రాజ్యాంగం మైనార్టీలకు వ్యతిరేఖం అంటున్న రాఘవులు
posted on Jan 13, 2013 @ 9:56PM
భారత రాజ్యాంగం దేశంలో మైనార్టీలకు ఎప్పుడూ వ్యతిరేఖమే. దానిని నమ్ముకోవడం కన్నా మైనార్టీలు తమ స్వంతశక్తినే నమ్ముకోవడం మేలని ఉచిత సలహా ఇస్తున్నారు సీపీయం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు. తోగాడియాను అరెస్టు చేయని ప్రభుత్వం అక్బరుదీన్ను మాత్రం ఎందుకు అరెస్ట్ చేసింది? అని ప్రస్నించేరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు ఇచ్చినంత కాలం మజ్లిస్ ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకోగానే ఈ విదంగా మైనార్టీలను వేదింపులకు గురిచేస్తోందని ఆన్నారు. అయితే, అక్బరుద్దీన్ అరెస్ట్ మాత్రం సరయిన చర్యేనని ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించేరు.
అపారమయిన రాజకీయానుభవమున్న అయన భారత రాజ్యాంగ పట్ల అపనమ్మకం ప్రకటించడం విస్మయం కలిగిస్తుంది. భారత రాజ్యాంగం ప్రతీ భారతీయ పౌరుడికీ సమాన హక్కులు కల్పించి, వాటిని కాపాడవలసిన భాద్యతను ప్రభుత్వానికి అప్పగించిందనే విషయం ఆయనకు తెలియనిది కాదు. భారతదేశంలో మైనార్టీలకు ఉన్న స్వేచ్చ, సమానత్వపు హక్కుల వల్లనే మొన్న అక్బరుదీన్ ఆవిధంగా మాట్లాడగలిగేడని ఆయన తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరం. మైనార్టీలపట్ల భారత రాజ్యాంగం ఏనాడు వివక్ష చూపలేదు, అది నిర్దేశించిన హక్కులను అమలుజేయడంలో ప్రభుత్వాలు మాత్రమే విఫలమవుతున్నాయని ఆయనకీ తెలియనిది కాదు.
ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు మధ్యనున్న సన్నటి గీత చెరిగిపోయిన ఈ రోజుల్లో, ఏ ప్రభుత్వమయిన తన పార్టీకి అనుకూల నిర్ణయాలు మాత్రమే తీసుకొంటుంది. ఒక వేళ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే, అప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయాలు మజ్లిస్ ఆలోచనలకి అనుగుణంగానే ఉంటాయి తప్ప, భారత రాజ్యాంగం ఏమి చెప్పిందో తెలుసుకోవాలని అనుకోదు. ఆయన చెప్పినట్లు దేశంలో మతసామరస్యం దెబ్బ తీసి, ప్రజల మధ్య చిచ్చుపెట్టే వాళ్ళు తొగాడియా అయినా, అక్బరుద్దేన్ అయిన అరెస్ట్ కావలసిందే. గానీ, చట్టాలను అమలుచేయవలసిన ప్రభుత్వాలకి, వాటిని నడిపించే రాజకీయ పార్టీల ప్రయోజనాలే ముఖ్యం అయినప్పడు ఇటువంటి తప్పులు జరుగుతుంటాయి. అటువంటప్పుడు, భారత రాజ్యాంగాన్ని తప్పు పడుతున్న ఇటువంటి రాజకీయ నేతలు చొరవ తీసుకొని, ఇప్పుడు మాట్లాడినట్లే అప్పుడూ ప్రభుత్వాన్ని నిలదీస్తే వారి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపద్యంలో రాఘవులు ఆవిధంగా మాట్లాడటం చూస్తే, సీపీయం కూడా ఇప్పుడు మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని భావించవలసిఉంటుంది.