టీఎస్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ! కారుకు కౌంట్ డౌనేనా?
posted on Oct 18, 2020 @ 1:13PM
తెలంగాణలో ఆరున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కార్ కొనసాగుతోంది. విపక్షాలు బలంగా లేకపోవడంతో పాలనంతా సీఎం కేసీఆర్ అనుకున్నట్లే జరుగుతోంది. కొత్త పథకాలు, ప్రాజెక్టులన్ని ఆయన ఎజెండా ప్రకారమే రూపుదిద్దుకుంటున్నాయి. విపక్షాల ఊసే లేకుండా అన్నింటా తన ముద్ర వేసుకుంటున్నారు గులాబీ అధినేత. అయితే ఎదురే లేకుండా సాగుతున్న టీఆర్ఎస్ పాలనకు కొన్ని రోజులుగా రివర్స్ సీన్లు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ప్రాజెక్టుల కాల్వలకు గండ్లు, విద్యుత్ కేంద్రాల్లో మంటలు. కాళేశ్వరం పంపులు బంద్, మునిగిన కల్వకుర్తి పంపులు.. ఇలా వరుసగా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కేసీఆర్ సర్కార్ ప్రతిష్ట మసక బారుతున్నట్లు చెబుతున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో కారు పార్టీ నేతల్లో కలవరం కనిపిస్తోంది.
ఇటీవల శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్‌లో అగ్ని ప్రమాదంతో హైడల్ పవర్ జనరేషన్ పూర్తిగా నిలిచిపోయింది. పవర్ స్టేషన్‌లో రిపేర్లు పూర్తి చేశామని, త్వరలోనే కరెంట్ ఉత్పత్తి మొదలు పెడుతామని జెన్‌కో ఆఫీసర్లు చెప్తున్నా.. అది ఇంకా వినియోగంలోకి రాలేదు. ఇంతలోనే శ్రీశైలంపైనే ఆధారపడి నిర్మించిన కల్వకుర్తి పంపుహౌస్ నీట మునగడం దుమారం రేపుతోంది. కల్వకుర్తి పంపులు మునగడంతో శ్రీశైలం నుంచి ఆ ఏడాది చుక్క నీటిని కూడా వినియోగించుకోలేని దుస్థితి తలెత్తింది. ప్రభుత్వం దూరదృష్టితో కాకుండా కొందరు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికి ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వస్తున్నాయి.
2015 సెప్టెంబరులో కూడా ఎంజీఎల్‌ఐ మొదటి లిఫ్టు పూర్తిగా మునిగిపోయింది. అప్పట్లో ఎంజీఎల్‌ఐ నిర్వహణ విషయంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అప్రోచ్ కెనాల్ నుంచి సర్జిఫుల్ షట్టర్లు బిగించకుండా నిర్లక్ష్యం వహించినందుకే మోటార్లు నీట మునిగాయని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అయినా కల్వకుర్తి పంపులపై నిర్లక్ష్యంగా ఉండటం ఆందోళన కల్గిస్తోంది.ఇక ఈ సీజన్ లో జూలైలోనే కృష్ణా నదికి వరదలు వచ్చినా కల్వకుర్తి పంపులు ఆన్ కాలేదు. కరోనాతో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 10 రోజులు పాటు భారీగా వరద పోతున్నా నీటిని ఎత్తిపోయలేకపోయారు. వరదలు వచ్చే సమయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ దగ్గర సరిపడా ఉద్యోగులను కూడా నియమించుకోలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం విప7ాలు ఆరోపించడం అధికార పార్టీని ఇబ్బందుల్లో పడేసింది.
రెండు నెలల క్రితం ఆగస్టులో శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు చనిపోయరు. 220 కేవీకి డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్యానల్ బోర్డులో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్ లో సమస్యలపై ఎన్నిసార్లు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఉద్యోగులు ఆరోపించారు. పవర్ ప్లాంట్ లో మరమ్మత్తు పనులు ఇంకా జరుగుతున్నాయి. మంటలతో ఎంత నష్టం జరిగిందన్న విషయం ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే మంటలు వచ్చినట్లు ఉద్యోగులు కూడా ఆరోపించారు. ప్రమాదం వెనుక నిర్లక్ష్యం, అవినీతి ఉందనడానికి సాంకేతిక ఆధారాలున్నాయని కాంగ్రెస్ తెలిపింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్ మాత్రం సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై దర్యాపు ఇంకా సాగుతూనే ఉంది.
ఇక సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి మూడు గండ్లు.. ఆరు లీకులుగా మారింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ప్రాజెక్టు నాసిరకం పనులతో డేంజర్ గా బెల్స్ మోగిస్తోంది. ప్రారంభించిన నెలల్లోనే కాల్వలకు గండ్ల పడుతున్నాయి. కొండపోచమ్మ జలాశయం కాలువ వద్ద కాంట్రాక్టర్లు నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. జలాశయం కుడికాలువ ద్వారా సంగారెడ్డికి నీటిని విడుదల చేసే కాలువ గేట్ల వద్దకు వెళ్లేందుకు వీలుగా జలశాయం కట్టపై నుంచి ఈ వంతెను నిర్మించారు. కట్టిన మూడు నెలలకే కూలిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్ కు నిటిని తరలించే సోరంగంకు తోగుట మండలం ఎల్లారెడ్డి పేట వద్ద గండి పడింది. ఈ సొరంగం నుంచే నీరు కొండ పొచమ్మ సాగర్ వెళుతోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్ ను నిర్మించారు. అయితే నాసిరకం పనులతోమర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు కొన్ని రోజులకే గండిపడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది.పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేయడం వల్లే గండ్లు పడుతున్నాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వలకు గండ్లు.. పవర్ జనరేషన్ లో కీలకమైన విద్యుత్ కేంద్రాల్లో మంటలు.. పంపు హౌజుల్లోకి వరదలు.. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలతో అదికార పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని విపక్షాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా సాగే పాలన ఎక్కువ రోజులు ఉండదని, అక్రమాలన్ని ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయంటున్నారు. ప్రజాక్షేత్రంలోనూ కేసీఆర్ కు గుణపాఠం తప్పదని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.