ప్రతిరోజు లక్షల మందితో కళకళలాడే పవిత్ర కాబా ఇలా బోసిపోయింది!
posted on Mar 15, 2020 @ 3:42PM
ముస్లింల పవిత్ర ప్రదేశం మక్కా. అక్కడ సంవత్సరంలోని అన్ని రోజులు ముస్లింల తాకిడితో రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడది బోసిపోయింది. మచ్చుకు ఒక్కరు కూడా మక్కాను సందర్శించడం లేదు. ఇదే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ మనుషులు లేక ఖాళీగా ఉన్నాయి. కరోనా వైరస్ భయానికి జనం రావడం లేదు. ఇళ్లలోనే తమను తాము నిర్భందించుకుంటున్నారు. నిర్వాహకులు కూడా వాటిని మూసివేశారు.
కొన్ని సంవత్సరాలుగా జనాల తాకిడితో ఉపశమనం అనేదే లేకుండా ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పుడు ఖాళీగా ఉండడం చూసి పర్యావరణ వేత్తలు తాజాగా 'ప్రపంచం రెస్ట్ తీసుకుంది' అని పేర్కొంటున్నారు. సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదు ప్రస్తుతం ఎడారిగా కనిపిస్తోంది. కరోనా భయంతో జనం రాక సోకకుండా అధికారుల సైతం మక్కాను మూసివేశారు. పవిత్ర మక్కా, మదీనా మసీదులో ప్రార్ధనలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మదీనాలో ప్రవక్త మసీదుతో పాటు మక్కా మసీదుల ఓపెనింగ్, క్లోజింగ్ షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ప్రకటించారు. పవిత్ర కాబాతో పాటు సఫా, మార్వాహ్ మధ్య సయీకి భక్తులను ఎవర్ని అనుమతించడం లేదు. ఉమ్రా పై నిషేధం ఎత్తివేసే వరకు మసీదులో అంతర్గత ప్రార్ధనలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇక ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే రోమ్ లోని వాటికన్ సిటీ చర్చి ఇటలీలోని వెనిస్ లో ప్రసిద్ధ వెనిస్ స్క్వేర్ కూడా జనాలు లేక బోసిపోవడం ఇదే తొలిసారి అట.
ఇవేకాదు.. అమెరికాలో కర్మాగార కేంద్రమైన బోస్టన్ - టోక్కోలోని వీధులు - సువర్ణభూమి విమానాశ్రయం - బ్యాంకాక్ పర్యటక క్షేత్రాలు - పట్టాయా - థాయ్ లాండ్ లో ఖాళీ బీచులు దర్శనమిస్తున్నాయి. ఆస్ట్రేలియా - సింగపూర్ లో ఖాళీ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. అమెరికాలో జనాలు లేని స్టేడియాలు చూస్తే కరోనాకు జనం ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.
కరోనా మహమ్మారి ధాటికి ఇప్పుడు ప్రపంచమే విరామం తీసుకుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆయా పర్యాటక క్షేత్రాల ఫొటోలు చూసి పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.