నాయక్ కు చురకలు వేసిన కుర్ర హీరో
posted on Jan 13, 2013 @ 1:07PM
మొన్న విడుదలయిన ‘నాయక్’ సినిమా మరో మాస్ సినిమా అయినప్పటికీ, దర్శకుడు వినాయక్ సినిమాను మలిచిన తీరుకి మాస్ ప్రేక్షకులు పడిపోయారని చెప్పవచ్చును. కమర్షియల్ సినిమాకి ఉండవలసిన అన్ని హంగులూ అమర్చిన ఈ సినిమాకి మాస్ ప్రేక్షకులు నీరాజనం పడుతుంటే, మిగిలిన వారితో బాటు మహేష్ అభిమానులు కూడా సీతమ్మ వాకిట్లోకి వెళ్లి కూర్చొంటున్నారు.
ఇంత మంచి సినిమా తీసినందుకు నిర్మాత దిల్ రాజు పై ప్రశంసల జడివాన కురుస్తోందిప్పుడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం వల్లనే, అభిమానులతో బాటు, సినీ పరిశ్రమకు చెందినవారు కూడా రెంటినీ పోల్చి తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్లు కొట్టేవారు ఇద్దరున్నారు. ఒకరు రామ్ గోపాల్ వర్మ కాగ, మరొకరు లవర్ బాయ్ గా పేరుపడ్డ హీరో సిద్దార్థ్. అతను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి తన ట్వీటర్ లో ఏమి వ్రాసాడంటే, ఈగ సినిమా తరువాత విడుదలయిన సినిమాలలో ఈ సినిమా ఒక్కటే సకుటుంబ సమేతంగా చూడదగినది. ఈ రోజుల్లో విడుదలవుతున్నమూస ఫార్ములా సినిమాలకి, అందులో ఉండే విపరీతమయిన హింసకి భిన్నంగా సీతమ్మ వాకిట్లో సినిమా చాలా అద్భుతంగా తీసారు. అందుకు సినిమా నిర్మించినవారితో బాటు, సినిమాలో నటించిన వెంకటేష్, మహేష్ బాబులకి కూడా నా అభినందనలు,” అని వ్రాసాడు.
నాయక్ సినిమా గురించి సిద్దార్థ్ ప్రత్యక్షంగా ఏమి అనకపోయినా, అతను ఎవరిని గిల్లేడో అర్ధం అవుతూనే ఉంది. నాయక్ సినిమా సీతమ్మతో కాకుండా మరెప్పుడు విడుదలయి ఉంటే, బహుశః ఇటువంటి చర్చ వచ్చేదికాదేమో. అయితే, రెండు విబిన్నమయిన సినిమాలు ఈవిదంగా ఒకేసారి విడుదల కావడంవల్లనే తెలుగు ప్రేక్షకులు ఏమి కోరుకొంటున్నారో స్పష్టంగా తెలియజేసారు. ఇది మన తెలుగు చిత్ర సీమకి తప్పక మేలు చేస్తుందని ఆశిద్దాము.