అధిగమించాలి.. తెలిసిన మనుషులు ఆరోగ్యం దగ్గర మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  సింపుల్ గా చెప్పాలంటే నేటికాలంలో ఆరోగ్యం విషయంలో సర్దుబాటు చేసుకునే వారు ఎక్కువ. అలాగే జీవితం అంటే ఎప్పుడూ ఇంతే అని నిరాశలో బ్రతికేవారు కూడా ఎక్కువే.  ప్రతి సారి ఇలాంటివి  మామూలే అనుకోకుండా కనీసం   కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం, జీవితం  గురించి కాస్త శ్రద్ద పెట్టడం వల్ల మెరుగవ్వచ్చు. 5 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జీవితమే మారిపోతుంది.  ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..   ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా ఉండగలం.. పైన పేర్కొన్న విషయాన్ని  స్పష్టంగా అర్థం చేసుకుంటే చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం వల్ల  శక్తి, సమయం,  డబ్బు ఆదా అవుతాయి. అంతేకాదు ఇతరులకు సహాయం చేయవచ్చు. తాము ఆరోగ్యంగా, పాజిటివ్ గా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా అటు వైపు ఇన్ప్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది.   బరువు మాత్రమే కాదు.. చాలా మంది ఆరోగ్యం గురించి తీసుకునే నిర్ణయాలలో ఈ ఏడాది బరువు తగ్గాలి.. లాంటివి ఉంటాయి. అయితే బాగా ఆరోగ్యంగా ఉండటం అంటే బరువు తగ్గడం,  పొట్ట తగ్గించుకోవడం మాత్రమే కాదు. తెలివితేటలను, మనస్సును నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. జిమ్‌లో కండరాలు పెంచడానికి వ్యాయామం చేయడమే కాదు.. నలుగురికి సహాయపడటం, మానవత్వంతో ఉండటం వంటి గుణాలు కూడా ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎన్నో రెట్లు మెరుగుపరుస్తాయి.   నిద్ర ముఖ్యం.. కార్పొరేట్ ఉద్యోగాలు, యంత్రాల్లా పని చేసే మనుషులు,  ఎలక్ట్రానిక్ వస్తువుల్లా సాగే శరీరాలు..  ఇది మాత్రమే కాకుండా  గాడ్జెట్‌లు నాణ్యమైన నిద్ర అంటే ఏంటో తెలియకుండా మనుషులను మార్చేశాయి. అందుకే ఈ నూతన సంవత్సరంలో నిద్ర విషయంలో రాజీ పడకూడదని ఎవరికి వారు ఒక నిబంధన పెట్టుకోవాలి. శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకోవడానికి, ఎలాంటి జబ్బులు శరీరానికి కలగకుండా ఉండటానికి  ప్రతి రాత్రి సమయానికి నిద్రపోవాలి. ఇది  నిద్ర కణాలను పునరుజ్జీవింపజేస్తుంది, మరుసటి రోజు లేవగానే ఎనర్జీగా ఉండేందుకు,  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గేందుకు సహాయపడుతుంది.   శ్వాస- ప్రాణ శక్తి.. ప్రతిరోజూ కొంత సమయం శ్వాసపై శ్రద్ధ వహించాలి. కాలానుగుణ పండ్లు,  కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చేస్తే శరీరంలో మంచి ఎనర్జీ, ప్రాణ శక్తి మెరుగవుతాయి. రోజువారీ అలసట అధిగమించడానికి ప్రకృతిలో సమయం గడపాలి.  సూర్యకాంతిలో గడపడం,   స్వచ్ఛమైన గాలి ఉన్న చోట  నడవడం. నేలపై చెప్పులు లేకుండా నడవడం, వంటివి చేయాలి. ప్రకృతిని గౌరవిస్తే అది ప్రేమను, శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది.   ప్రతిభ- సామర్థ్యం.. ప్రతి వ్యక్తి తమలో ఉన్న  ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితాలు పొందగలుగుతారు. ఏదో బ్రతికేస్తున్నాం అనుకోకుండా  జీవితాన్ని మరింత అందంగా ఎలా మార్చుకోవాలో,  అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి.  ఇది జీవితంలో అబివృద్దికి దారి తీస్తుంది.   - రూపశ్రీ  

నార్సిసిస్టులు.. వీళ్లను గుర్తించడానికి ఇవే సరైన మార్గాలు..!

ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటారు.  వారి వ్యక్తిత్వానికి తగినట్టు వారు మాట్లాడుతుంటారు.  నచ్చినట్టే ఏ పని అయినా చేస్తుంటారు. అయితే సైకాలజీ ప్రకారం మనుషులను వివిధ వర్గాలుగా విభజిస్తారు.  వారిలో నార్సిసిస్టులు కూడా ముఖ్యమైనవారు.  నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు.  వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.  దీని వల్ల వారు గొప్ప వారు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. నార్సిసిస్టులు తమ తప్పు ఎప్పటికీ ఒప్పుకోరు.  తమ తప్పును ఒప్పుకోకూడదు కాబట్టి,  తాము చేసింది కరెక్ట్ అని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ఎవ్వరినైనా దోషులుగా నిలబెట్టడానికి వెనుకాడరు. ఈ నార్సిసిస్టులు మన చుట్టూనే ఉంటారు.  కానీ వీరిని అంత సులువుగా గుర్తించలేం.  మనం నార్సిసిస్టులతో మాట్లాడుతున్నాం అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. తప్పుల తిరస్కారం..   నార్సిసిస్టులు తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు.  వారిని ఏదైనా విషయంలో గట్టిగా అరిచినట్లయితే, వారు వెంటనే ఎందుకంత రియాక్ట్ అవుతున్నావ్ ఇదేమంత పెద్ద విషయమని అంటారు, లేదంటే నేను అలా ప్రవర్తించలేదు, నాకు అలాంటి హ్యాబిట్ లేదు అని అంటారు. తమ తప్పులు బయట పడకుండా ఉండటం కోసం ఎదుటివారిని  తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. నిజంగా  జరిగిన సంఘటనలను కూడా తిరస్కరిస్తారు. టోటల్ గా  గందరగోళానికి గురిచేసి ఎదుటి వ్యక్తి తమ మీద తాము అనుమానించుకునే స్థాయికి తెస్తారు. ఎదుటి వ్యక్తిని కించపరచడం.. నార్సిసిస్టులు వారి తప్పులు లేదా వారి నిజాలు బయటపడినప్పుడు తమ తప్పు దాచుకోవడానికి  అవతలి వ్యక్తిపై దాడి చేస్తారు. తెలివి  లేని వ్యక్తులు గానూ,  డ్రామా ఆడే వారిగానూ ఎదుటి వ్యక్తులను నిందిస్తారు.  వారి వ్యక్తిత్వాన్నే కించపరిచి,  వారిని తక్కువ చేసి మాట్లాడతారు. సింపుల్ గా ఎదుటివారి  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా  తమను తాము రక్షించుకోవడానికి ట్రై చేస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు.. గతంలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ అన్నింటిని కలిపి ఎదుటి వారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. తామే బాధితులుగా.. నార్సిసిస్టులు తరచుగా తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుని  వారు చేసిన తప్పుల నుండి అందరినీ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వారిని తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా  వారి గురించి ఎదుటి వారే చెడుగా ప్రవర్తిస్తున్నారని  ఆరోపిస్తారు. దీని వల్ల వారి తప్పుల గురించి మాట్లాడటం మాని తాము తప్పు వ్యక్తులం కాదని నిరూపించుకోవడానికే ఎదుటి వ్యక్తులు ట్రై చేస్తారు. దీని వల్ల నార్సిసిస్టులు ఎదుటివారిని తప్పు చేసిన వ్యక్తులుగా నిలబెట్టి తాము తప్పించుకుంటారు. తక్కువ చేసి మాట్లాడటం.. ఎదుటి వ్యక్తులు  విచారం లేదా కోపాన్ని నార్సిసిస్టుల ముందు వ్యక్తం చేస్తే వారు దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. చాలా ఓవర్ చేస్తున్నావ్ అనడం లేదా చాలా సెన్సిటివ్ అని చెప్పడం, ఇంత చిన్న  విషయానికి గొడవ చేయడం ఏంటి అని అనడం చేస్తారు. చివరికి తాము నిజంగా దైర్యం లేని వారిమేమో అని ఆలోచించే స్థాయికి వారు తీసుకొస్తారు. చివరికి తప్పు నాదేనేమో అని ఎదుటివారు అనుకునేలా చేస్తారు. తప్పులు వారివి.. నిందలు ఎదుటివారికి.. నార్సిసిస్టులు  తమ తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా  చేస్తారు. తాము సొంతంగా చేసే తప్పులు, పనులకు ఎదుటివారిని నిందిస్తారు.  వారు అబద్ధం  చెప్పి ఎదుటివారిని  అబద్ధాలకోరు అని అంటారు. వారు మోసం చేస్తూ  ఎదుటి వారిని అనుమానిస్తారు. ఎదుటి వారి బాధలు.. నార్సిసిస్టులకు జోకులు.. కొన్నిసార్లు ఎదుటివారికి బాధ  కలిగించే విషయాలను జోక్ లాగా మాట్లాడుతుంటారు. వారు మాట్లాడిన మాటలను ఎవరైనా ఖండిస్తే.. నేను జోక్ చేశాను దానికి కూడా ఇంత సీరియస్ అవ్వాలా అని తప్పించుకుంటారు.   పైన చెప్పుకున్న లక్షణాలన్నీ నార్సిసిస్టులలో ఉంటాయి. నార్సిసిస్ట్‌తో వాదించడానికి ప్రయ త్నించడం తరచుగా వ్యర్థం.  ఎందుకంటే వారు ఏమి చేసినా తమను తాము సరైనవారని నిరూపించుకుంటారు. కాబట్టి అలాంటి వారితో బోర్డర్ లైన్ పెట్టుకోవాలి. వారితో ఎక్కువ డిస్కస్ చేయకూడదు.  వారిలో ఏ విషయాలలో విబేదించకూడదు.  ఏదైనా ఇబ్బంది లేదా సమస్య అనిపిస్తే మెల్లిగా తప్పించుకుని వారికి దూరం వెళ్లాలి. అంతేకానీ వారితో గెలవాలని అనుకుంటే  మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా నాశనం చేసే విషయాలు ఇవి..!

భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు.  అలాగని వీటికి పెద్ద కారణాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు.  పెద్ద కారణాలు, గొడవలు జరిగినప్పుడే విడిపోవడానికి దారి తీస్తుందని అనుకుంటే పొరపాటే.. పైకి కనిపించకుండానే భార్యాభర్తల బంధం పెళుసుబారుతుంది. ఎంతో సంతోషంగా ఉన్న జంట కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల తమ బంధాన్ని నాశనం చేసుకుంటారు.  ఇంతకీ భార్యాభర్తల బంధాన్ని  నాశనం చేసే తప్పులు  ఏంటో తెలుసుకుంటే.. అనుమానం.. ఏ సంబంధానికైనా అనుమానం అతిపెద్ద శత్రువు.  లైఫ్ పార్ట్నర్  ఫోన్‌ను చెక్ చేయడం, పదే పదే అనుమానించినట్టు చూడటం చేస్తుంటే, వారిపై నిఘా పెడుతుంటే లేదా అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేకుండా ప్రేమ అనే భవనం నిలబడదు. అనుమానం పెనుభూతం అనే మాట వినే ఉంటారు.  అనుమానం  అనేది ఒక సంబంధాన్ని లోపల నుండి క్షీణింపజేసే చెదపురుగుల లాంటిది. ఎగతాళి.. ఎగతాళి చేయడం చాలామందికి అదొక కామెడీ ఆటగా ఉంటుంది. కోపంతో లేదా హాస్యంగా ఎగతాళి చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు, కానీ అది అవతలి వ్యక్తి హృదయంలో లోతైన గాయాన్ని కలిగిస్తుంది. "నీకు ఏమీ తెలియదు" లేదా "నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు" వంటి మాటలు   భాగస్వామి మనస్సులో నెమ్మదిగా  ద్వేషాన్ని పెంచుతాయి. అంతేకాదు.. బాడీషేమింగ్ గురించి,  రూపం గురించి చేసే ఎగతాళి మరింత మానసిక గాయం చేస్తుంది. ఇవి చాలా తప్పు. పోలిక.. భార్యాభర్తలు ఎప్పుడూ తమ భాగస్వాములను ఇతరులతో పోల్చి దెప్పిపొడచకూడదు.  ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం.  ఇతరులతో ఏ విషయంలో పోలిక పెట్టి మాట్లాడటం చాలా తప్పు. ఇతరులతో పోల్చి మాట్లాడేటప్పుడు తమతో బంధం ఎందుకు అని భావించేవారు ఉంటారు. ఇది వ్యక్తి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది. పంతం.. నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే పైనల్.. లాంటి మాటలు మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. తాను కరెక్ట్ అని తన భాగస్వామి తప్పని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. వారి అహం వారిని అలా చేయిస్తుంది. కానీ ఇది బందం నాశనం కావడానికి కారణం అవుతుంది. మౌనం.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిదే. కానీ భార్యాభర్తల మధ్య గౌడవ కేవలం మౌనంతో పరిష్కారం కాదు. కొందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మౌనాన్ని ఆయుధంగా వాడతారు.  అలా చేయడం వల్ల అపార్టాలు మరింత పెరుగుతాయి. పాత విషయాలు.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు చాలామంది చేసే పని పాత విషయాలు బయటకు తీసి వాటి గురించి మాట్లాడతారు.  ఇలా జరిగిపోయిన విషయాలను బయటకు తీసి మాట్లాడుతుంటే గొడవ వల్ల బందంలో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు.  ఎప్పటి గొడవలు అప్పుడే వదిలేయాలి. మొబైల్.. నేటి కాలంలో బంధాలలో దూరం పెరగడానికి మొబైల్ ఫోన్ లే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా, ఇద్దరూ కలిసి పక్కన పక్కన కూర్చొన్నా  ఫోన్ లో  నిమగ్నమవుతుంటారు.  దీని వల్ల ఒకరిని ఒకరు పట్టించుకోలేని పరిస్థితికి వస్తారు. ఒకరి ప్రదాన్యత ఇలా తగ్గిపోతుంది. ఇది విడిపోవడానికి కారణం అవుతుంది. స్పేస్.. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువైనా కష్టమే.  ప్రేమ పేరుతో అతుక్కుపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం.  24గంటలు అతుక్కుని ఉండటం,  భాగస్వామి మీద ఆంక్షలు విధించడం, స్నేహితులను, బంధువులను కలవనివ్వకపోవడం వంటివి చేస్తే అలాంటి బంధాన్ని ఎప్పుడెప్పుడు వదులుకుందామా అనుకుంటారు. ఇలాంటి బందం ఒక పక్షిని గట్టిగా చేతిలో బంధించినట్టే ఉంటుంది. సంతోషకరమైన సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడం  రాకెట్ సైన్స్ కాదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, నమ్మకంగా ఉండాలి,  క్షమించడం నేర్చుకోవాలి.. పైన పేర్కొన్న  ఈ ఎనిమిది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవచ్చు.                               *రూపశ్రీ.