కాంగ్రెస్ : ఆంధ్రా నేతలకు ‘టి’ నేతల సవాల్ !
posted on Dec 27, 2012 @ 5:59PM
రేపు ఢిల్లీ లో తెలంగాణాఫై అఖిల పక్ష సమావేశం జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని సీమంధ్రా నేతలఫై అదే పార్టీకి చెందిన తెలంగాణా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వారే అడ్డుపడుతున్నారని తెలంగాణా నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణా వాదాన్ని వినిపించే వారినే ఈ సమావేశానికి పంపించాలని ఈ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా కు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణాకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవాలని పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాము కోరితేనే ఈ సమావేశం జరుగుతున్నందున పార్టీ ప్రత్యెక రాష్ట్రానికి కట్టుబడి ఉండాలని వారంటున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఇస్తే, తమ ప్రాంతం నుండి 19 సీట్లను పార్టీకి అందిస్తామని ‘టి’ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒక వేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోతే, సీమంధ్రా ప్రాంతం నుండి అన్ని సీట్లలో కాంగ్రెస్ అభ్యర్దులను వారు గెలిపించగలరా అని ఆ ప్రాంత పార్టీ నేతలను ‘టి’ నేతలు ప్రశ్నిస్తున్నారు.