ఛత్తీస్ గఢ్ ఎన్నికలలో విజయం కాంగ్రెస్ దే.. పీపుల్స్ పల్స్ సర్వే
posted on Nov 4, 2023 @ 10:00AM
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ముందంజలో ఉందని, ఆ పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలలో అసంతృప్తి లేకపోవడం ఒక కారణం కాగా.. ప్రధాన కారణం మాత్రం రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించకపోవడమేనని అంటున్నారు. దీంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.
బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్ కు ప్రత్యామ్నాయంగా బలమైన నేతను తెరపైకి తీసుకురావడంలో బీజేపీ విఫలమైంది. అంతే కాకుండా రాష్ట్ర పార్టీపై బీజేపీ అధిష్ఠానం పట్టు పూర్తిగా సడలిపోవడంతో ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు దీటుగా ఎదగడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇంత ప్రతికూలతలో కూడా గత ఎన్నికల కంటే బీజేపీ ఒకింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే అదే సమయంలో ఆ పెరిగిన బలం రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు ఇసుమంతైనా దోహదపడదని చెబుతున్నాయి.
ఛత్తీస్ గఢ్ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ నిర్వహించిన ప్రీపోల్ సర్వే మేరకు కాంగ్రెస్ రాష్ట్రంలో 55 నుంచి 60 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం 38 నుంచి 34 స్థానాలకు పరిమితం అవుతుంది. బీఎస్పీ, ఇతరులు కలిసి రెండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లో అధికారం చేపట్టాలంటే కనీసం 46 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. పీపుల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానాలు సాధించడం నల్లేరుమీద బండి నడకే. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నా రెండింటి మధ్యా అంతరం మాత్రం భారీగా ఉందనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమనీ పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. ఇలా ఉండగా గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటు శాతం కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ 43 శాతం ఓట్లు దక్కించుకుంటే ఈ సారి అది 47శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా గత ఎన్నికలలో 33 శాతం ఓట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పడు 42 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.