దేవాలయాల్లో వరస దుర్ఘటనల వెనక కుట్ర కోణం?
posted on May 6, 2025 @ 11:52AM
వారం రోజుల కిందట ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. అంతకు ముందు రోజు రాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది. ఆ తర్వాత మూడు రోజులకు మే 3న గోవాలో మరో ఘోర విషాదం జరిగింది. శిర్గావ్‌లోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా భక్తులు త్రీవంగా గాయపడ్డారు.
వివరాలలోకి వెళితే.. శిర్గావ్ లోని శ్రీ లైరాయ్ ఆలయంలో వార్షిక జాతర అదే రోజు ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న 'నిప్పులపై నడిచే' కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ కావడం వల్ల భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నార్త్ గోవా పోలీసులు వెల్లడించారు.
ఆ తర్వాత సోమవారం(మే 5) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లో నెలకొన్ని ప్రపంచ ప్రఖ్యాత మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం చెలరేగింది. దట్టమైన పొగలు సుమారు కిలోమీటరు వరకూ వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆలయ శంఖ ద్వారం, సిసీటీవీ కంట్రోల్ రూమ్‌కు పైనున్న రూఫ్ వద్ద మంటలు చెలరేగగా, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. హుటాహుటిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.ప్రమాదంలో ఎవరూ మరణించినట్టు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
ఒక వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ మూడు సంఘటనలు (ఇంకా మన దృష్టికి రానివి ఉన్నా ఉండవచ్చు) వేటికవిగా చూస్తే, ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు, కానీ, ఒకదాని వెంట ఒకటిగా జరిగిన ఈ సంఘటనల పూర్వపరాలను, సమయ సందర్భాలను గమనిస్తే ఎంతో కొంత అనుమానాలకు ఆస్కారం లేక పోలేదని అంటున్నారు.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయలాపై జరిగిన దాడులు, ఆ సందర్భంగా అప్పటి మంత్రులు స్పందించిన తీరును గుర్తుచేసుకుంటే, అవే కుట్రలు ఇప్పటికీ కోనసాగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు,అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరపతి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు ఆ పార్టీ, ఆపార్టీ ప్రచార మాధ్యమాలు కొనసాగిస్తూనే ఉన్నాయని హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ దుర్ఘటన విషయంలో వైసీపీ స్పందించిన తీరు అనుమానాలకు ఆస్కారం కల్పించే విధంగా ఉందని అప్పట్లోనే ఆరోపణలు వినవచ్చాయి. ఇక గత నెల (ఏప్రిల్)లో వైసేపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో మూడు నెలల వ్యవధిలో ఏకంగా 100 కి పైగా ఆవులు నిర్వహణ లోపం కారణంగా చనిపోయాయని ఆరోపించారు.అంతే కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగరాని ఘోరాలన్నీ జరిగిపోతున్నాయని భక్తులను తప్పు తోవట్టించేందుకు భూమన, జగన్ ఇతర వైసీపీ నాయకులు సొంత మీడియాను వేదిక చేసుకుని పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేశారు.
నిజానికి.. వైసీపీ అధినేత జగన్ రెడ్డి హిందూ వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అన్యమతస్థులు, వెంకన్న దేవుని పై విశ్వాసాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక రిజిస్టర్ లో సంతకం చేయాలన్న నిబంధన ఎప్పటి నుంచో వుంది. మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాం వంటి ఎందరో పెద్దలు దేవాలయ మర్యాదను పాటించారు. కానీ, జగన్ రెడ్డి మాత్రం ఏనాడు తమ విశ్వాసాన్ని ప్రకటించలేదు సరి కదా, ఆ నిబంధనే తప్పని పరోక్షంగానే అయినా ఆయనేమి దేవుడు అనే అర్థం వచ్చేలా వెంకన్న స్వామినే నిందించారు.
ఈ పరిణామాలను గమనిస్తే తిరుమల సహా రాష్ట్రంలో, దేశంలో ఉన్న హిందూ దేవాలయాల పవిత్రతను, హిందువుల విశ్వాసాని దెబ్బ తీసేందుకు నిరంతర కుట్రలు జరుగుతున్నాయా? అంటే మొన్న తిరుపతిలో, నిన్న సింహాచలంలో, ఆ వెంట గోవా, ఉజ్జయిని (ఎంపీ) లో జరిగిన సంఘటనలు గమనిస్తే.. కుట్ర కోణాన్ని కొట్టివేయలేమని అంటున్నారు.