హై అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోకి కరోనా వైరస్.. అప్రమత్తమైన కేంద్ర వైద్య బృందం..
posted on Jan 29, 2020 @ 11:54AM
చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అన్ని దేశాలకు విస్తరిస్తూ ప్రజల్ని భయపెడుతోంది. హైదరాబాద్ లోనూ కరోనా వైరస్ బాధితుల కోసం 100 పడకలతో వార్డును సిద్ధం చేశారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే గాంధీ లేదా ఫీవర్ ఆసుపత్రికి రావచ్చని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. హైదరాబాద్ లో కరోనా వైరస్ పై వస్తున్న వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు. కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్ధారణ కాలేదని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఈటెల అన్నారు.
మరోవైపు మూడు కేంద్ర ప్రత్యేక వైద్య బృందాలు ఫీవర్ ఆస్పత్రిని సందర్శించారు. ఫీవర్ ఆస్పత్రి వైద్యుల పై కేంద్ర వైద్య బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులలో సరైన వసతులు లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అధికారులకు వైద్య బృందం సూచించింది. కరోనా వైరస్ లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రిలో చేరిన అనుమనితులను నమూనాలు సేకరించారు. పూణేకు పంపిన ఇద్దరు బాధితుల రక్త నమూనాలు నెగిటివ్ అని వచ్చాయి. మరో ఇద్దరికి అలాంటి లక్షణాలు లేవని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్ ను కేంద్ర బృందం పరిశీలించింది. టెక్నికల్ గా ఎలాంటి సపోర్టు కావాలనే అంశంపై ఆరా తీశారు.
అటు విశాఖ ఎయిర్ పోర్టులో కూడా కరోనా అలర్ట్ కొనసాగుతుంది. కరోనా వైరస్ పై ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో వైద్యారోగ్య శాఖాధికారులతో కరోనా వైరస్ పై సమీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కు సంబంధించి కేసులు నమోదు కాలేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కు సంబంధించి ఐదు పడకలతో ప్రత్యేక వార్డు , వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. తిరుపతికి నిత్యం లక్షల మంది భక్తులు వస్తుండడంతో రిఆసుపత్రి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో ఎనిమిది పడకలతో ప్రత్యేక కరోనా వైరస్ వార్డులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక మాస్క్ లు , కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ పై విశాఖ విమానాశ్రయ, కేజీహెచ్, వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేజీహెచ్ లో మూడు పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో పరీక్షించాకే నగరంలోకి అనుమతిస్తున్నారు.