బాలయ్య పుంగనూరు యాత్ర పెద్దిరెడ్డి కోసమేనా?

 

నిన్న అంటే సంక్రాంతి పండుగరోజున బాలయ్యబాబు చిత్తూర్ జిల్లాలో పుంగనూరుకు వెళ్లి అక్కడ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామరావు విగ్రహావిష్కరణ చేసారు. ఆ తరువాత జరిగిన ఒక బహిరంగ సభలో వచ్చేఎన్నికలలో తెలుగుదేశం పార్టీనే గెలిపించ మని ప్రజలను కోరారు. అయితే బాలకృష్ణ పుంగనూరు పర్యటన మాత్రం కాంగ్రెస్ పట్ల కినుకవహించి, మంత్రి పదవికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తమ పార్టీ వైపుకు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఏర్పాటయిందని తెలుస్తోంది. ఒకప్పుడు టిడిపికి కంచుకోట అని చెప్పబడ్డ పుంగనూరు నియోజకవర్గం, టిడిపి నేత అమరనాధరెడ్డి నిష్క్రమణతో బలమయిన నాయకత్వంలేకుండా పోయింది.

 

ప్రస్తుతం, రాజకీయంగా మంచి బలమైన నాయకుడయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కిరణ్ కుమార్ నిర్లక్ష్యం చేయడంవల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను తమ వైపు తిప్పుకోవడానికి ఇదే తగిన సమయమని భావించిన తెలుగుదేశం పార్టీ బాలకృష్ణను హుటాహుటిన ‘నారావారి పల్లెలో నందమూరి వారి సంక్రాంతి సంభరాలు’ అనే వంకతో అక్కడికి పంపించినట్లు తెలుస్తోంది. తద్వారా, పెద్దిరెడ్డిని తమవైపు తిప్పుకోవడమే గాకుండా, నందమూరి మరియు నారా కుటుంబాలు చాలా ఐకమత్యంగా ఉన్నాయనే సందేశాన్ని ప్రజలలోకి పంపినట్లు అవుతుందని భావించినట్లు తెలుస్తోంది.

 

అయితే, పెద్దిరెడ్డి ఇప్పటికిప్పుడు ఎటువంటి సంకేతాలు ఈయకపోయినా, బాలకృష్ణ పర్యటన ద్వారా అయనకు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం అందజేసింది గనుక, అయన ఎప్పుడయినా పార్టీ మారవచ్చును.

Teluguone gnews banner