కరోనాతో బెంబేలు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధం
posted on Apr 15, 2020 @ 8:36PM
ఏపీలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న గుంటూరు జిల్లాపై ప్రభుత్వానికి ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పొరుగు జిల్లాలలో ఉన్న రహదారులను పూర్తిగా మూసేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా తొలుత కృష్ణాజిల్లాతో ఉన్న సంబంధాలను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు జిల్లాల మధ్య ఉన్న సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రాకపోకలపైనా నిషేధం విధిస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వద్ద సమీపంలోని పులిగడ్డ -పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. వీరికి ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని పోలీసులు చెబుతున్నారు. అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను అధికారులు బంద్ చేశారు. ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగులను సైతం అనుమతించేది లేదని పోలీసులు చెప్తున్నారు.