థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ బతుకు బస్టాండే!
posted on Oct 1, 2022 @ 12:37PM
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. భార్యకు నెల నెలా ఎనిమిది లక్షల రూపాయలు భరణం ఇవ్వాల్సిందేనని విజయవాడ కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే అటు రాజకీయాలలోనూ.. ఇటు సినిమాలలోనూ ప్రాభవం కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న పృధ్వికి కోర్టు తీర్పు ములిగే నక్కమీద తాటి పండు పడ్డ చందం అయ్యింది. సినిమాల్లోకి రావడానికి ముందే పృధ్వికి వివాహమైంది. ఆ తరువాత ఆయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో భార్య కుటుంబం నుంచి ఆర్థిక సహాయాన్ని పొందాడు. సరే సినిమా అవకాశాలు వచ్చి బాగానే స్థిరపడ్డాడు. అయితే సినిమాల్లో స్థిరపడి సంపాదన రావడం మొదలయ్యాకా.. భార్యను దూరం పెట్టాడు. దీంతో ఆమె కోర్టులో కేసు వేశారు. ఆ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది.
ప్రతి నెలా అదీ పదో తేదీలోగా భార్యకు 8లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీంతో ఫృధ్వి ఇక తేరుకోవడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఆయన జగన్ పంచన చేరి రాజకీయాలలో ప్రవేశించారు. అదేం పెద్ద విషయం కాదు.. పృధ్వి కంటే ముందూ, తరువాతా కూడా అనేక మంది సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి ప్రవేశించారు. అయితే వారందరికీ భిన్నంగా పృధ్వి ముందు వెనుకలు చూసుకోకుండా.. ఇష్టారీతిన చెలరేగిపోయారు.
జగన్ మెప్పు పొందడమే లక్ష్యంగా వీళ్లూ, వాళ్లే అని చూడకుండా జగన్ ప్రత్యర్థులందరినీ విమర్శలతో చెరిగి పారేశారు. అక్కడితో ఆగకుండా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలందరినీ దూషించడం ద్వారా జగన్ వద్ద అదనపు మైలేజీ పొందడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడలేదు. అయితే ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే దక్కినే వెంటనే అంటే చాలా వేగంగా జగన్ నుంచి ఛీత్కారమూ ఎదురైంది. ఏ జగన్ ను మెప్పించడానికైతే ఆయన ఇదంతా చేశాడో చివరికి ఆ జగనే దూరం పెట్టేశారు. దీంతో పృధ్వి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. సినిమాలూ లేవు, రాజకీయంగానే భ్రష్టుపట్టిపోయారు.
దానికి తోడు ఇప్పుడు గోరుచుట్టుపై రోకటి పోటులా భార్యకు నెలకు 8లక్షల రూపాయల భరణం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కట్టకపోతే కోర్టు ధిక్కారం కింద జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. పోనీ కట్టేద్దామా అంటే సినిమాల్లో అవకాశాలే లేని పృధ్వి అంత సొమ్ము నెలనెలా కట్టడం అంటే సాధ్యమయ్యే పని కాదని ఆయన పరిస్థితి తెలిసిన వారు చెబుతున్నారు.
దీంతో పృధ్వి బతుకు బస్టాండ్ అయిపోయిందని పలువురు సెటైర్లు వేస్తున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. పదవీ కాంక్షతో పృధ్వి వేసిన ఒక్క అడుగు ఆయన జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. ఇప్పుడు పృధ్వి రాజకీయాల్లో వేలు పెట్టి వైసీపీ ట్రాప్‌లో ఇరుక్కుని భ్రష్టుపట్టిపోయానని బాధపడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో లబోదిబో మంటున్నాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా!