అవే ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగేదా.. రోజాకు నారాయణ కౌంటర్
posted on Dec 29, 2020 @ 11:51AM
నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా తనపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా కౌంటరిచ్చారు. విశ్వాసపాత్రమైన కుక్కలే కనుక ఉండి ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యేవారా? అని అయన రోజాను ప్రశ్నించారు. గతంలో చంద్రబాబును వ్యతిరేకించి, వైఎస్ఆర్‌ను సమర్ధించినప్పుడు తన కులం ఏమైనా మారిందా? అని నారాయణ నిలదీశారు. రోజా మాదిరిగా తాను పార్టీలు, కులాలు మార్చలేదని అయన అన్నారు.
అంతకుముందు.. సీపీఐ నేత నారాయణపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేసారు. గొప్ప కమ్యూనిస్ట్ భావాలున్న సీపీఐ కి ఆయన తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేంత స్థలం కూడా పేద ప్రజలకు ఇవ్వటం లేదని నారాయణ అంటున్నారని ఆమె మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేయకుండానే సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని అన్నారు. అసలు నారాయణ నగరికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. సీపీఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికి తెలుసునని.. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ మార్చేశారని రోజా విమర్శించారు.